ఇంగ్లండ్‌ థ్రిల్లింగ్‌ విన్‌

ABN , First Publish Date - 2020-08-09T09:17:29+05:30 IST

మూడు టెస్టుల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ ఘనంగా బోణీ చేసింది. నాలుగో రోజు భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఇంగ్లండ్‌ అద్భుతమే చేసింది. క్రిస్‌ వోక్స్

ఇంగ్లండ్‌ థ్రిల్లింగ్‌ విన్‌

277 పరుగుల లక్ష్యం.. 117 పరుగులకే ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు ఫట్‌.. ఈ దశలో పాకిస్థాన్‌ విజయం సులువే అనిపించినా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌, జోస్‌ బట్లర్‌ ఎదురొడ్డి నిలిచారు. దీంతో మరో రోజు మిగిలుండగానే అంతటి స్కోరుని కూడా ఉఫ్‌మని ఊదేశారు. పాపం.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించినా పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. 


277 రన్స్‌ ఛేదించిన రూట్‌ సేన 

ఆదుకున్న వోక్స్‌, బట్లర్‌

తొలి టెస్టులో పాక్‌ పరాజయం

మాంచెస్టర్‌: మూడు టెస్టుల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ ఘనంగా బోణీ చేసింది. నాలుగో రోజు భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఇంగ్లండ్‌ అద్భుతమే చేసింది. క్రిస్‌ వోక్స్‌ (84 నాటౌట్‌), బట్లర్‌ (75) అసమాన ఆటతీరుతో మ్యాచ్‌ను చివరి రోజు వరకు తీసుకెళ్లకుండా 3 వికెట్ల తేడాతో గెలిచింది. వీరి మధ్య ఐదో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 82.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసి నెగ్గింది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌లో రూట్‌ సేన 1-0తో ఆధిక్యంలో ఉంది. యాసిర్‌ షాకు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది. 137/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ చివరి బ్యాట్స్‌మెన్‌ వీలైనంత వేగంగా ఆడి కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు జత చేశారు. యాసిర్‌ షా (33) బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. దీంతో జట్టుకు 276 పరుగుల ఆధిక్యం లభించింది. బ్రాడ్‌కు మూడు, వోక్స్‌.. స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. వోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఆరంభంలో నెమ్మదించినా..: 277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ను ఆరంభంలో పాక్‌ బౌలర్లు మరోసారి ఇబ్బందిపెట్టారు. ఓపెనర్‌ జో బర్న్స్‌ (10) విఫలమవగా.. సిబ్లే (36), కెప్టెన్‌ రూట్‌ (42) రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 

బట్లర్‌, వోక్స్‌ అండగా..:లంచ్‌ బ్రేక్‌కు 55/1 స్కోరుతో ఉన్న ఇంగ్లండ్‌ ఆ తర్వాత ఒక్కసారిగా వికెట్లను కోల్పోయింది. 31 పరుగుల వ్యవధిలోనే సిబ్లే, రూట్‌, స్టోక్స్‌ (9), పోప్‌ (7) అవుట్‌ కావడంతో మ్యాచ్‌ పూర్తిగా పాక్‌ చేతుల్లోకి వెళ్లినట్టయింది. కానీ ఈ దశలో పాక్‌ను నిరాశపరుస్తూ బట్లర్‌, వోక్స్‌ అద్వితీయ పోరాటాన్ని ప్రదర్శించారు. ప్రమాదకర బంతులను దీటుగా ఎదుర్కొంటూ తమ లక్ష్యం వైపు కదిలారు. ఒక్క ఓవర్‌ను కూడా మెయిడిన్‌గా ఆడకుండా వన్డే తరహాలో చెలరేగారు. ఇక చివరి సెషన్‌లో ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ముఖ్యంగా బట్లర్‌ కవర్‌, స్వీప్‌ షాట్లతో బంతులను బౌండరీలకు తరలిస్తూ ఒత్తిడిని తగ్గించాడు. ఈక్రమంలో తను 55 బంతుల్లో... ఆ వెంటనే వరుసగా రెండు ఫోర్లతో వోక్స్‌ కూడా 59 బంతుల్లో హాఫ్‌ సెంచరీలను పూర్తిచేసుకున్నారు. అయితే విజయానికి 21 పరుగుల దూరంలో ఉండగా బట్లర్‌ను యాసిర్‌ షా అవుట్‌ చేసినా వోక్స్‌ ఓ ఫోర్‌తో లాంఛనం పూర్తిచేశాడు.


 టెస్టుల్లో పాక్‌కిది విదేశాల్లో వరుసగా ఏడో ఓటమి 


సంక్షిప్తస్కోరు

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 326, రెండో ఇన్నింగ్స్‌: 169 (యాసిర్‌ షా 33, బ్రాడ్‌ 3/37).

ఇగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 219, రెండో ఇన్నింగ్స్‌: 277/7 (వోక్స్‌ 84 నాటౌట్‌, బట్లర్‌ 75, యాసిర్‌ షా 4/99).

Updated Date - 2020-08-09T09:17:29+05:30 IST