ఎర్రవల్లిని మండలం చేయాలి

ABN , First Publish Date - 2021-07-22T04:34:52+05:30 IST

జిల్లాలోనే అతి పెద్ద మండలం ఇటిక్యాల పరిధిలో ఉన్న ఎర్రవల్లిని మండలం చేయాలన్న డిమాండ్‌ తాజాగా తెరపైకి వచ్చింది.

ఎర్రవల్లిని మండలం చేయాలి
ఎర్రవల్లి చౌరస్తా

- మరోసారి తెరపైకి వచ్చిన డిమాండ్‌

- సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రయత్నాలు 

- అన్ని వనరులున్నాయన్న అభిప్రాయం

- పలు గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు 

ఎర్రవల్లి చౌరస్తా, జూలై 21 : జిల్లాలోనే అతి పెద్ద మండలం ఇటిక్యాల పరిధిలో ఉన్న ఎర్రవల్లిని మండలం చేయాలన్న డిమాండ్‌ తాజాగా తెరపైకి వచ్చింది. జిల్లాల పునర్వవ్యవస్థీకరణ సమయంలోనే ఎర్రవల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని విన్న పాలు వచ్చినప్పటికీ, అప్పట్లో సాధ్యం కాలేదు. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తుండటం నేపథ్యంలో ఈ డిమాండ్‌ మళ్లీ ఊపందుకున్నది. మండలం ఏర్పా టు కోసం స్థానిక యువకులు, పెద్దలు సాధన కమి టీని ఏర్పాటు చేసుకొని, కార్యాచరణ రూపొందిం చుకొని ముందుకు సాగుతున్నారు. 


అన్ని అర్హతలున్నాయంటున్న స్థానికులు

గద్వాల జిల్లాకు ముఖద్వారంగా ఉన్న ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారిపై ఉంది. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కొనసాగుతోంది. సమీపంలోనే ప్రత్యేక పోలీసు బెటాలియన్‌ ఉంది. ఈ ప్రాంతాన్ని ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తోంది. రెండు సెంట్రల్‌ స్కూల్‌ సిలబస్‌ పాఠశాలలు, ఒక అంతర్జాతీయ పాఠశాల కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. అలాగే పారిశ్రామికంగా కూడా అనేక పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఉంది. దీనికి తోడు ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా సమీ పంలోనే ఉంది. ఇవన్నీ మండల ఏర్పాటుకు అనుకూల అంశాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


జిల్లాలోనే పెద్ద మండలం ఇటిక్యాల

ప్రస్తుతం జిల్లాలో 12 మండలాలున్నాయి. వాటిల్లో పెద్ద మండలమైన ఇటిక్యాలను రెండుగా విభజించి, ఎర్రవల్లిని మండలం చేయాలని మండల సాధన కమిటీ నాయకులు కోరుతున్నారు. గతంలో వడ్డేపల్లి నుంచి రాజోలి, అలంపూర్‌ నుంచి ఉండవల్లి, గట్టు నుంచి కేటీ దొడ్డి గ్రామాలు మండలాలుగా ఏర్పడ్డాయని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇటిక్యాలను విభజించి ఎర్రవల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మండల ఏర్పాటు డిమాండ్‌కు అనుకూలంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఇటిక్యాల మండలంలో 29 గ్రామ పంచాయతీలున్నాయి. ఎర్రవల్లి చౌరస్తాను మండలంగా ఏర్పాటు చేస్తే 15 గ్రామాలు అభివృద్ధి చెందు తాయని సాధన కమిటీ నాయకులు చెప్తున్నారు. 


మండలం ఏర్పాటుకు అన్ని అర్హతలున్నాయి 

మండలంగా ఏర్పాటు చేసేందుకు ఎర్రవల్లికి అన్ని అర్హతలున్నాయి. ఇది జిల్లాలోనే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. రాష్ట్ర ప్రభుత్వం దీనిని మండలంగా ఏర్పాటు చేస్తే చుట్టు పక్కనున్న 15 గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.

- జోగులరవి, ఎర్రవల్లి సర్పంచ్‌


తీర్మానాలతో ప్రభుత్వానికి నివేదిస్తాం  

ఎర్రవల్లి మండలం ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మండలం ఏర్పాటుకు ఎర్రవల్లికి అన్ని అర్హతలు, వనరులు ఉన్నాయి. కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వం స్థలం కూడా అందుబాటులో ఉంది.

- కృష్ణ, సాధన సమితి అధ్యక్షుడు


Updated Date - 2021-07-22T04:34:52+05:30 IST