పార్టీ పదవులకు Eps, Ops నామినేషన్‌

ABN , First Publish Date - 2021-12-05T14:27:24+05:30 IST

అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పదవులకు మరెవరూ పోటీ చేయకపోవడంతో

పార్టీ పదవులకు Eps, Ops నామినేషన్‌

                          - ఎన్నిక ఏకగ్రీవమే!


చెన్నై: అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పదవులకు మరెవరూ పోటీ చేయకపోవడంతో వీరిరువురి ఎన్నిక లాంఛనమే. ఇటీవల జరిగిన అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి సమావేశంలో సమన్వయకర్త, ఉప సమన్వయకర్తల పదవులను ఎన్నికల ద్వారా భర్తీ చేయాలని, ఐదేళ్లకు పైగా పార్టీ సభ్యత్వం కలిగిన సభ్యులే వీరిని ఎన్నుకోవాలని పార్టీ నియ మావళిలో కొత్త సవరణలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ సమ న్వయకర్త, ఉప సమన్వయకర్తకు సర్వాధికారాలు అప్పగిస్తూ ఆ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఆ రెండు పదవులకు ఈనెల 7వ తేదీన ఎన్నికలు జరుగుతాయని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆ మేరకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’కి వెళ్ళారు. ఇరువురికీ జేజేలు పలుకుతూ జిల్లా కార్యదర్శులు కార్యకర్తలు స్వాగతం పలికారు. మహిళా కార్యకర్తలు వీరికి కర్పూరహారతినిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా శాఖ నాయకులు ఇరువురినీ గజమాలతో సత్కరించి కార్యాలయం లోపలకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణాధికారులుగా ఉన్న పొన్నయ్యన్‌, పొల్లాచ్చి జయరామన్‌ వద్ద ఇరువురూ నామినేషన్లు సమర్పించారు. ఇరువురి నామినేషన్లలో జిల్లా కార్యదర్శులు, పార్టీ సీనియర్‌ నాయకులు మద్ధతు ప్రకటిస్తూ సంతకాలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వాహకుల ఎదుట ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం పార్టీ ప్రతిజ్ఞ చేశారు. పార్టీలోని జిల్లా కార్యదర్శులంతా ఇరువురికి గట్టి మద్దతు ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. ఎప్పటివలెనే పన్నీర్‌సెల్వం అన్నా డీఎంకే సమన్వయకర్తగా, ఎడప్పాడి పళినిస్వామి ఉప సమన్వయకర్తగా ఎన్నికవుతారని పేర్కొన్నారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన జరిగిన మీదట ఇరువురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2021-12-05T14:27:24+05:30 IST