క్రైస్తవులకు అండగా అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2021-12-21T13:56:11+05:30 IST

శాంతి, సామరస్యాన్ని బోధించి సర్వమానవాళిని ప్రేమించిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని, ఆ మార్గంలో నడిచే క్రైస్తవులకు అన్నాడీఎంకే అండగా వుంటుందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి

క్రైస్తవులకు అండగా అన్నాడీఎంకే

                     - క్రిస్మస్‌ వేడుకల్లో ఈపీఎస్‌-ఓపీఎస్‌


ప్యారీస్‌(చెన్నై): శాంతి, సామరస్యాన్ని బోధించి సర్వమానవాళిని ప్రేమించిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని, ఆ మార్గంలో నడిచే క్రైస్తవులకు అన్నాడీఎంకే అండగా వుంటుందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. స్థానిక చెట్‌పెట్‌ హారింగ్టన్‌ రోడ్డులో ఉన్న పిల్లలు, వృద్ధుల అనాథాశ్రమంలో సోమవారం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి ఈ వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు ప్రారంభించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌, సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు సి.పొన్నయ్యన్‌, డి.జయకుమార్‌, పి.బెంజిమెన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్‌, మాజీ ఎంపీ గోకుల ఇందిర, మనోజ్‌ పాండ్యన్‌, ఎమ్మెల్యేలు ఇన్బదురై, చెల్లపాండ్యన్‌, జాన్‌ మహేంద్రన్‌, బిషప్‌ సైమన్‌రాజ్‌ సహా పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పళనిస్వామి మాట్లాడుతూ.. కులమతాలు పక్కన పెట్టి క్రైస్తవ సోదరులు క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని సహాయాలు అందజేస్తున్నారని, భారతదేశంలో విద్య, ఆధునిక వైద్యాన్ని పరిచయం చేసిన క్రైస్తవులకు అన్నాడీఎంకే ఎన్నటికీ అండగా నిలుస్తుందని తెలిపారు. క్రైస్తవులందరికీ ముందస్తు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒ.పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ, ప్రజలు మతసామరస్యానికి ప్రతీకగా క్రిస్మస్‌ పండుగను జరుపుకుంటున్నారని, డిసెంబరు నెల ప్రారంభం నుంచే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి నెలకొంటుందని పేర్కొన్నారు. వసంత రుతువులో చలి, మంచు లెక్కచేయకుండా చర్చిల తరఫున ఇంటింటికీ వెళ్లి పాటలు పాడి శుభాకాంక్షలు తెలపడం మంచి సంప్రదాయమని ఓపీఎస్‌ అన్నారు.

Updated Date - 2021-12-21T13:56:11+05:30 IST