‘ఖాళీ’శాలలు!

ABN , First Publish Date - 2020-11-30T04:47:06+05:30 IST

‘ఖాళీ’శాలలు!

‘ఖాళీ’శాలలు!


సగం కూడా నిండని ఇంజనీరింగ్‌ సీట్లు 

ఉమ్మడి జిల్లా కళాశాలలపై సన్నగిల్లిన ఆసక్తి

ఒక్క అడ్మిషన్‌ కూడా కానివి రెండు కాలేజీలు

కొత్త బ్రాంచ్‌లు పెట్టినా అదే పరిస్థితి

ఖమ్మం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఖమ్మం జిల్లా ఒక హబ్‌. ఇక్కడి ప్రమాణాలతో ఎంతో మంది విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇది ఒకప్పటి మాట. గతంలో కళకళలాడిన ఉమ్మడి జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రస్తుతం ‘ఖాళీ’శాలలుగా మారాయి. ఇక్కడి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పట్టాలు పొందిన లక్షలాదిమంది విద్యార్థులు వాటిని చేతపట్టుకుని ఉద్యోగాల కోసం దేశంలోని పలు ముఖ్య నగరాల్లోని కంపెనీల మెట్టు ఎక్కిదిగుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఆ కారణంగానే మూడేళ్లుగా యువత ఖమ్మం జిల్లాలోని ఒకటి రెండు కళాశాలలు మినహా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్నదానికి మిగులుతున్న సీట్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఫలితంగా పలు కళాశాలలను మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది కూడా అదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ తుది కౌన్సెలింగ్‌ కూడా పూర్తవగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సీట్లలో సగం సీట్లు కూడా నిండకపోవడం గమనార్హం. 

ఆసక్తి చూపని యువత..

సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత లోపించి.. ఉద్యోగాల కోసం నానాతంటాలు పడటం లాంటి కారణాలతో యువత జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు ఇష్టపడటంలేదు. దీంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఉన్న 22 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కొన్ని గతంలోనే మూతపడ్డాయి. అయితే ప్రస్తుతం 12 కళాశాలలు నడుస్తుండగా వాటిల్లోనూ సగం సీట్లు కూడా నిండని పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో చాలా కళాశాలల్లో ఉన్న ఫ్యాకల్టీలలో ఆయా కళాశాలల్లో చదివిన బీటెక్‌ విద్యార్థులే ఉండటం, నాణ్యమైన విద్యను అందించలేకపోవడం, ఇక్కడ ఉన్న రూరల్‌ కళాశాలల్లో ప్లేస్‌మెంట్స్‌ రాకపోవడం, ఒకవేళ వచ్చినా సరైన ఉద్యోగాలు లభించకపోవడం లాంటి పలు రకాల సమస్యలు ఉమ్మడి జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఉన్నాయి. కాగా ఇక్కడ ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకుంటే వారిలో 60 శాతం మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పించడానికి ఇష్టపడకపోవడంతోపాటుగా, యువత సైతం కెరీర్‌ బ్యాలెన్సింగ్‌లో భాగంగా ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. హైద్రాబాద్‌ లాంటి పలు ప్రముఖ నగరాల్లోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఫలితంగా ఇక్కడి సీట్లన్నీ ఖాళీలుగానే ఉంటున్నాయి. 

ఒక్కసీటు కూడా నిండని రెండు కళాశాలలు..

ఉమ్మడి జిల్లాలోని 12 కళాశాలల్లో ఎనిమిది బ్రాంచిల్లో 2,374 సీట్లున్నాయి. వాటిల్లో ఈ ఏడాది కేవలం 975 సీట్లు మాత్రమే నిండటం గమనార్హం. సివిల్‌లో 294 సీట్లు ఉండగా 149, సీఎస్‌ఈలో 347సీట్లు ఉండగా 208, ఈఈఈలో 504 సీట్లు ఉండగా 229, ఈసీఈలో 494 కి గాను 193, మెకానికల్‌లో 252కి 33, మైనింగ్‌లో 126కి 31, సీఎస్‌ఎం (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ ఆర్టిఫిసియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌)లో 294 సీట్లకుగాను 121, ఏఎస్‌డీ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ డేటా సైన్స్‌)లో 63సీట్లకుగాను 11సీట్లు మాత్రమే నిండగా మిగిలిన సీట్లు ఖాళీగానే మిగిలాయి. కాగా ఆయా సీట్లు సైతం కొన్ని కళాశాలల్లోనే ఎక్కువగా భర్తీ అయ్యాయి. ఖమ్మం రూరల్‌ మండలంలో ఉన్న ఓ కళాశాల, కారేపల్లి మండలంలోని మరో కళాశాలలో ఒక్కసీటు కూడా భర్తీ కాలేదు. దానితోపాటు రూరల్‌ ప్రాంతాల్లోని మరికొన్ని కళాశాలలది అదే పరిస్థితి. ఓ కళాశాలలో 200 సీట్లు ఉంటే కేవలం 43, మరో కళాశాలలో 294 సీట్లు ఉంటే 94 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన కళాశాలల్లోనూ సగం మాత్రమే సీట్లు నిండాయి. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఇంజనీరింగ్‌ కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని పలు యాజమాన్యాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

కన్సల్టెన్సీల వద్దకు వెళ్లినా.. కల్యాణలక్ష్మి ఇప్పిస్తామన్నా... 

కళాశాలల్లో సీట్లు నింపుకొనేందుకు పలు కళాశాలల నిర్వాహకులు కన్సల్టెన్సీలను ఆశ్రయించారు. ఇంటర్‌లో ఎంపీసీ చదివిన విద్యార్థులు బీటెక్‌లో చేర్పించినందుకు కొన్ని కళాఽశాలలు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు సంబంధిత కన్సల్టెన్సీలకు ముట్టచెప్పాయి. దీంతోపాటు కళాశాల యాజమాన్యాలు పలు రకాల బంపర్‌ ఆఫర్లు కూడా ఇచ్చారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి ఇప్పించడంతోపాటుగా పేదవారైతే డబుల్‌బెడ్‌ రూం ఇల్లు కూడా ఇప్పించేలా ఒప్పదం చేసుకున్నాయి. అయినా కూడా ఆయా కళాశాలల్లో సీట్లు నిండని పరిస్థితి ఏర్పడింది. కాగా మరికొన్ని కళాశాలల వారు ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌ ఆర్టిఫిసియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ డేటా సైన్స్‌ కొత్త బ్రాంచిలు తీసుకొచ్చారు. అయినా ఆయా కళాశాలల్లో సదరు బ్రాంచిల్లోనూ సీట్లు నిండని పరిస్థితి ఉంది.


ఉమ్మడి జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బ్రాంచీల వారీగా సీట్ల వివరాలు..

బ్రాంచ్‌ మొత్తం నిండినవి ఖాళీలు

సివిల్‌ 294 149 145

సీఎస్‌ఈ 347 208 139

ఈసీఈ 494 193 301

ఈఈఈ 504 229 275

మెకానికల్‌ 252 33 219

సీఎస్‌ఎం 294 121 173

సీఎస్‌డీ 63 11 52

మొత్తం 2374 975 1399


Updated Date - 2020-11-30T04:47:06+05:30 IST