ప్రేక్షకుల మధ్య టీ20 సిరీస్‌?

ABN , First Publish Date - 2021-01-25T09:36:43+05:30 IST

కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ యూఏఈకి తరలిపోయింది. ఇక వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు కూడా ప్రేక్షకులకు అనుమతి లేదు...

ప్రేక్షకుల మధ్య టీ20 సిరీస్‌?

  • ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ముందుగానే భారత్‌ వచ్చేశాడు. ఈ సందర్భంగా విమానంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన స్టోక్స్‌.. త్వరలోనే కలుద్దాం అంటూ ట్వీట్‌ చేశాడు.  

న్యూఢిల్లీ: కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ యూఏఈకి తరలిపోయింది. ఇక వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు కూడా ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో కనీసం ఐదు టీ20ల సిరీ్‌సకైనా స్టేడియాల్లోకి ఫ్యాన్స్‌ను అనుమతించాలని బీసీసీఐ భావిస్తోందట. అదే జరిగితే నిజంగా అభిమానుల సంతోషానికి అవధులుండవు. ఎందుకంటే.. దాదాపు ఏడాది కాలంగా భారత క్రికెటర్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించలేకపోయారు. మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో టీ20 సిరీస్‌ జరుగుతుంది. లక్షకు పైగా సీటింగ్‌ సామర్థ్యం కలిగి ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ క్రికెట్‌ స్టేడియంగా మొతేరా పేరు తెచ్చుకుంది. ‘భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగే టీ20 మ్యాచ్‌లను వీక్షించేందుకు స్టేడియం గేట్లను తెరవాలని యోచిస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో అనుమతించడం సాధ్యం కాదు కాబట్టి 50 శాతం వరకు ఓకే చేయాలనుకుంటున్నాం. కానీ తుది నిర్ణయం మాత్రం కేంద్రం తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ప్రేక్షకుల భద్రతే ముఖ్యం’ అని బోర్డు ఉన్నతాధికారి తెలిపాడు.  


Updated Date - 2021-01-25T09:36:43+05:30 IST