ఎన్నాళ్లీ కష్టాలు

ABN , First Publish Date - 2020-09-23T05:52:50+05:30 IST

జిల్లాలోని ప్రాణహిత నది బ్యాక్‌వాటర్‌తో పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు

ఎన్నాళ్లీ కష్టాలు

ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌తో 2,975 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం

480 ఎకరాల్లో నీట మునిగిన వరి

ప్రతి యేటా ఇదే తంతు 

ఆందోళనలో అన్నదాతలు


బెజ్జూరు, సెప్టెంబరు22: జిల్లాలోని ప్రాణహిత నది బ్యాక్‌వాటర్‌తో పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో వరదలతో అక్కడి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేశారు. దీంతో సిర్పూర్‌ నియోజకవర్గ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి వరదనీరు పోటెత్తి పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేలల్లో వరద నీరు నిలువ ఉండడంతో పత్తి నల్లబారి పోయింది. ఈ వానా కాలంలో పత్తిపై ఆశలు పెట్టుకున్న రైతు లకు నిరాశే మిగిలింది. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 


పలు మండలాల్లో ఇదీ పరిస్థితి..

సిర్పూర్‌ నియోజకవర్గంలో పత్తి సాగుకు శ్రీకారం చుట్టిన రైతులకు ప్రకృతి శాపంగా మారింది. మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నియోజకవర్గంలోని బెజ్జూరు, పెంచికలపేట, చింతల మానేపల్లి, దహెగాం, కౌటాల మండలాల్లోని ప్రాణహిత తీరప్రాంతాల్లో సుమారు 2,975 ఎకరాల్లో పత్తి, 480 ఎకరాల్లో వరి పంట వరద నీటిలో మునగడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం బెజ్జూరు మండలంలో 1400 ఎకరాల్లో పత్తి, పెంచిక లపేటలో పత్తి 485 ఎకరాల్లో, దహెగాంలో 590 ఎకరాల్లో పత్తి, 230ఎకరాల్లో వరి, చింతలమానే పల్లిలో 300ఎకరాల్లో పత్తి, 95ఎకరాల్లో వరి, కౌటాలలో 200 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాణహిత వరదనీటితో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు కోసం ఎకరాకు రూ.20వేలు ఖర్చు చేయగా పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పూత దశలో నష్టం 

జూన్‌ మొదటి వారంలో కురిసిన తొలకరి వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు విత్తారు. అదునుగా వర్షాలు కురియడంతో చేలు ఏపుగా పెరిగాయి. ఆగస్టు రెండో వారంలో మంచి పూతకు వచ్చాయి. ఇదే తరుణంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చేలు దెబ్బతిన్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో ప్రాణహిత నదికి బ్యాక్‌ వాటర్‌   కారణంగా చేలల్లో వరద నీరు నిలిచి పత్తి, వరి  పంటలకు తీరని నష్టం వాటిల్లింది. బెజ్జూరు మండలంలోని ప్రాణహిత తీర గ్రామాలైన తలాయి. తిక్కపల్లి, భీమారం, పాపన్‌పేట, సోమిని, నాగెపల్లి, మొగవెల్లి, సుస్మీర్‌, పెంచికలపేట మండలంలోని మొర్లిగూడ, జిల్లెడ, కమ్మర్‌గాం, గుండెపల్లి, దహె గాం మండలంలోని మ్టొలగూడ, దిగిడ, రాంపూ ర్‌, రావులపల్లి, దుబ్బగూడ, కౌటాల మండలంలోని పార్డి, తాటిపల్లి, తుమ్మిడిహెట్టి, గుండాయిపేట, వీర్దండి, చింతలమానేపల్లి మండలంలోని దిందా, కేతిని, గూడెం, కోయపల్లి తదితర గ్రామాల్లో పంట లు దెబ్బతిన్నాయి. 


సర్వేలకే అధికారులు పరిమితం

ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ కారణంగా ప్రతియేటా పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. పొలాల్లో రోజుల తరబడి వరద నీరు నిల్వ ఉండడంతో పంటలు కోల్పోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. వరదల కారణంగా ఏటా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వసాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. వరదల సమయంలో అధికారులు సర్వేలు చేపట్టి చేతులు దులుపు కుంటు న్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాణహిత గట్లపై మట్టి కుప్పలు వేసినట్లయితే   వరదలు వచ్చినా పంట చేలల్లోకి నీరు రాకుండా  ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. 


నష్టపరిహారం చెల్లించాలి..లాట్కరి రాజన్న, పాపనపేట 

ప్రాణహిత బ్యాక్‌వాటర్‌ కారణంగా పొలాలు నీట మునిగి పంటలు నష్టపోతున్నాం. నీటి మునిగిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి. ఏటా వచ్చే వరదలతో సాగు చేస్తున్న పంటలు నీట మునిగి సర్వం కోల్పోతున్నాం. అయినా తమను ప్రభుత్వం   ఆదుకోవడం లేదు.


పరిష్కార మార్గం చూపాలి..నాగపురి లచ్చయ్య, దిందా 

ప్రాణహిత వరదల కారణంగా పంటలను రక్షించుకోలేక పోతున్నాం. ఏటా వేల రూపాయలు అప్పులు తెచ్చి సాగు చేస్తున్నాం. కానీ పంటలను వరదలు ముంచెత్తుతున్నాయి.అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి పెట్టిబడి సాయంతో పాటు నష్ట పరిహారం ఇప్పించాలి. 


ప్రభుత్వానికి నివేదికలు పంపించాం-రాజుల నాయుడు, ఏడీఏ, పెంచికలపేట

ప్రాణహిత బ్యాక్‌వాటర్‌ కారణంగా తీర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. ప్రాథమికంగా పరివాహక ప్రాంతాల్లో ఎంత మేర నష్టం వాటిల్లిందనేది గుర్తించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నష్టపోయిన పంటలపై సర్వేలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చూస్తాం. 

Updated Date - 2020-09-23T05:52:50+05:30 IST