ఇంజనీరింగ్‌ ప్రవేశాలు షురూ!

ABN , First Publish Date - 2021-10-26T05:35:16+05:30 IST

జిల్లాలో 22 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉండగా 11 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది కళాశాలలకుపైగా డిమాండ్‌ ఉంది.

ఇంజనీరింగ్‌ ప్రవేశాలు షురూ!

నేటినుంచి వెబ్‌ఆధారిత కౌన్సెలింగ్‌

ఈ ఏడాది కొత్త కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి

వచ్చేనెల 15 నుంచి తరగతులు

నెల్లూరులో హెల్ప్‌లైన్‌ కేంద్రం 


జిల్లాలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల సందడి ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా (ఎంపీసీ స్ట్రీమ్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌-2021 కౌన్సెలింగ్‌ మంగళవారం ప్రారంభమవుతుంది. ఇందుకోసం నెల్లూరులోని వెంకటేశ్వరపురం బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనతో కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. 


నెల్లూరు (విద్య) అక్టోబరు 25 : జిల్లాలో 22 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉండగా 11 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది కళాశాలలకుపైగా డిమాండ్‌ ఉంది. వీటితోపాటు జేఎన్‌టీయూ పరిధిలో ఉన్న 119 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 20 కళాశాలలకుపైగా డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది తొలిసారిగా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లోని 35శాతం సీట్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. వీటికి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లను వర్తింప చేయనున్నారు. జిల్లాలో  ఇంజనీరింగ్‌, వైద్య, వ్యవసాయ విభాగాలకు మొత్తం 16వేల మంది విద్యార్థులకుపైగా ఆన్‌లైన్‌లో పరీక్షకు హాజరవగా 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటికే ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజుల చెల్లింపు జరిగింది. మంగళవారం నుంచి 30వతేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థుల ఽద్రువపత్రాలను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు.  సందేహాల నివృత్తి కోసం నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 


 ప్రవేశాలకు షెడ్యూల్‌...

నవంబరు 1 నుంచి 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ద్వారా కోర్సులు, కళాశాలల ఎంపిక, 6వ తేదీన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన సీట్ల కేటాయింపులు, 10 నుంచి 15వ తేదీ వరకు కళాశాలల్లో రిపోర్టింగ్‌,  15 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌, ర్యాంకు కార్డు, పది, ఇంటర్‌ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితా, నాలుగు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కన్వీనర్‌ జి.సుధాకర్‌రావు తెలిపారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఫోన్‌ 8106876345, 8106575234, 7995865456 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. 


ఇంజనీరింగ్‌లో నూతన కోర్సులు..

పోటీ ప్రపంచంలో సాంకేతికత అనుసంధానంతో నూతన ఆవిష్కరణలే ధ్యేయంగా 2020-21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటాసైన్స్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, త్రీడీ ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్‌, ఆగ్యుమెంటేషన్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. 



 


Updated Date - 2021-10-26T05:35:16+05:30 IST