
కోల్‌కతా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) బెంగాల్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banejee) మంగళవారంనాడు సమీక్షించారు. ఎలాంటి అల్లర్లు జరక్కుండా చూడాలని పోలీసులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
''ఈనెల 17 నుంచి 20 వరకూ వెస్ట్ మిడ్నాపూర్‌లోని కేషియారీ గ్రామంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉంటారు. ఆయన ఎజెండా ఏమిటి? దానిపై దృష్టి సారించండి. వాళ్లు ఎలాంటి అల్లర్లకు దిగకుండా సరైన రక్షణ కల్పించండి. అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగం కొన్ని మిఠాయిలు, పళ్లు పంపవచ్చు. తద్వారా అతిథుల పట్ల మనం ఎలాంటి శ్రద్ధ తీసుకుంటామో వారికి తెలుస్తుంది. అతిగా వ్యవహరించవద్దు. దానిని వారు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది'' అని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీనియర్ ప్రభుత్వాధికారులు, జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. కాగా, కేషియారీలో మోహన్ భగవత్ నాలుగు రోజులు ఉంటారు. ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. మూడు వారాల పాటు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు.