వామ్మో.. బాజ్‌బాల్‌!

ABN , First Publish Date - 2022-07-06T10:00:41+05:30 IST

278, 299, 296, 378.. ఇవేమీ వన్డేల్లో జట్టు స్కోర్లు కావు. ఇంగ్లండ్‌ వరుసగా నాలుగు టెస్టుల్లో ఛేదించిన భారీ లక్ష్యాలు.

వామ్మో.. బాజ్‌బాల్‌!

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): 278, 299, 296, 378.. ఇవేమీ వన్డేల్లో జట్టు స్కోర్లు కావు. ఇంగ్లండ్‌ వరుసగా నాలుగు టెస్టుల్లో ఛేదించిన భారీ లక్ష్యాలు. ఇతర ఏ జట్టుకైనా ఇలాంటి ఛేదనలు అసాధ్యం కావచ్చేమో కానీ.. ఇప్పుడు ఇంగ్లండ్‌ టీమ్‌ ‘బాజ్‌బాల్‌’ గేమ్‌తో ఔరా.. అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌లు ఆడే విధానం చూసిన అభిమానులకు వారి దూకుడు అర్థమయ్యే ఉంటుంది. దీనికంతటికీ కారణం బ్రెండన్‌ మెకల్లమ్‌. ప్రపంచ క్రికెట్‌లో మెకల్లమ్‌కు విధ్వంసకర ఓపెనర్‌గా పేరుంది. ఏ ఫార్మాట్‌లోనైనా ఒకే రీతిలో ఆడేబ్రెండన్‌ ఇంగ్లండ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు.


రూట్‌ స్థానంలో బెన్‌ స్టోక్స్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా వచ్చాడు. ఇక ఈ ఇద్దరి కలయికతో ఇంగ్లిష్‌ టీమ్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. విప్లవాత్మక ఆటతీరుతో ఎంతటి లక్ష్యమైనా తమకు తక్కువే అన్న రీతిలో ప్రత్యర్థి జట్లను బెదరగొడుతోంది. వీళ్ల వ్యూహానికి తొలిసారిగా న్యూజిలాండ్‌ బలైంది. బ్రెండన్‌ మెకల్లమ్‌ నిక్‌నేమ్‌ బాజ్‌. తక కోచ్‌ శైలిలోనే బంతిపై విరుచుకుపడుతూ భారీ ఛేదనలను ఇంగ్లండ్‌ జట్టు అవలీలగా ముగిస్తుండడంతో ‘బాజ్‌బాల్‌’ పేరు వాడుకలోకి వచ్చింది.


భారత్‌తో మ్యాచ్‌కు ముందు కివీ్‌సతో జరిగిన మూడు టెస్టుల్లో ఎదురైన ఛేదనల్లోనూ ఇంగ్లండ్‌ 69/4, 93/4, 51/2తో వెనుకబడినా.. సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేయగలిగింది. ఇప్పుడు చివరి టెస్టులోనూ భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించినా బెదరలేదు. ఏకంగా 378 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు సెషన్లు ఉండగానే పూర్తి చేయడంతో బుమ్రా సేన బిత్తరపోవాల్సి వచ్చింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ రూట్‌ మూడు, బెయిర్‌స్టో నాలుగు సెంచరీలతో అదరగొట్టారు. అందుకే మున్ముందు ఇతర టెస్టు జట్లు కూడా ఇంగ్లండ్‌ తరహా ఆటను నమ్ముకుంటాయనడంలో సందేహం లేదు. తద్వారా టెస్టు ఫార్మాట్‌ మరింతగా అభిమానులను ఆకర్షించవచ్చు. 

Updated Date - 2022-07-06T10:00:41+05:30 IST