భక్తులకు క్రమశిక్షణ లేదు

ABN , First Publish Date - 2022-04-14T08:27:49+05:30 IST

‘‘భక్తులకు క్రమశిక్షణ లేదు. ఓపిక అంతకన్నా లేదు. భక్తులు ఓపికతో ఉండి ఉంటే.. తిరుపతిలోని టోకెన్‌ జారీ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్య వచ్చేది కాదు.

భక్తులకు క్రమశిక్షణ లేదు

ఓపిక అంతకన్నా లేదు.. అందుకే తోపులాట

ఎంత చెప్పినా నిబంధనలు పాటించలేదు

రద్దీని ఊహించాం.. అరగంటలో పరిష్కరించాం

తిరుపతిలో మంగళవారం నాటి ఘటనపై

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వ్యాఖ్యలు


తిరుమల, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ‘‘భక్తులకు క్రమశిక్షణ లేదు. ఓపిక అంతకన్నా లేదు. భక్తులు ఓపికతో ఉండి ఉంటే.. తిరుపతిలోని టోకెన్‌ జారీ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్య వచ్చేది కాదు. మూడురోజులకు కలిపి దాదాపు లక్ష టోకెన్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం. కానీ భక్తులు ఇన్‌లైన్‌తో పాటు అవుట్‌ లైన్‌లోకి కూడా ప్రవేశించడంతో తోపులాటకు దారితీసింది. అవుట్‌ లైన్‌ నుంచి బయటకురావాలని ఎంత ప్రాధేయపడినా భక్తులు వినలేదు. ఎవరూ మాకు సహకరించలేదు. క్రమశిక్షణ ఎక్కడా కనిపించలేదు. టోకెన్‌ లభిస్తుందో లేదోనని ఒకరిపై ఒకరు పడ్డారు. క్రమశిక్షణ పాటించకపోవడంతోనే తోపులాటలు జరిగాయి’’ అని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం జరిగిన భక్తుల తోపులాటపై వివరణ ఇచ్చారు. బుధవారం తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 6 గంటలకు బుధ, గురు, శుక్రవారాలకు సంబంధించి రోజుకు 35వేల టోకెన్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. భక్తులు అదే రోజు దర్శన టోకెన్లు పొందాలన్న ఆతృత కారణంగా క్యూలైన్‌లో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఈ క్రమంలోనే టైంస్లాట్‌ దర్శనాల విధానాన్ని రద్దు చేసి వెంటనే భక్తులను తిరుమలకు అనుమతించినట్లు చెప్పారు. ప్రస్తుత విధానంతో భక్తులు కంపార్టుమెంట్లలో 20 నుంచి 30 గంటలు వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసి, ఆ సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు.


భక్తుల రద్దీని టీటీడీ సరిగా మేనేజ్‌ చేయలేకపోయిందని కొంత మంది ఆరోపించడం బాధాకరమని అన్నారు. ముందస్తుగా సిద్ధంగా ఉండబట్టే అరగంటలోనే భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించామన్నారు. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేశాయని వ్యాఖ్యానించారు. వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గాన్ని ఈ నెల 30 నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. 

Updated Date - 2022-04-14T08:27:49+05:30 IST