కొవిడ్‌ చికిత్సపై పర్యవేక్షణ

ABN , First Publish Date - 2021-05-07T06:45:59+05:30 IST

కొవిడ్‌ చికిత్సపై పర్యవేక్షణ

కొవిడ్‌ చికిత్సపై పర్యవేక్షణ
ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలిస్తున్న మంత్రి దయాకర్‌రావు

 ప్రైవేట్‌ ఆస్పత్రుల పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి

  ఎంజీఎం ఆస్పత్రికి ఇద్దరు ప్రత్యేకాధికారులు

  ఎంజీఎంలో కరోనా రోగులు చనిపోతున్నారనేది నిజం కాదు..

 అందుబాటులో 800 బెడ్లు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 

  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

హన్మకొండ అర్బన్‌, మే 6: కొవిడ్‌ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి ఆస్పత్రులపై మానిటరింగ్‌ చేస్తూ సమన్వయం చేయడానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో పర్యవేక్షణకు జిల్లా వైద్యాధికారితోపాటు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు గురువారం ఎంజీఎం ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ రోగులకు అందిస్తున్న చికిత్సను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ లభ్యత, మందుల సరఫరా ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. 

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని ప్రత్యేకంగా కొవిడ్‌ బాధితుల కోసం కేటాయించామని తెలిపారు. ఇక్కడ అందరికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేకంగా 800 పడకలు కేటాయించామని, అందులో 650 పడకలు ఆక్సిజన్‌ సౌకర్యం కలిగి ఉన్నాయని తెలిపారు. రోగులకు సరిపడా మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని అన్నారు. అలాగే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను కూడా తెప్పిస్తున్నామని, కొవిడ్‌ బాధితులు ఎంజీఎంలో చేరవచ్చని తెలిపారు. ఆస్పత్రిలో డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు నిస్వార్థంతో పని చేస్తున్నారన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో కరోనా రోగులు చనిపోతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. కొవిడ్‌ బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా రోగులు ప్రైవేటు ఆస్పత్రిలో చేరే బదులు ఎంజీఎంలో చేరి మెరుగైన చికిత్స పొందాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. కొవిడ్‌ బాధితులను వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వదిలేయకుండా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోడానికి వైద్యులకు, సిబ్బందికి అందుబాటులో ఉండాలని కోరారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స కోసం ప్రాణాలను పణంగా పెట్టి కృషి చేస్తున్న ఎంజీఎం సూపరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి, డాక్టర్లను, పారామెడికల్‌, పారిశుధ్య సిబ్బందిని మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సహకారంతో బాలవికాస సాంఘిక సేవా సంస్థ సమకూర్చిన 25ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో ఆస్పత్రికి అందజేశారు. కొవిడ్‌ రెండో వేవ్‌ విస్తరిస్తున్నందున కొవిడ్‌ బాధితులకు చికిత్స కోసం ఆక్సిజన్‌ అవసరం పెరిగిందని మంత్రి అన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రానికి 100 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను అందించేందుకు ముందుకు వచ్చిన బాలవికాస సంస్థను, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శౌరిరెడ్డిని అభినందించారు. కొవిడ్‌ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-05-07T06:45:59+05:30 IST