చరిత్రను బద్దలు కొడుతూ..

ABN , First Publish Date - 2022-07-06T10:04:16+05:30 IST

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ 2-2తో సమమైంది. ఫలితమేమిటో నాలుగో రోజే తేలినా..

చరిత్రను బద్దలు కొడుతూ..

378 పరుగుల రికార్డు ఛేదన

చివరి టెస్టులో ఇంగ్లండ్‌ ఘనవిజయం

2-2తో సిరీస్‌ సమం

రూట్‌, బెయిర్‌స్టో శతకాల మోత 

7 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి


టెస్టుల్లో ఇంగ్లండ్‌కిదే భారీ ఛేదన (378). మూడేళ్ల కిత్రం ఆసీస్‌పై 359 పరుగులదే ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. అలాగే భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక ఛేదన.

 ఇంగ్లండ్‌ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు నమోదవడం 1939 తర్వాత ఇదే తొలిసారి. 

తొలి ఇన్నింగ్స్‌లో 100+ఆధిక్యం లభించినా ఓడడం భారత్‌కిది రెండోసారి.

బర్మింగ్‌హామ్‌: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ 2-2తో సమమైంది. ఫలితమేమిటో నాలుగో రోజే తేలినా.. భారత బౌలర్ల నుంచి అద్భుతమేమైనా జరుగుతుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. మంగళవారం మరింత చెత్తగా బంతులు వేయడంతో జో రూట్‌ (142 నాటౌట్‌), బెయిర్‌స్టో (114 నాటౌట్‌) స్వేచ్ఛగా ఆడి అజేయ శతకాలు సాధించారు. దీంతో ఐదో టెస్టులో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.


378 పరుగుల ఛేదనను కేవలం మూడు వికెట్లు కోల్పోయి మరో రెండు సెషన్లుండగానే ముగించేసింది. ఈ వేదిక ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటిదాకా భారత్‌ 8 టెస్టులు ఆడితే 7 ఓడగా.. ఓ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బెయిర్‌స్టో.. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా బుమ్రా, రూట్‌ నిలిచారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416, రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 284 రన్స్‌ చేసింది. స్టోక్స్‌ సేనకిది వరుసగా నాలుగో టెస్ట్‌ విజయం. ఇవన్నీ కూడా ఛేదనలోనే రావడం విశేషం. ఇక, 2007 తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు ఈ ఓటమితో ఆవిరయ్యాయి.


ఆడుతూ.. పాడుతూ:

259/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇంగ్లండ్‌ ఆఖరిరోజు తమ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే విజయానికి కావాల్సిన 119 పరుగులను 19.4 ఓవర్లలోనే రాబట్టింది. తొలి సెషన్‌లో భారత బౌలర్లు వికెట్లు తీస్తారేమోనని ఆశించినా రూట్‌, బెయిర్‌స్టో ద్వయం ఆ అవకాశాన్నివ్వలేదు. పూర్తి సాధికారికంగా బ్యాటింగ్‌ సాగించడంతో అలవోకగా పరుగులు వచ్చాయి. ఆరంభం నుంచే బౌండరీలు సాధిస్తూ స్కోరును చకచకా పెంచేశారు. ముఖ్యంగా సిరాజ్‌, శార్దూల్‌ ఓవర్లను ఆడేసుకున్నారు. ఈక్రమంలో తమ అజేయ శతకాలను కూడా పూర్తి చేశారు. రూట్‌ అయితే తన సహజశైలికి భిన్నంగా రివర్స్‌ స్కూప్‌లో సిక్సర్‌ కూడా సాధించడం విశేషం. 76వ ఓవర్‌లో బెయిర్‌స్టో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదగా.. తర్వాతి ఓవర్‌లోనే రూట్‌ ఫోర్‌తో విజయాన్ని ఖాయం చేశాడు. బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్‌లో ఇది రెండో సెంచరీ కాగా, గత ఐదు ఇన్నింగ్స్‌లో నాలుగోది కావడం విశేషం.  


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:

416; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 

284; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 245;

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌:

అలెక్స్‌ లీస్‌ (రనౌట్‌) 56, క్రాలే (బి) బుమ్రా 46, పోప్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0, రూట్‌ (నాటౌట్‌) 142, బెయిర్‌స్టో (నాటౌట్‌) 114, ఎక్స్‌ట్రాలు: 20, మొత్తం: 76.4 ఓవర్లలో 378/3. వికెట్లపతనం: 1-107, 2-107, 3-109. బౌలింగ్‌: బుమ్రా 17-1-74-2, షమి 15-2-64-0, జడేజా 18.4-3-62-0, సిరాజ్‌ 15-0-98-0, శార్దూల్‌ 11-0-65-0.

Updated Date - 2022-07-06T10:04:16+05:30 IST