Eoin Morgan: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వరల్డ్ కప్ విన్నింగ్ ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్

ABN , First Publish Date - 2022-06-29T01:38:10+05:30 IST

ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత కొంత కాలంగా..

Eoin Morgan: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వరల్డ్ కప్ విన్నింగ్ ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్

లండన్‌: ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఈమేరకు తన నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇయాన్ మోర్గాన్ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ ధ్రువీకరించింది. ఇంగ్లండ్ జట్టులో వన్డేల్లో, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఇతనే కావడం విశేషం. తాను ఇప్పటివరకూ సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నానని, తాను ఎంతో మంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆడిన అనుభవాలు తనకు మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయని, ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోర్గాన్ రిటైర్‌మెంట్ అనంతరం ప్రకటించారు. 35 ఏళ్ల ఇయాన్‌.. తన నాయకత్వంలో పరిమిత ఓవర్లలో ఇంగ్లండ్‌ను తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దాడు. అయితే 2019లో జట్టు వన్డే ప్రపంచ కప్‌ గెలిచాక కెప్టెన్‌గా మోర్గాన్‌ ఒక సెంచరీ మాత్రమే చేయడం అతడి దారుణ ఫామ్‌కు అద్దం పడుతోంది. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఇయాన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో ఖాతాకూడా తెరవలేకపోయిన అతడు గాయంతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.



ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో మోర్గాన్ అరంగేట్రం చేశాడు. 248 వన్డే మ్యాచ్‌లు ఆడిన మోర్గాన్ వన్డేల్లో మొత్తం 7,701 పరుగులు చేశాడు. 14 సెంచరీలతో రాణించాడు. 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన మోర్గాన్ 14 హాఫ్ సెంచరీలతో 2,458 పరుగులు చేశాడు. 2006లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో మోర్గాన్ ఎంట్రీ ఇచ్చాడు. 2010 నుంచి 2012 వరకూ 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మోర్గాన్ రెండు సెంచరీలు చేశాడు. ఇదిలా ఉండగా మోర్గాన్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఇక మోర్గాన్‌ స్థానంలో.. ప్రస్తుత వైస్‌ కెప్టెన్‌గా ఉన్న జోస్‌ బట్లర్‌ ఇంగ్లిష్‌ జట్టు పరిమిత ఓవర్ల సారథిగా నియమితుడయ్యే అవకాశముంది. ఇంగ్లండ్‌ తదుపరి సారథిగా ఎంపికయ్యే సూచనలున్న బట్లర్‌.. ఈసారి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. లీగ్‌లో రాజస్థాన్‌ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఆ జోరును నెదర్లాండ్స్‌పై వన్డే సిరీ్‌సలోనూ కొనసాగించాడు. తొలిమ్యాచ్‌లో బట్లర్‌ అజేయంగా 162 (70 బంతులు) రన్స్‌ చేయడం విశేషం. భారత్‌తో మూడేసి టీ20లు, వన్డేల హై ప్రొఫైల్‌ సిరీస్‌ కెప్టెన్‌గా బట్లర్‌కు మొదటిది కానుంది.

Updated Date - 2022-06-29T01:38:10+05:30 IST