ఇంజనీరింగ్‌ విద్యార్థి శతావధానం

ABN , First Publish Date - 2022-06-30T18:01:25+05:30 IST

బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో మంగళవారం గన్నవరం లలితాదిత్య శతావధాన కార్యక్రమం ప్రారంభమైంది. లలితాదిత్య అమెరికాలో

ఇంజనీరింగ్‌ విద్యార్థి శతావధానం

 అమెరికాలో పుట్టి పెరిగిన గన్నవరపు లలితాదిత్య

 తెలంగాణ సారస్వత పరిషత్‌ వేదికగా 

3 రోజుల అవధానం 

నేడు ముగింపు కార్యక్రమం


హైదరాబాద్‌ సిటీ: బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో మంగళవారం గన్నవరం లలితాదిత్య శతావధాన కార్యక్రమం ప్రారంభమైంది. లలితాదిత్య అమెరికాలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు డా. కే.వీ.రమణాచారి అధ్యక్షత వహించారు. మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత, గరికపాటి నరసింహారావు విశిష్టఅతిథిగా, సాహితీవేత్త శ్రీరంగాచార్యులు, సంస్కృత శతావధాని దోర్బల ప్రభాకరశర్మ, శతావధాని పంచానన డా. జీఎం.రామశర్మ, శతావధాని చంద్ర ఐతగోని వేంకటేశ్వర్లు, అచ్చ తెలుగు శతావధాని కుదురాటగండ డా. పలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, డా. ధూళిపాళ మహదేవమణి, శతావధాని శిరోమణి శ్రీ గండ్లూరి దత్తాత్రేయశర్మ, సినీనటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శనమ్‌ సంపాదకులు ఎం.వీ.ఆర్‌.శర్మ, తెలంగాణ గురుకుల విద్యాలయాల విశ్రాంత ప్రధానాచార్యులు మరుమాముల దత్తాత్రేయ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.


బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొప్పరపు కవుల వేదికగా సాగిన శతావధానంలో మూడు నిషిద్ధాక్షరులలో చివరి రెండుపాదాలు, 24 సమస్యాపూరణాలలో చివరి రెండు పాదాలు, 12 దత్తపదులలో చివరి రెండు పాదాలను అత్యద్భుత ధార, ధిషణ, సద్యస్ఫురణలతో అవధాని లలితాదిత్య పూర్తిచేశారు. ఏడు ఆశువు అంశాలకు పూర్తి పద్యాలను అప్పటికప్పుడే వినిపించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి శిరిశినహళ్‌ కృష్ణమాచార్య వేదికలో అవధానం ప్రారంభమైంది. ధూళిపాళ మహదేవమణి గౌరవ అతిథిగా విచ్చేశారు. సభలో దత్తపదులలో మిగిలిన చివరి రెండు పాదాలను, 24 వర్ణనలలో రెండవ, మూడవ పాదాలను వేగవంతంగా అవధాని పూరించారు. మూడు ఆశువు అంశాలకు అవధాని సమాధానమిచ్చారు. పండితులు, ఉభయభాషా కోవిదులు శ్రీ రంగి సత్యనారాయణ  రసస్ఫోరకంగా చమత్కార సంభాషణతో అప్రస్తుతం నిర్వహించారు. శతావధాన నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే.వీ.రమణాచారి, గౌరవ అతిథులు డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, డా. ధూళిపాళ మహదేవమణిను సత్కరించారు.


రెండు రోజుల్లో మూడు నిషిద్ధాక్షరి అంశాలు, 24 సమస్యాపూరణలు, 24 దత్తపదులు, 24 ఆశువులను అవధాని పూర్తి చేశారు. 24 వర్ణనాంశాలలో రెండు పాదాల చొప్పున లలితాదిత్య పూర్తిచేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మూడో రోజు శతావధానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు విజయోత్సవ సభలో శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ పాల్గొననున్నట్లు రమణాచారి తెలిపారు.

Updated Date - 2022-06-30T18:01:25+05:30 IST