బోయడు కుట్టిన వల

ABN , First Publish Date - 2020-10-15T05:59:23+05:30 IST

ఎవరి కళ్ళల్లోనూ నీటిచుక్కలు ఉబకకుండా జాగ్రత్తపడాలి మరి ఏ ఊహాదర్పణం భల్లుమనకుండా నిలువరించి తీరాలి....

బోయడు కుట్టిన వల

ఎవరి కళ్ళల్లోనూ

నీటిచుక్కలు ఉబకకుండా

జాగ్రత్తపడాలి మరి

ఏ ఊహాదర్పణం భల్లుమనకుండా

నిలువరించి తీరాలి

వాములేసుకున్న గడ్డిలోంచి

పోచలేరుకున్న పిచ్చుకను

వలపన్ని ముల్లెగట్టగలిగినందుకు

పకపకా నవ్వే మహా నీతిమంతుల లోకపు

రాచవీధుల్లో

నెత్తులొంచుకొనే నడవాలి


కాపరి పట్టుబట్టినప్పుడు

కోడి గంపకిందికి రాక తప్పనట్టు

ఆకాశమే వెంటాడినప్పుడు

పిచ్చుక దొరకక తప్పదు

మహా అయితే

వాళ్ళొక చతుర విన్యాసం చేసి

కడుక్కోలేని రంగు గుప్పుతరు

మాధ్యమికులు లోకానికి ఒక

భూతద్దం పరిచిపెడతరు

రంగు తయారీ కేంద్రమెక్కడో

తెలుసుకోకుండానే

గురివిందలంతా

కొక్కొరోమంటుంటరు


ఊరబిచ్చుకను నెగలనీయని పెనుగాలి

రాబందులకు హారతులెత్తుతుంటే

అనుకరణలో అంతిమశ్వాసకు చిక్కిపోతానని

తెలియనీయని బేలతనం

ఇప్పుడు నిజమైన శతృవు


అవును,

పులులు పడ్డాయనుకుంటాం

మన అజ్ఞానం వల్ల

బోయడు కుట్టిన వల

ఊరపిచ్చుకల కోసమే



– ఏనుగు నరసింహారెడ్డి

(తహసిల్దార్ నాగరాజు జైలు మృతితో)

Updated Date - 2020-10-15T05:59:23+05:30 IST