సమరమే

ABN , First Publish Date - 2022-01-22T06:02:50+05:30 IST

సమరమే

సమరమే
గృహ నిర్మాణ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు

ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగుల సన్నద్ధం

పీఆర్సీపై పోరాటమే అంటున్న సంఘాలు

కొనసాగుతున్న ఆందోళన, నిరసనలు

విధులకు బ్రేక్‌ ఇచ్చిన ట్రెజరీ ఉద్యోగులు


పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నిరసనల వేడి చల్లారలేదు.. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గం తీర్మానించిన వేతన సవరణ ఆమోద యోగ్యంగా లేదంటూ మండిపడ్డాయి. అన్ని సంఘాలు కలిపి  ఉద్యమ  కార్యాచరణ ప్రకటించాయి. శుక్రవారం ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణ బాట పట్టారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చేశారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.


ట్రెజరీ శాఖ ఉద్యోగులు..డీడీకి వినతిపత్రం 

ఏలూరు / ఏలూరు టూటౌన్‌,  జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా ట్రెజరీశాఖలో ఉద్యోగులు సహాయ నిరాకరణ బాట పట్టారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపునకు నిరసనగా జిల్లాలోని అన్ని ట్రెజరీ కార్యాలయాల్లో శుక్రవారం ఉద్యోగులు విధులకు బ్రేక్‌ ఇచ్చారు. కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బిల్లులు రూపొందించేది లేదని వారు నిర్ణయించారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ శుక్రవారం ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఉప ఖజానా అధికారి కృష్ణకు వినతి పత్రం అందించింది. ఉద్యోగుల్లో తామూ భాగమేనని, ఉద్యోగులకు నష్టం కలిగించే జీవోలను అమలు చేయబోమని ఏపీ ట్రెజరరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యూవీ పాండు రంగారావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో సుమారు 27 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 22 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరి వేతన, పెన్షన్‌ బిల్లులను ఆయా శాఖల డ్రాయింగ్‌ అధికారులు జిల్లా ట్రెజరీ కార్యాలయం, 16 సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు పంపిస్తుంటారు. వీటిని పరిశీలించి ట్రెజరీశాఖ ఆమోదం తెలు పుతుంది. ప్రతి నెలా వేల సంఖ్యలో ఈ బిల్లులు ట్రెజరీ శాఖను చేరి, అక్కడ ఆమోదం పొందిన తరవాత వేతనాలు అందు తాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ముందస్తుగా బిల్లులు సిద్ధం చేయా లని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ జిల్లాలోని డ్రాయింగ్‌ అధికారులు బిల్లులు రూపొందించి ట్రెజరీ శాఖకు పంపేందుకు సుముఖంగా లేరు. ఇప్పటివరకూ సింగిల్‌ డిజిట్‌లోనే బిల్లులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. 


కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ధర్నా 

ఏలూరు కలెక్టరేట్‌ : కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ, ఏపీ స్టేట్‌ గవర్న మెంట్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, మినిమం బేసిక్‌ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి  అధి కారంలోకి రాగానే రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి నేడు దాని ఊసెత్తకపోవడం అన్యాయమన్నారు. జేఏసీ జిల్లా నాయకులు సయ్యద్‌ జఫ్రుల్లా, డి.దయా మణి, వాసా శ్రీనివాసరావు, బి.సోమయ్య, డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లా డుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్క రించాలన్నారు. లేనిపక్షంలో ఈ నెల 31న విజయవాడ లో ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. 


గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల నిరసన

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ 27 శాతం కంటే ఎక్కువ ఇవ్వాలని బీసీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.పి.ఆర్‌.విఠల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. వేతన సవరణ కారణంగా జీతం తగ్గే దుస్థితిని రాష్ట్రం లోనే చూస్తున్నామని, దీనికి నిరసనగా జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. పీఆర్సీ తమకు అవసరం లేదని, పాత జీతాలనే కొనసాగించాలన్నారు.అర్ధరాత్రి విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలన్నారు. సెక్రటరీ పి.ఏసురాజు, ఉపాఽ ధ్యక్షులు ఎస్‌.రవిశంకర్‌, ఎం.నాగేంద్ర, ఎం.సుబ్బారావు, వై.మోహన్‌కృష్ణ, షరీఫ్‌, కేపీ కుమార్‌, ఎస్‌.కె.అన్వర్‌, ఎం.లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


ఉద్యోగులకు టీడీపీ మద్దతు

భీమవరం అర్బన్‌ : వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనుకూలంగా లేదని వారికి మొండిచేయి చూపించి నిరాశకు గురి చేసిందని నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. అధికారం కోసం తన మేనిఫెస్టోలో ఉద్యోగులకు పీఆర్సీలో 40 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు అనేక హామీలు గుప్పించి సీఎం అయిన తర్వాత జగన్‌ వారిని వెన్నుపోటు పొడవడం సరికాదన్నారు. ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. 


25 నుంచి ఉద్యమ బాట

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 21 : పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఫిట్‌మెంట్‌, హెచ్‌ ఆర్‌ఏ, డీఏ బకాయిల నుంచి ఐఆర్‌ను రికవరీ చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగు తుం దని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.ఎ.సాల్మన్‌రాజు అన్నారు. ఈ మేరకు ఏలూరులో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ను తగ్గించడం వల్ల నష్టపోతారు. ప్రభుత్వం తక్షణం జీవోలను రద్దు చేసి 30 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి. హెచ్‌ ఆర్‌ఏ స్లాబ్‌లను పాత వాటినే కొనసాగించి, పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి. ప్రతీ ఐదేళ్లకు పీఆర్సీ ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 25న ఏలూరు కలెక్టరేట్‌ వద్ద జేఏసీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నాలు నిర్వహిస్తాం. 26న అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రం అందజేత, 27 నుంచి 30 తేదీ వరకు నిరా హార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ, 5 నుంచి సహాయ నిరాకరణ, 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతాం’ అని  ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు నారాయణ, రెడ్డి దొర హెచ్చరిం చారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గం తీర్మానిం చిన వేతన సవరణ, ఉద్యోగ వర్గ ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో ఉన్నందున దానిని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు తిరస్కరిస్తున్నట్టు పీఆర్సీ సాధన సమితి జిల్లా నాయకుడు పి.ఆంజనేయులు, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.గోపిమూర్తి తెలిపారు. అన్ని సంఘాలు కలిపి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయని, నిరవధిక సమ్మెతో సహా ఉద్యమ కార్యాచరణను నిర్ణయించినట్టు వివరించారు. ఆ మేరకు సమ్మె నోటీసును ఈనెల 24న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నట్టు వివరిం చారు. ప్రస్తుత పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేయాలని కోరారు. పీఆర్సీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు.




Updated Date - 2022-01-22T06:02:50+05:30 IST