జమాల్‌ సాహెబ్‌ హత్య కేసులో విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2022-09-30T05:22:12+05:30 IST

ముదిగొండ మండలం బాణాపురం-వల్లభి మధ్య ఇటీవల చింతకాని మండలం బొప్పారానికి చెందిన ఎస్‌కే జమాల్‌ సాహెబ్‌ను మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

జమాల్‌ సాహెబ్‌ హత్య కేసులో విచారణ వేగవంతం
ఆర్‌ఎంపీ ఇంట్లో విచారణ చేపడుతున్న పోలీసులు

నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

చింతకాని సెప్టెంబరు 29: ముదిగొండ మండలం బాణాపురం-వల్లభి మధ్య ఇటీవల చింతకాని మండలం బొప్పారానికి చెందిన ఎస్‌కే జమాల్‌ సాహెబ్‌ను మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను 24 గంటలలోపే పట్టుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య పథకం ప్రకారం జరిగినట్లు గుర్తించారు. హత్యకు కారకులైన మృతుడు ఎస్‌కే జమాల్‌ సాహెబ్‌ భార్య ఎస్‌కే హీమాంబీతో పాటు ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మత్కేపల్లి నామవరానికి చెందిన ఆటో డ్రైవర్‌ గొదా మోహన్‌రావు అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ నర్సింశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంపీ బండి వెంకన్న లను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబీకులు, గ్రామస్థులు నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న ముదిగొండ పోలీసులు గురువారం నిందుతులలో ఒకరైన ఆర్‌ఎంపీ బండి వెంకన్న (మృతుడు ఎస్‌కే జమాల్‌ సాహెబ్‌కు ఇంజెక్షన్‌ ఇచ్చిన వ్యక్తి)ను గ్రామానికి తీసుకొచ్చి ఆయన ఇంటి వద్ద విచారణ నిర్వహించారు. నిందుతుడు ఆర్‌ఎంపీ కావడంతో అతడికి ఉన్న అర్హత పత్రం, ఇతర ధృవీకరణ పత్రాలు, యూనియన్‌లో సభ్యత్వం ఉన్నాయో లేవా? వైద్యం చేసేందుకు ఉపయోగించే బ్యాగు ఇతర మందులు కూడా విచారణలో భాగంగా పోలీసులు తమతో తీసుకెళ్లినట్లు సమాచారం. 

Updated Date - 2022-09-30T05:22:12+05:30 IST