‘ఆంగ్లం’.. ఆశలపై నీళ్లు!

ABN , First Publish Date - 2021-10-22T14:04:44+05:30 IST

అనుమతులు తీసుకోకుండా..

‘ఆంగ్లం’.. ఆశలపై నీళ్లు!

‘సర్కారీ’లోనే అనుమతి లేని స్కూళ్లు.. 

నాలుగు నెలలుగా ఎదురుచూపులే.. 

ఇంకా అధికారుల వద్దే ఫైళ్లు పెండింగ్‌

క్లాసులు ప్రారంభం.. అందని పుస్తకాలు

త్వరలోనే టెన్త్‌ పరీక్షల ఫీజుకు షెడ్యూల్‌

విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): అనుమతులు తీసుకోకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. ఇదీ ప్రైవేట్‌ యాజమాన్యాలకు అధికారులు చేసే హెచ్చరిక. మరి.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకే అలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలి?. రాష్ట్రంలో ఇంగ్లిష్‌ మీడియం కోసం దరఖాస్తు చేసుకున్న పలు సర్కారీ స్కూళ్లకు ప్రస్తుతం ఇదే అనుభవం ఎదురవుతోంది. నాలుగు నెలలుగా అనుమతుల కోసం విజ్ఞప్తి చేస్తున్నా... పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడం లేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇంగ్లీషు మీడియం తరగతుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి... రాష్ట్రంలోని అనేక స్కూళ్లు ఇంగ్లిష్‌ మీడియం కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 


ప్రైవేటు విద్యార్థులతో పోటీ ఎలా?

ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడాలంటే... ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడం తప్పనిసరనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2008లో అప్పటి ప్రభుత్వం సక్సెస్‌ స్కూళ్ల పేరుతో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టింది. విద్యార్థుల ఆసక్తి మేరకు కొన్ని క్లాసులను, సెక్షన్లను క్రమేణా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తున్నారు. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో 2వేలకు పైగా స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం కొనసాగుతోంది. ఏటా కొన్ని సెక్షన్లు, పాఠశాలలు కొత్తగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుతున్నాయి. వీటికి 1 నుంచి 5వ తరగతి వరకు సంబంధిత జిల్లా డీఈవో, 6, 7 తరగతులకు ఆర్‌జేడీలు అనుమతి ఇస్తారు. 8, 9, 10 తరగతులకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ అనుమతి ఇవ్వాలి. గతంలో కింది తరగతులకు అనుమతులిచ్చి, ప్రస్తుతం 8, 9, 10 తరగతులు ఇంగ్లిష్‌ మీడియంలో చదవాల్సిన విద్యార్థులకు సంబంధించిన ఫైళ్లు జూన్‌, జూలై మాసాల్లోనే డైరెక్టర్‌ కార్యాలయానికి చేరాయి. ఇలా రాష్ట్రంలో సుమారు 50 పాఠశాలలకు అధికారులు అనుమతులను జారీ చేయాల్సి ఉంది. 


పుస్తకాల పంపిణీలోనూ సమస్యలు

రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై నెల దాటిపోయింది. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజుకు షెడ్యూల్‌ కూడా ఈ నెలలో లేదా నవంబరులో రానుంది.  కానీ ఇంగ్లిష్‌ మీడియం తరగతులకు ఇంకా అనుమతులు రాకపోవడంతో... ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. అప్‌గ్రేడ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలకు సకాలంలో అనుమతి ఇచ్చి ఉంటే... పుస్తకాల పంపిణీ, టీచర్ల సర్దుబాటు పూర్తయ్యేవని నిపుణులు అంటున్నారు.  


దరఖాస్తులపై ప్రభుత్వ నిర్లక్ష్యం: టీపీటీఎఫ్‌

ఇంగ్లిష్‌ మీడియం అప్‌గ్రేడ్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తులను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) ఆరోపించింది. పాఠశాల విద్య డైరెక్టర్‌ అందుబాటులో లేక 4నెలల నుంచి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్‌ అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ఆరోపించారు. మరోవైపు వార్షిక పరీక్షలకు ఫీజుల గడువు దగ్గరపడుతుండటంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. 

Updated Date - 2021-10-22T14:04:44+05:30 IST