‘ఉమ్మడి వరంగల్‌’ ఓట్ల విలువ 2984

Published: Sat, 25 Jun 2022 00:13:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉమ్మడి వరంగల్‌ ఓట్ల విలువ 2984

మొదలైన రాష్ట్రపతి ఎన్నికల సందడి..
ఓటు వేయనున్న 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాష్ట్రపతి  ఎన్నికల సందడి కనిపిస్తోంది.   ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పాల్గొనే ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ ఎంత? ఉమ్మడి జిల్లా నుంచి పడే మొత్తం ఓట్లు ఎన్ని? ఎవరికి ఓట్లు పడే అవకాశం ఉంది? అనే అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  అధికార ఎన్‌డీఏ పక్షాన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఖరారు కాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌సిన్హా బరిలో నిలిచారు. జూలై 18న జరిగే పోలింగ్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఆయా పార్టీల ప్రస్తుత వైఖరి ప్రకారం ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హనుమకొండ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) :
రాష్ట్రపతి ఎన్నిక గురించి గ్రామీణ, సాధారణ ఓటర్లకు అంతగా తెలియదు. కానీ విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి కాస్తోకూస్తో తెలిసిన వారు మాత్రం ఆసక్తి  చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజలు ప్రజాప్రతినిధులను గెలిపిస్తే.. ఆ ప్రజాప్రతినిధులు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు విప్‌ జారీ చేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరుకావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది.

ఓటు విలువ
సాధారణ ఎన్నికల్లో ఒక ఓటరు విలువ ఒకటే. ఆయన తనకు నచ్చిన అభ్యర్థికి వేసిన ఓటును ఒక ఓటుగానే  పరిగణిస్తారు. కానీ రాష్ట్రపతి ఎన్నికలు ఇందుకు భిన్నం. ఈ ఎన్నికల విధానంలో ఎలక్టోరల్‌ కాలేజీలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఓటు విలువ మారుతుంది. ఎమ్మెల్యే ఓటు విలువ 1971లోని రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేల స్థానాలతో భాగిస్తారు. మళ్లీ ఆ విలువను వెయ్యితో భాగించగా వచ్చిన విలువ ఎమ్మెల్యే ఓటు విలువ అవుతుంది.

విలువ 132, 700..

రాష్ట్ర జనాభా ఆధారంగా లెక్కిస్తే రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఓటు విలువ 132గా తేలింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12మంది ఎమ్మెల్యేలుకాగా, ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), దాస్యం వినయ్‌భాస్కర్‌ (వరంగల్‌ పశ్చిమ), నన్నపునేని నరేందర్‌ (వరంగల్‌ తూర్పు), తాటికొండ రాజయ్య (స్టేషన్‌ ఘన్‌పూర్‌), ఆరూరి రమేష్‌ (వర్ధన్నపేట), చల్లా ధర్మారెడ్డి (పరకాల), ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), డీఎస్‌ రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), శంకర్‌నాయక్‌ (మహబూబాబాద్‌), పెద్ది సుదర్శన్‌రెడ్డి (నర్సంపేట), కాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దనసరి ఆనసూయ (ములుగు) ఉన్నారు.

ఈ లెక్కన ఉమ్మడి జిల్లా నుంచి ఓటు హక్కు వినియోగించుకునే ఎమ్మెల్యేల మొత్తం విలువ 1,584 అవుతుంది. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు లోక్‌సభ స్థానాలు వరంగల్‌, మహబూబాబాద్‌ ఉన్నాయి. వరంగల్‌ నుంచి పసునూరి దయాకర్‌, మహబూబాబాద్‌ నుంచి మాలోతు కవిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎలక్టోరల్‌ కాలేజీలో ఒక ఎంపీ ఓటు విలువ 700గా నిర్ణయించారు. ఇద్దరు ఎంపీల ఓట్ల విలువ 1,400గా ఉంది.

లెక్కింపు ఇలా..

ఎంపీల ఓటు విలువను ప్రత్యక్షంగా గణిస్తారు. అన్ని రాష్ట్రాల శాసన సభ్యుల మొత్తం ఓటు విలువను పార్లమెంట్‌లోని రాజ్యసభ, లోక్‌సభ్యులతో భాగిస్తారు. ఈ లెక్కన దేశంలోని శాసనసభ్యులు మొత్తం ఓటు విలువ 5,43,231 కాగా, పార్లమెంట్‌ ఉభయసభ సభ్యుల సంఖ్య 776తో భాగించగా ఓటు విలువ 700గా తేలింది. కిందటిసారి ఈ ఓటు విలువ 708 ఉండగా, జమ్మూ-కాశ్మీర్‌ అసెంబ్లీ స్థానాలు లేకపోవడంతో విలువలో మార్పు వచ్చింది.

ఓటు లేని వారు..
లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభసభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో ఆయనకు ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. ఆయన స్థానంలో రాజ్యసభకు ఎన్నికైన గాయత్రి గ్రానైట్‌ అధినేత వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న  కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పదవీకాలం ఇటీవల పూర్తయింది.

ప్రతిపక్ష అభ్యర్థివైపే మొగ్గు

ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్రప్రతి ఎన్నికల్లో తమ ఓటును ప్రతిపక్షాల అభ్యర్థికే వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన ఏదీ చేయకపోయినా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ సీంఎ కేసీఆర్‌ తమవైపే ఉన్నారంటూ ఓ కీలక ప్రకటన చేయడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఓట్లు ప్రతిపక్ష అభ్యర్థికే పడే అవకాశాలు ఉన్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ అధిష్థానం నిర్ణయం మేరకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్‌ సిన్హాకే మద్దతు ఇస్తుంది. ఉమ్మడి జిల్లాలో  బీజేపీ ఎమ్మెల్యేలుగానీ, ఎంపీలుగానీ ఎవరూ లేరు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.