
కువైత్ సిటీ: ఇప్పటికే వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్.. తాజాగా తెరపైకి మరో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. విదేశీయుల నివాస చట్ట సవరణ విషయమై ఆ దేశ ఎంపీ బదర్ అల్ హమీది సోమవారం ఈ ప్రతిపాదనను లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ ముందు ఉంచడం జరిగింది. అల్ హమీది ఏడాది ముందు కూడా ఇలాగే వలసదారుల రెసిడెన్సీ విషయమై ఒక ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. కువైత్‌లో నివాసం ఉంటున్న ప్రవాసులు ఎవరైతే దీర్ఘకాలిక మానసిక లేదా నరాల వ్యాధులతో(నయం కావడానికి ఎక్కువ సమయం పట్టే రోగాలు) బాధపడుతున్నారో వారి రెసిడెన్సీ పర్మిట్లను క్యాన్సిల్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ సంబంధిత పార్లమెంటరీ కమిటీల పరిశీలనలోనే ఉంది.

ఇక తాజా ప్రతిపాదన ప్రకారం.. దేశంలో పని చేయడానికి, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనడానికి, కుటుంబంతో కలిసి నివసించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయుడు తన దరఖాస్తుకు తప్పనిసరిగా దీర్ఘకాలిక వ్యాధులు, అంటు వ్యాధులు, మానసిక రుగ్మతలేవి లేవని చూపించే ఆమోదిత మెడికల్ సర్టిఫికేట్‌ను జత చేయాలని ఎంపీ ప్రతిపాదించారు. దేశ పౌరులు ఎవరూ పైన పేర్కొన్న వ్యాధుల బారిన పడకుండా కువైత్ సమాజాన్ని రక్షించడమే తన ప్రతిపాదన లక్ష్యం అని అల్ హమీది వివరించారు. కువైత్ ఆరోగ్య స్థితి, సామాజిక విలువలు, ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొంది, అమలేతే మాత్రం ప్రవాసులకు కువైత్‌లో ఎంట్రీ విషయంలో మరో తలనొప్పి తప్పకపోవచ్చు.
ఇవి కూడా చదవండి