బెజవాడలో ఎపిడ్రిన్‌!

ABN , First Publish Date - 2022-05-02T08:22:31+05:30 IST

కొద్ది నెలల కిందట.. విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టర్‌ అయిన కంపెనీ పేరుతో అఫ్ఘానిస్థాన్‌ నుంచి కంటైనర్‌లో వచ్చిన 2 వేల కిలోల...

బెజవాడలో ఎపిడ్రిన్‌!

నగరంలో మరో డ్రగ్స్‌ వ్యవహారం?

ఆస్ట్రేలియాకు పంపితే కెనడా చేరిక

అడ్రస్‌ లేక తిరిగి బెంగళూరుకు

కస్టమ్స్‌ అధికారులు తెరిచి చూస్తే..

చీరల మధ్య ఎపిడ్రిన్‌ పొడి లభ్యం

దాని పరిమాణం 4.5 కిలోలు

డీఎ్‌సటీ సంస్థలో పనిచేసే

బెజవాడ యువకుడు తేజ అరెస్టు

13 వరకు కస్టమ్స్‌ కస్టడీకి

సత్తెనపల్లి వాసి గోపీసాయి అనే వ్యక్తి

ఆ కొరియర్‌ పంపినట్లు వెల్లడి

3 ప్రత్యేక దర్యాప్తు బృందాలు


విజయవాడ, మే 1 (ఆంధ్రజ్యోతి): కొద్ది నెలల కిందట.. విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టర్‌ అయిన కంపెనీ పేరుతో అఫ్ఘానిస్థాన్‌ నుంచి కంటైనర్‌లో వచ్చిన 2 వేల కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుకున్నారు. తాజాగా మరో డ్రగ్‌ సరఫరా విషయంలో విజయవాడ పేరు వినిపించింది. ఓ కొరియర్‌ సంస్థ ద్వారా కెనడాకు వెళ్లిన ఎపిడ్రిన్‌ పొడిని బెంగళూరులోని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దీనిని కొరియర్‌ చేసిన యువకుడిని అరెస్టు చేశారు. విజయవాడ భారతీనగర్‌లో డీఎ్‌సటీ (ఇంటర్నేషనల్‌, డొమెస్టిక్‌ కొరియర్‌ సర్వీసు) అనే సంస్థ ఉంది. నిజానికి ఇది అమెరికాకు చెందిన సంస్థ. ఇందులో ప్రసాదంపాడుకు చెందిన గుత్తుల తేజ అనే యువకుడు పని చేస్తున్నాడు. అతడే కార్యాలయం పనులన్నీ చూస్తుంటాడు. అసలు నిర్వాహకులు ఎవరో ఎవరికీ తెలియదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి అనే యువకుడు తరచూ ఈ కొరియర్‌ కార్యాలయం నుంచి ఆస్ట్రేలియాకు ఊరగాయలు, వస్త్రాలు పంపేవాడు. దీంతో తేజ, గోపీసాయి మధ్య పరిచయం పెరిగింది.


ఈ ఏడాది జనవరి 31న గోపీసాయి ఇక్కడి నుంచి ఒక పార్సిల్‌ను ఆస్ట్రేలియాకు పంపాడు. తన ఆధార్‌ కార్డులో వివరాలు సరిగా లేనందున తేజ ఆధార్‌ కార్డు తీసుకుని ఆ చిరునామాతో పంపాడు. వాస్తవానికి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే కొరియర్లు హైదరాబాద్‌లోని వరల్డ్‌ ఫస్ట్‌ అనే కొరియర్‌ సర్వీసుకు వెళ్తాయి. ఈ విధంగా విజయవాడ నుంచి గోపీసాయి పంపిన కొరియర్‌పై స్టిక్కర్‌ తప్పుగా ఉండడంతో ఆస్ట్రేలియా బదులు కెనడాకు వెళ్లింది. అక్కడ ఆ చిరునామా లేకపోవడంతో బెంగళూరుకు వచ్చింది. ఒకే పార్సిల్‌పై ఆస్ట్రేలియా, కెనడా చిరునామాలు ఉండడంతో కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. దానిని తెరిచి చూడగా.. అందులో చీరలు.. వాటి మధ్యలో 4.496 కిలోల ఎపిడ్రిన్‌ పొడిని గుర్తించారు. వెంటనే కస్టమ్స్‌ అధికారులు విజయవాడలోని డీఎ్‌సటీ కార్యాలయానికి ఫోన్‌ చేసి తేజను బెంగుళూరుకు పిలిపించారు. గత నెల 27న అతడు అక్కడకు వెళ్లగా.. మూడు రోజులపాటు విచారించి శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వెంటనే కోర్టులో హాజరుపరిచారు. మరిన్ని వివరాలు రాబట్టడానికి తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఈ నెల 13 వరకు అతడిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి మంజూరుచేసింది. తేజ అరెస్టు విషయాన్ని అధికారులు ప్రసాదంపాడులో ఉంటున్న అతడి బావ కరుణాకర్‌కు ఫోన్‌చేసి తెలియజేశారు.


తేజ స్వగ్రామం కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక. అతడి ఆధార్‌ కార్డు ఆ చిరునామాతోనే ఉంది. కస్టమ్స్‌ అధికారుల నుంచి ఫోన్‌ వచ్చిన తర్వాత తేజ కుటుంబ సభ్యులు పటమట పోలీసుల వద్దకు వచ్చారు. వారు కస్టమ్స్‌ అధికారులను ఫోన్‌లో సంప్రదించగా అసలు విషయం తెలిసింది. తేజ కస్టమ్స్‌ అధికారుల అదుపులో ఉండగా కొరియర్‌ చేసిన గోపీసాయి ఎవరన్నది ఇప్పటి వరకు తెలియలేదు. అతడిని పట్టుకోవడానికి విజయవాడ సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం సత్తెనపల్లికి వెళ్లింది. మరో బృందం బెంగళూరు.. మూడో బృందం హైదరాబాద్‌లో వరల్డ్‌ ఫస్ట్‌ కొరియర్‌కు వెళ్లింది. భారతీనగర్‌లో రేకుల ఇంట్లో కొన్నాళ్ల క్రితం వరకు బోర్డులు ఏర్పాటు చేసి తేజ ఈ కొరియర్‌ను నడిపాడు. తర్వాత బోర్డులు తొలగించి కొరియర్‌ బాక్సులను ఇంటి వెనుక వైపున చెక్కలతో నిర్మించిన గదిలోకి మార్చుకున్నాడు. వారానికో, పది రోజులకో ఈ బాక్సులను తీసుకెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. తేజకు నాలుగు నెలల కిందే పెళ్లయినట్లు బంధువులు తెలిపారు.


గోపీసాయి చిరునామా నకిలీ!

తేజ కేవలం కమీషన్ల కోసం ఎపిడ్రిన్‌ను కొరియర్‌ చేశాడా లేక గోపీసాయితో ఉన్న పరిచయంతో కేసులో ఇరుక్కుపోయాడా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. గోపీసాయి సత్తెనపల్లికి చెందిన వాడేనా అన్న అనుమానమూ వ్యక్తమవుతోంది. అతడిచ్చిన చిరునామా నకిలీదని పోలీసులు భావిస్తున్నారు. ఎపిడ్రిన్‌ అనేది మెడిసిన్‌కు సంబంధించినది. ఇది బిళ్లలు, టానిక్‌, ఇంజక్షన్ల రూపంలో అందుబాటులో ఉంటుంది. ఆపరేషన్ల సమయంలో మత్తు కోసం వైద్యులు ఇస్తుంటారు. ఇది శరీరంలోకి వెళ్లిన గంట తర్వాత పనిచేస్తుంది. ఈ మత్తు 4గంటలపాటు ఉంటుంది. అమెరికా కొన్నాళ్ల క్రితం ఎపిడ్రిన్‌ను నిషేధించింది.

Updated Date - 2022-05-02T08:22:31+05:30 IST