ఈపీఎఫ్ఓ కొత్త పింఛను పథకం రాబోతోంది!

ABN , First Publish Date - 2022-02-20T22:08:28+05:30 IST

వ్యవస్థీకృత రంగంలో పని చేసేవారి కోసం ఉద్యోగుల భవిష్య నిధి

ఈపీఎఫ్ఓ కొత్త పింఛను పథకం రాబోతోంది!

న్యూఢిల్లీ : వ్యవస్థీకృత రంగంలో పని చేసేవారి కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కొత్త పింఛను పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉంది. నెలకు రూ.15,000 కన్నా ఎక్కువ బేసిక్ వేతనం పొందుతూ, ఉద్యోగుల పింఛను పథకం, 1995 (ఈపీఎస్-95) పరిధిలో లేని ఉద్యోగుల కోసం ఈ కొత్త పథకాన్ని రూపొందిస్తోంది. 


ప్రస్తుతం వ్యవస్థీకృత రంగం (ఆర్గనైజ్డ్ సెక్టర్)లోని ఉద్యోగులంతా తప్పనిసరిగా ఈపీఎస్-95 పరిధిలోకి వస్తున్నారు. సర్వీసులో చేరే సమయంలో మూల వేతనం (బేసిక్ పే + డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 వరకు ఉన్న ఉద్యోగులు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందవచ్చు. అయితే అధికంగా కంట్రిబ్యూట్ చేసినవారికి అధిక పింఛను ఉండాలనే డిమాండ్ రావడంతో కొత్త పింఛను పథకాన్ని తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ చురుగ్గా పరిశీలిస్తోంది. నెలవారీ మూల వేతనం రూ.15,000 కన్నా ఎక్కువ ఉన్నవారికోసం దీనిని రూపొందిస్తోంది. ఈ వివరాలను జాతీయ మీడియా ఆదివారం తెలిపింది. 


ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి నిర్ణాయక వ్యవస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మార్చి 11, 12 తేదీల్లో గువాహటిలో సమావేశమవుతుంది. ఈ సమావేశంలో ఈ కొత్త పథకంపై చర్చ జరుగుతుందని సమాచారం. పింఛను సంబంధిత సమస్యలపై సీబీటీ ఏర్పాటు చేసిన ఉప కమిటీ తన నివేదికను ఈ సమావేశంలో సమర్పిస్తుందని తెలుస్తోంది. 


పింఛనుకు అర్హమైన నెలవారీ మూల వేతనాలను రూ.15,000కు పరిమితం చేస్తూ 2014లో ఈ పథకాన్ని సవరించారు. మూల వేతనం రూ.15,000 ఉండాలనే నిబంధన సర్వీస్‌లో జాయిన్ అయినపుడు మాత్రమే వర్తిస్తుంది. ఫార్మల్ సెక్టర్‌లో వేతన సవరణలు, ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని 2014 సెప్టెంబరు 1 నుంచి దీనిని రూ.6,500 నుంచి పెంచుతూ సవరించారు.  నెలవారీ మూల వేతనం నిబంధనను రూ.25,000కు పెంచాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. పెన్షనబుల్ పే పెరగడం వల్ల ఫార్మల్ సెక్టర్లోని మరో 50 లక్షల మంది ఈపీఎస్-95 పరిదిలోకి వస్తారు. 


Updated Date - 2022-02-20T22:08:28+05:30 IST