ఈపీఎస్‌, ఓపీఎస్‌ నియామకం సబబే

Sep 21 2021 @ 11:13AM

              - స్పష్టం చేసిన మద్రాసు హైకోర్టు


పెరంబూర్‌(చెన్నై): అన్నాడీఎంకే సయన్వయకర్తల నియామకం సబబేనని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. అన్నాడీఎంకే సమన్వయకర్తలుగా ఓపీఎస్‌, ఈపీఎస్‌ల నియామకాన్ని సవాల్‌ చేస్తూ అన్నాడీఎంకే నేత, న్యాయవాది రామ్‌కుమార్‌ ఆదిత్యన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మూసి వేసింది. ఈ మేరకు మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘అన్నాడీ ఎంకే నిబంధనల ప్రకారం కొత్త పదవులను సృష్టించే అధికారం పార్టీ కమిటీకి లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఆ అధికారం ఉంది. కానీ, ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలిత మృతి అనంతరం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమితులయ్యారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న వర్గపోరు కారణంగా శశికళను తొలగించి, పార్టీ సమన్వయకర్తగా ఒ.పన్నీర్‌ సెల్వం, ఉప సమన్వయకర్తగా ఎడప్పాడి నియమితుల య్యారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా జరిగిన ఈ నియామకాలు చెల్లవు. కానీ ప్రధాన కార్యదర్శి పదవి రద్దు, సమన్వయకర్తల నియామకం తదితరాలను అనుమ తిస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయండి’ అంటూ రామ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ముందు విచారణ జరగ్గా.. ఒక పార్టీకి అధ్యక్షులు, నిర్వాహకు లను ఎలా ఎంపిక చేస్తారనే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ పరిశీలించదని, పార్టీ ప్రతినిధులు అందజేసే ప్రమాణపత్రం ఆధారంగానే అధ్యక్షులను అంగీకరించడం ఎన్నికల కమిషన్‌ విధి అని, ఈ వ్యవహారంలో న్యాయ స్థానం కూడా జోక్యం చేసుకోరాదంటూ ఎన్నికల కమిషన్‌ కౌంటర్‌ అఫిడవిట్‌లో స్పష్టంచేసింది. ఎన్నికల కమిషన్‌ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఓపీఎస్‌, ఈపీఎస్‌ నియామకం సబబేనని తేల్చింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.