Oath of Edappadi Palaniswami: తగ్గేదే లేదు...

ABN , First Publish Date - 2022-07-28T14:26:24+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న శత్రువులను (డీఎంకేను) బరిలో సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, అదే సమయంలో తమ పార్టీ

Oath of Edappadi Palaniswami: తగ్గేదే లేదు...

- శత్రువులను బరిలో ఎదుర్కొంటా.. 

- ద్రోహులను వెంటాడి తరిమికొడతా 

- ధర్నాలో ఈపీఎస్‌ శపథం


చెన్నై, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న శత్రువులను (డీఎంకేను) బరిలో సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, అదే సమయంలో తమ పార్టీ కార్యాలయవిధ్వంసానికి పాల్పడిన శత్రువులను (ఓపీఎస్‌ వర్గీయులను) వెంటాడి తరిమికొడతామని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) శపథం చేశారు. అన్నాడీఎంకే ఆధ్వర్యంలో విద్యుత్‌ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపు, ఎన్నికల హామీలను నెరవేర్చని డీఎంకే ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో బుధవారం నిర్వహించిన ధర్నాలో ఈపీఎస్‌ మాట్లాడారు. ధర్నాకు హాజరైన జనాన్ని చూస్తే డీఎంకే(DMK) ప్రభుత్వం పట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని స్పష్టమవుతోందన్నారు. అన్నాడీఎంకేకు రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతుండడం చూసి ఓర్వలేకే డీఎంకే ప్రభుత్వం తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. డీఎంకే 14 మాసాల పాలనలో ప్రజలు కష్టపడుతున్నారని, విద్యుత్‌ ఛార్జీల పెంపు, ఆస్తిపన్నుల పెంపుతో సతమతమవుతున్నారన్నారు. పెట్రోలు డీజిల్‌(Petrol Diesel) ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించినా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం తగ్గించలేదన్నారు. ఇక అన్నాడీఎంకేను అక్రమపద్ధతుల్లో కైవశం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయం తలుపులను కాళ్లతో తన్ని బీభత్సం(panic) సృష్టించిన ద్రోహులను తరిమికొడతామని, పార్టీ శ్రేణులు కూడా వారిపట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని ఎడప్పాడి పేర్కొన్నారు. ఎంజీఆర్‌, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్దంగా తాను పార్టీని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నానని, పార్టీని నాశనం చేసేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు సాగించినా ఫలించవన్నారు. 


సొమ్మసిల్లిన ఈపీఎస్‌...

ఈ ధర్నాలో సుమారు గంటల సేపు ఉద్వేగంగా ప్రసంగించిన ఎడప్పాడి ఎండవేడిని భరించలేక సొమ్మసిల్లిపోయారు. పార్టీ నాయకులు సేదతీర్చి ఆయనను వేదికపై కూర్చోబెట్టారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ నాయకత్వంలో నిర్వహించిన ధర్నాలో కోశాధికారి దిండుగల్‌ శీనివాసన్‌, ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాధన్‌, పి.వలర్మతి, పొన్నయ్యన్‌, గోకుల ఇందిరా, ఓఎస్‌ మణియన్‌, పొల్లాచ్చి జయరామన్‌, ఆర్బీ ఉదయకుమార్‌, ఈసీ శేఖర్‌, నటి వింధ్యా, ఏఎం ఆనంద్‌ రాజా, ఎంజీఆర్‌ యువజన విభాగం డిప్యూటీ కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-28T14:26:24+05:30 IST