Advertisement

తెలుగులో ఇంజనీరింగ్?

Dec 1 2020 @ 00:23AM

వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఐఐటిలలో, ఎన్ఐటిలలో హిందీలోను, ప్రాంతీయ భాషలలోనూ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభిస్తామని కేంద్రవిద్యాశాఖ గత గురువారం నాడు చేసిన ప్రకటన, కొంతకాలంగా సద్దుమణిగిన నూతన విద్యావిధానం చర్చను మరొకసారి వేదిక మీదకు తెచ్చింది. 22 ప్రాంతీయ భాషలలో ఉన్నత విద్యను అందించాలని నూతన విద్యావిధానం సంకల్పించింది. దేశభాషలకు విద్యారంగంలోను ఆదరణ కొరవడుతున్న సమయంలో, కస్తూరి రంగన్ చేసిన సిఫార్సులు, వాటిని కేంద్రం ఆమోదించడం కొత్త ఆశలు కలిగించాయి. క్షేత్రస్థాయిలో ప్రాంతీయ భాషల క్షీణతను, ఆంగ్ల మాధ్యమం విస్తరణను, భాషారక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనాసక్తతను దృష్టిలో పెట్టుకుంటే, నూతన విద్యావిధానం చెప్పుకున్న సంకల్పం ఆచరణలో సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయమూ ఏర్పడింది. కానీ, కేంద్ర విద్యాశాఖ ఉన్నట్టుండి, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రాంతీయ భాషలలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దేశభాషలను ఆదరించాలన్న విలువతో విభేదించకుండానే, ఇంజనీరింగ్ విద్యారంగంలో ఉన్నవారు ప్రభుత్వ నిర్ణయాన్ని అనేక రకాలుగా తప్పు పడుతున్నారు. ముఖ్యంగా ఇంత స్వల్ప వ్యవధిలో ప్రాంతీయ భాషలో శాస్త్ర వైజ్ఞానిక సాంకేతిక విద్యను అందించడం సాధ్యం కాదన్నది వారి ప్రధాన ఫిర్యాదు. 


నిజానికి ఈ చర్చ ఒక కోణం నుంచి చూస్తే హాస్యాస్పదంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలనే తీసుకుందాం. విద్య మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషులోకి మార్చడమే కాకుండా, దానిని బడుగు ప్రజల సాధికారతా యత్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. తెలంగాణలో పరిస్థితి కొద్దిగా మెరుగు. తెలుగును ఒక అంశంగా ఒక దశ వరకు విధిగా బోధించాలన్న సూత్రాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఆచరణలో దానిని కఠినంగా అమలుచేస్తున్నారా అంటే చెప్పలేము. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు తెలుగు మాధ్యమం ఉన్నది. ఇంగ్లీషు మీడియం కూడా వచ్చిచేరిన తరువాత, అక్కడ తెలుగు మీడియం క్షీణించిపోవడం ఖాయం. ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక, ఉన్నత తరగతులు బోధించగలిగే ఉపాధ్యాయుల కొరత ఉన్నది కాబట్టి, మాధ్యమం మార్పిడి సంపూర్ణం కావడానికి దీర్ఘకాలమే పట్టవచ్చు. ఇక్కడ తెలుగును వదిలించుకునే ప్రయత్నం ఇంత క్రియాశీలంగా చేస్తూ, ఇప్పటి వరకు ఉన్న భాషావ్యవస్థలను నిరాదరిస్తూ, ఆధునిక అవసరాల కోసం భాషను తీర్చిదిద్దే కర్తవ్యాన్ని విస్మరిస్తున్నప్పుడు.. తెలుగులో ఉన్నత విద్యా సామగ్రి ఎట్లా రూపొందుతుంది? తెలుగులో ఇంజనీరింగ్‌ను బోధించేది ఎవరు? 


భాష అభివృద్ధి అంటే దాన్ని మాట్లాడేవారి అభివృద్ధే. ఇంగ్లీషు భాష ఇంత విస్తృతంగా వాడకంలో ఉన్నదంటే, ఆధునిక భాషగా, మాధ్యమ భాషగా, వారధి భాషగా అది విస్తరించిందంటే అందుకు కారణం, ఆ భాష మాట్లాడేవారు పారిశ్రామిక, వైజ్ఞానిక, వాణిజ్యరంగాలలో సాధించిన అభివృద్ధే. దాదాపు ఏడెనిమిది దశాబ్దాల కిందట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి నైజాం ప్రభుత్వం అనువాద విభాగాన్ని ఏర్పాటు చేసింది. వైద్యం, శాస్త్ర విజ్ఞానం కూడా ఉర్దూలో బోధింపజేయడానికి వీలుగా ఆ భాషలో సాంకేతిక పద నిర్మాణానికి, పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ఆ విభాగం పనిచేసింది. ఆ ప్రయత్నం దీర్ఘకాలం కొనసాగలేదు. ఏ భాషలో అయినా జ్ఞానాన్ని అభ్యసించవచ్చు. కానీ, జ్ఞానాన్ని విద్యగా మలచేందుకు కొంత కృషి అవసరం అవుతుంది. తెలుగులో సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాల పుస్తకాల తయారీకి తెలుగు అకాడమీ ఏర్పడింది. ఆ సంస్థ అవసరమా అని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకుంటున్నాయి. విభజన పంపకాలలో మాకు వద్దంటే మాకు వద్దని తోసిపారేస్తున్నాయి. తెలుగు అకాడమీ రూపొందించిన పరిభాష ఎట్లా ఉన్నదనేది వేరే విషయం కానీ, ఇంజనీరింగ్‌ను తెలుగులో నేర్చుకోవాలనుకుంటే అటువంటి సంస్థ ఒకటి ఉండాలి కదా? 


ప్రాంతీయ భాషల పేరుతో హిందీవారు నూతన విధానపు సదుపాయాన్ని అధికంగా ఉపయోగించుకుంటారు. హిందీని అభివృద్ధి చేసే కృషి, కేంద్రప్రభుత్వ ఖర్చుతోనే, దీర్ఘకాలంగా సాగుతున్నది. ప్రతి కేంద్రప్రభుత్వ విభాగంలోనూ కార్యాలయంలోనూ హిందీ ఆఫీసర్లు ఉంటారు. రోజుకో పదం నేర్పిస్తుంటారు. హిందీలో పరిభాషా కల్పన, దానికి ప్రాచుర్యం కల్పించడం కూడా సులువుగానే జరుగుతుంది. ఇప్పటికే సివిల్స్ అన్నిదశల్లోనూ హిందీతోనే నెగ్గుకువచ్చే అవకాశం ఉన్నది. ఆ భాష మాతృభాషగా ఉన్నవారికి అది అదనపు అవకాశమే కదా? ఉత్తరాది వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇంగ్లీషు మాట్లాడడంలో, అలవర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, వారికి తమ సొంతభాషలో ఐఐటిల వంటి విశిష్ట సంస్థలలో చదువుకునే అవకాశం నూతన విధానం కల్పిస్తుంది. మాతృభాష మనకు అవకాశాలివ్వదు, ఇంగ్లీషే ఇస్తుంది అని ఇక్కడ అనుకుంటుంటే, ఇంగ్లీషును దాటవేసి, సొంతభాషలో ఇంజనీర్లమవుదాం అని అక్కడ అనుకుంటున్నారు. ఇంగ్లీషు మీడియంలోనే కోర్సు కొనసాగించినా, భాష విషయంలో ఇబ్బందులు ఉన్నవారి కోసం ప్రాంతీయ భాషల విభాగాలు కూడా అటువంటి సంస్థలలో ఏర్పాటు చేసి, అదనపు బోధన అందించవచ్చునని కొందరు సూచిస్తున్నారు. సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనుకబడిన శ్రేణుల వారికి రిజర్వేషన్లు కల్పించి విశిష్ట సంస్థలలో ప్రవేశాలు ఇస్తున్నప్పుడు, వారికి భాషాపరంగా ఎదురయ్యే అవరోధాలను సరిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని, దేశభాషల సాయంతో ఇంగ్లీషుతో ఉన్న దూరాన్ని తగ్గించవచ్చునని నిపుణుల అభిప్రాయం. 


నూతన విద్యావిధానంలో చెప్పినట్టు ప్రాంతీయ భాషలలో ఉన్నత విద్యా బోధనను అమలు చేయాలనుకునేముందు, ఆయా భాషల విషయంలో ఆధునిక నిఘంటువుల వంటి కనీస వ్యవస్థలు ఉన్నాయో లేదో గమనించాలి. ఉన్నత విద్యాంశాలకు అనుగుణంగా భాషకు హంగులు కల్పించే చర్యలు చేపట్టాలి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.