టికెట్ ధరలు భారీగా పెంపు
కాంబో ఆఫర్లతో కుమ్ముడు
ఆంధ్రజ్యోతి, విజయవాడ : వినోదం రెట్టింపయ్యింది. టికెట్ ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ప్రభుత్వం పెంచుకోమన్న రూ.75లకు అదనంగా ఆఫర్లను జత చేశారు థియేటర్ల యజమానులు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో ధరల మోత మోగుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం విడుదల కానుండడంతో టికెట్ ధరలను యజమానులు ఒక్కసారిగా పెంచేశారు. వాస్తవానికి కొత్త సినిమాలు విడుదలైనప్పుడు అన్ని క్లాస్‌లకూ రూ.75 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పదిరోజులపాటు ఈ విధంగా పెంచుకునే వెసులుబాటును కల్పించింది. పేద ప్రజలకు వినోదాన్ని దరి చేర్చడానికే థియేటర్లలో టికెట్ ధరలు తగ్గించామని చెప్పిన ప్రభుత్వం భారీ బడ్జెట్ చిత్రాలకు ధరలను పెంచుకునే అవకాశం ఇచ్చింది. దీన్ని థియేటర్ల యజమానులు మంచి అవకాశంగా మార్చుకున్నారు.
వాస్తవానికి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఐదు ఆటలను ప్రదర్శించుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ ఐదు ఆటల ప్రస్తావన తీసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రూ.150గా ఉన్న ధర ఇప్పుడు రూ.210కి చేరింది. దీనికి జీఎస్టీ అదనంగా చెల్లించాలి. దీనితోపాటు మల్టీప్లెక్స్ థియేటర్లు ఇంతకుముందు మాదిరిగానే కాంబో ఆఫర్లను తీసుకొచ్చాయి. ఈ ఆఫర్ల పేరుతో ఒక్కో టికెట్‌ను రూ.350 నుంచి 400 వరకు విక్రయించాయి. సింగిల్ థియేటర్లు కొన్ని ప్రత్యేక ఆటలకు అనుమతిని తెచ్చుకున్నాయి. తొలి ఆటను అభిమానుల ఆటగా చూపించి, ఒక్కో టికెట్‌ను వెయ్యి రూపాయలకు విక్రయించారు. గాంఽధీనగర్‌లో పేరున్న ఓ థియేటర్లో ఈ ధరలకు టికెట్లను విక్రయించారు. ఈ ఆటను ఉదయం ఏడు గంటలకే ప్రదర్శించాలని నిర్ణయించారు. మల్లీప్లెక్స్లతోపాటు సింగిల్ థియేటర్లూ కాంబోను కట్టబెడుతున్నాయి. పది రోజులపాటు ధరలు పెంచుకునే అవకాశం ఉంది. తొలిరోజునే మొత్తం వసూలు చేయాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఇది సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మొన్నటివరకు టికెట్ ధరలు తగ్గించినందుకు గగ్గోలు పెట్టిన యజమానులు ఇప్పుడు విచ్చిలవిడిగా ధరలు పెంచడం గమనార్హం.