పోరు వద్దు... చెలిమి వీడొద్దు

ABN , First Publish Date - 2022-05-28T13:49:38+05:30 IST

పార్టీపై పట్టు కోసం ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ తరహాలో పోట్లాడుకుంటున్న అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి

పోరు వద్దు... చెలిమి వీడొద్దు

- మనస్పర్థలు మాని లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టండి 

- ఈపీఎస్‌, ఓపీఎస్ లకు మోదీ హితవు


చెన్నై: పార్టీపై పట్టు కోసం ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ తరహాలో పోట్లాడుకుంటున్న అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిశానిర్దేశం చేశారు. మనస్పర్థలు మాని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కృషి చేయాలని సూచించారు. అంతేగాక 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని తేల్చి చెప్పారు. గురువారం రాత్రి చెన్నై పర్యటన ముగించుకుని ఢిల్లీ బయల్దేరే ముందు విమానాశ్రయంలో తనను కలిసిన ఈపీఎస్‌, ఓపీఎస్ లకు మోదీ ‘క్లాస్‌’ తీసుకున్నారు. ముందు ఈపీఎస్‌, ఓపీఎస్ లతో పాటు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలైన డి.జయకుమార్‌, తంగమణి, వేలుమణి కూడా ప్రధానితో భేటీ అయ్యారు. డీఎంకే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, తమను జైళ్లపాలు చేయాలని చూస్తోందంటూ ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అన్నీ విన్న ప్రధాని.. అసలేం జరుగుతుందో తెలుసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం ఈపీఎస్‌, ఓపీఎస్ లతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని బలహీనపడనీయొద్దని, దానికోసం చేయాల్సిందంతా చేయాలని, తన అండదండలు ఎప్పుడూ వుంటాయని మోదీ వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ముందుగా పార్టీపై ఆధిపత్యం కోసం పాకులాడడం మానుకోవాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు మాత్రమే దక్కించుకోగలిగామన్న విషయాన్ని గ్రహించి, అప్పుడు జరిగిన లోటుపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రెండంకెల ఎంపీ స్థానాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని తేల్చి చెప్పారు. తన పర్యటన సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంత స్పందన రావడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన ప్రధాని.. ప్రజల్లో తమ పట్ల పెరుగుతున్న ఆదరణకు అది నిదర్శనమని, దానిని ఉపయోగించుకుని ముందుకెళ్లాలని సూచించారు. కలిసి పని చేయాల్సిన నేతలు, ఎడమొహం పెడమొహంగా ఎందుకు ఉండాల్సి వస్తోందని గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ప్రజల్లో విశ్వాసం పెంచుకునేందుకు కృషి చేయాలని, కిందిస్థాయిలో అన్నాడీఎంకే క్యాడర్‌కున్న బలాన్ని గుర్తించాలని తీవ్ర స్వరంతోనే హెచ్చరినట్లు భోగట్టా. ఈ సందర్భంగా ఓపీఎస్‌ శశికళ విషయాన్ని ప్రస్తావించగా, మోదీ ఆ వ్యవహారాన్ని అసలు పట్టించుకోలేదని తెలిసింది. ఇదిలా వుండగా ఆ ఇద్దరితో భేటీ అయిన అనంతరం ఓపీఎస్ తో ప్రధాని ఒంటరిగా మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ఓపీఎస్ కు గట్టిగా క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రారంభంలో శశికళను తీవ్రంగా వ్యతిరేకించిన ఓపీఎస్‌.. ఇటీవల ఆమెతో అంటకాగుతుండడం పట్ల ఈపీఎస్‌ వర్గం గుర్రుగా వుంది. అందువల్ల ఈ వ్యవహారంపైనే మోదీ ఓపీఎస్ కు క్లాస్‌ తీసుకుని వుంటారని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. మొత్తమ్మీద అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ జోక్యం చేసుకోవడం శుభపరిణామమని, ఇకనుంచైనా పార్టీలో వర్గపోరు వుండదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కొంతమంది సీనియర్లు మాత్రం తమ పార్టీ అంతర్గత వ్యవహారాన్ని మోదీ ముందు పంచాయతీ పెట్టడమేంటని ఈపీఎస్‌, ఓపీఎస్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-28T13:49:38+05:30 IST