‘ఎరుక’లేని మన ఘన కీర్తి

ABN , First Publish Date - 2022-05-14T06:04:11+05:30 IST

తొలి తెలుగు శాసనం ఎరుకల రాజుది. తొలి తెలుగు రాజ్యం (కాకతీయుల) స్థాపకుడు ఎరుకల నాయకుడంటారు. తొలి తెలుగు కావ్యం (భారతం)లో ఎరుకల చరిత్ర ఉంది. తొలి జానపద కళారూపం యక్షగానంలో ఎరుకల నాయికా నాయకులే....

‘ఎరుక’లేని మన ఘన కీర్తి

ఏకలవ్యుని సంతతివారు ఎరుకలు. కవిత్రయంతో సహా మహాకవులు ఎందరో వారి గురించి వర్ణించారు. తెలుగు శాసనాల్లోనూ వారి ప్రస్తావనలు ప్రముఖంగా ఉన్నాయి. కాకతీయ రాజ్య స్థాపనలో ఎరుకలు ప్రముఖ పాత్ర వహించారని ప్రతీతి. ఎరుకల సోది సుప్రసిద్ధం. మనం మరచిపోయిన మన ఘన చరిత్రలో ఎరుకలు ఎన్నదగినవారు.


తొలి తెలుగు శాసనం ఎరుకల రాజుది. తొలి తెలుగు రాజ్యం (కాకతీయుల) స్థాపకుడు ఎరుకల నాయకుడంటారు. తొలి తెలుగు కావ్యం (భారతం)లో ఎరుకల చరిత్ర ఉంది. తొలి జానపద కళారూపం యక్షగానంలో ఎరుకల నాయికా నాయకులే (సింగి–సింగడు) కనిపిస్తారు. యావత్ దక్షిణ భారతదేశ ప్రజానీకానికి ఎరుక చెప్పేదే ఎరుకల జాతి. అయినా, అనేక కారణాంతరాల వల్ల ఎరుకల గురించి ఎరుకలకే ఏమీ ఎరుక లేకుండా పోయింది. ఆత్మ విశ్వాసం లేనిది ఏ పనీ చేయలేము కాబట్టి, ముందుగా ఎరుకలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడే వారి ఘనమైన చరిత్ర సంస్కృతులను గురించి ఎరుక చేసుకుందాం.


ఎరుకలు ఏకలవ్యున్ని తమ మూల పురుషునిగా భావిస్తారు. ఏకలవ్యుడు నిషాద ప్రజలకు రాజు. అసలు నిషాదుడే వింధ్య పర్వత ప్రాంతాల ఆటవిక ప్రజలకు మొదటి రాజు అని విష్ణు పురాణం చెప్తుంది. నిషాద వంశంలో పుట్టిన కేకయ రాజు కొడుకే ఏకలవ్యుడు అని హరివంశ పురాణం చెప్తుంది. ఏకలవ్యుడు. పాండవులకు పెద్దమ్మ (శుక్రదేవ) కొడుకు, శ్రీ కృష్ణునికి మేనత్త కొడుకు. కేకయ రాజ్యానికి రాజు (ఏకలవ్యుని తండ్రి) పేరును అంశుమంతుడు అని హరివంశ పురాణం పేర్కొనగా, హిరణ్యధన్వుడు అని భారతం పేర్కొన్నది. కేకయరాజు సూతులకు రాజు. సూతుడు అనగా క్షత్రియ పురుషునికి, బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు. కాబట్టి సూతులు సుక్షత్రియులు కారు. క్షత్రియులకు రథకారులుగా వ్యవహరించి వారితో వియ్యపు సంబంధాలు కూడా నెరిపారు. రాజ్యాలు కూడా పరిపాలించారు. కేకయ రాజు క్షత్రియులకే పుట్టినా సూతులకు రాజు కాబట్టి సుక్షత్రియుడు కాడని శూరుడు తన బిడ్డ శ్రుతదేవను అతనికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించాడు. కాని వారి ప్రేమను అంగీకరించి శూరుని కొడుకు వసుదేవుడు వారికి పెళ్ళి చేశాడు. వారి కొడుకు ఏకలవ్యుడు. కారణాంతరాలవల్ల ఏకలవ్యుడు నిషాద ప్రజల మధ్య పెరిగాడు. పరశురాముని అస్త్ర విద్య (బాణ విద్య) నేర్పమని అడిగి ఆయన నిరాకరించగా పాండవుల గురువు ద్రోణాచార్యున్ని సంప్రదించాడు. ఆయన కూడా సుక్షత్రియులు కాని వారికి విలువిద్య నేర్పననగా ఆయన బొమ్మను చేసుకుని, దాని ముందర తానే నేర్చుకొని నిష్ణాతుడయ్యాడు. ఒకనాడు అడవికి వేటకు వచ్చిన పాండవులు ఏకలవ్యుడు వేట కుక్క ముఖానికి నాటునట్లు ఒకేసారి ఏడు బాణాలు సంధించడం చూసి ఆశ్చర్యపోయారు.


అర్జునుడు అసూయపడి ద్రోణాచార్యుని వెంటబెట్టుకుని వచ్చి ఏకలవ్యుని చూపించాడు. ద్రోణుడు గురుదక్షణగా అడిగిన తన కుడిచేతి బొటన వేలును ఏకలవ్యుడు కోసి ఇచ్చాడు. అయినా ఏకలవ్యుని అస్త్ర విద్యా ప్రతిభా పాటవాలు తగ్గిపోలేదు. జరాసంధుడు, పౌండ్రకుడు అనే రాజులకు ఏకలవ్యుడు సర్వసైన్యాధిపతి. శ్రీకృష్ణుడు, బలరాముల రాజ్యమైన మధురపై 18 సార్లు దండెత్తాడు. వారి మరో రాజధాని ద్వారకపై కూడా దాడి చేశాడు. బలరాముడు, శతద్యుమ్నుతో బాణ యుద్ధం, గదా యుద్ధం, మల్ల యుద్ధాలు చేశాడు. అతనికి 88వేల సైన్యం ఉండేది. కొన్నిసార్లు విజయం అంచులదాకా వెళ్ళాడు. భారతంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడే అన్నాడు– ‘నాకే జయింప వీలుకాని వీరులు ఏకలవ్యుడు, జరాసంధుడు. ఈ వీరులనుఁ బోరం జయింపక యాగమునెట్లు సేయజాలుదువు?’ అని! మరో సందర్భంలో కూడా కృష్ణుడే అర్జునునితో ఇలా చెప్పాడు. ‘ఏకలవ్య శిశుపాల జరాసంధులను నీ కోసమే ఒక్కొక్క పద్ధతిలో చంపాను. వాళ్ళు ముగ్గురూ బతికేవుంటే దుర్యోధనుడు వాళ్ళను తెచ్చుకునేవాడు. అప్పుడు ఆ ముగ్గుర్ని ఎదరించడం ఎవరి వల్లా కాదు’.


వెయ్యేళ్ళ నుంచి తెలుగు భాషలో వెలువడుతున్న అన్ని ప్రధాన సంస్కృత సాహిత్య గ్రంథాల్లో ఎరుకల ప్రస్తావనలు చోటు చేసుకున్నాయి. ఆదికవి నన్నయ సంస్కృత భారతంలో ‘నిషాద’ రాజు ఐన ఏకలవ్యుని తెలుగు భారతంలో ‘ఎరుకల’ రాజుగా చిత్రించాడు. తెలుగు భారతం రచించిన కవిత్రయంలో చివరివాడైన ఎర్రన ప్రత్యేక కావ్యం ‘హరివంశం’లో ఏకలవ్యుని చరిత్రను సగౌరవంగా వర్ణించాడు. నాచన సోమన తన ‘ఉత్తర హరివంశం’లో ఏకలవ్యుని యుద్ధ నైపుణ్యాలను వర్ణించాడు. ‘భాగవతం’లో పోతన కూడా ఏకలవ్యుని గురించి రాశాడు. భారత భాగవతాల్లోనే కాకుండా ప్రధాన తెలుగు కవులందరూ తమ గ్రంథాల్లో ‘ఏకలవ్యుడు, ఎరుకలు, ఎరుకల సోదెమ్మ గురించి రాశారు. ఈ వివరాలు మనకు నన్నెచోడుని ‘కుమార సంభవం’, కేతన ‘దశకుమార చరిత్ర’, అల్లసాని పెద్దన ‘మను చరిత్ర’, శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్త మాల్యద’, కాసె సర్వప్ప ‘సిద్ధేశ్వర చరిత్ర’, ధూర్జటి ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’, అన్నమయ్య కీర్తనలలో కనిపిస్తాయి.


శ్రీనివాసుడు (తిరుపతి వెంకటేశ్వరుడు), అహోబిలం నరసింహస్వామి, శ్రీరంగం స్వామివార్ల ప్రణయ / కళ్యాణ ఘట్టాల్లో ఎరుకల సోదెమ్మ ప్రత్యేక పాత్రగా కనిపిస్తుంది. అరవెల్లి వెంకటార్యుడు ప్రత్యేకంగా ‘ఎరుకల యక్షగానం’ రచించాడు. బిజిలి రామయ్య ఎరుకల విద్యా నైపుణ్యం గురించి రాశాడు. యక్షగానాన్ని కొందరు పండితులు తొలి జానపద కళారూపం అని రాశారు. యక్షగానంలో ఎరుకల సింగి–సింగడు హాస్యాన్ని పోషించే అనివార్య పాత్రలుగా కనిపిస్తాయి. సాహిత్యంలో మాత్రమే కాదు, తొలి తెలుగు శాసనాల్లో కూడా ఎరుకల రాజుల ప్రస్తావనలే ఉన్నాయి. కడప జిల్లాలోని కలమళ్ళ ప్రాంతంలో వెలుగు చూసిన సుమారు అరడజను శిలా శాసనాల్లో ‘ఎరికల్ ముతురాజులు’ చేసిన దానధార్మాలు, కట్టించిన గుళ్ళ గురించిన వివరాలున్నాయి. ఎనిమిది వందల ఏళ్ళ కిందట కాకతీయ గణపతిదేవ చక్రవర్తి పాలనా కాలంలో సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో ఎరుక సానమ్మ గుడి, గోపురాలు, మఠాలు కట్టించి, చెరువులు తవ్వించి, పండితులు, విద్యార్థుల శాస్త్రాభ్యాసానికై వసతులు ఏర్పాట్లు చేయించి శిలా శాసనం వేయించింది.


ఎరుకసాని, భీమరాజుల కొడుకు వరివేడి పోతరాజు క్రీ.శ 1243 నాటి మరో శాసనంలో తన తల్లిదండ్రుల ధర్మం పేరిట మల్లీశ్వర దేవుని అరదీపానికి 13ఆవులను దానమిచ్చి శాసనం వేయించాడు. ఎరుక దేవరాజు హనుమకొండలో కాకతీయ రాజ్య స్థాపనలో ముఖ్యపాత్ర కలవాడని ‘సిద్ధేశ్వర చరిత్ర’ ప్రస్తావించింది. తెలుగు దేశ చరిత్రలో మనకు ఎన్నోసార్లు వరాహ విషయం (ప్రాంతం), వరాహాలు (నాణేలు) ప్రస్తావనలు కనిపిస్తాయి. వరాహం అనగా పంది ఎరుకల జీవనంలో ప్రధాన పాత్ర కలది కావడం గమనార్హం.


తెలుగు సమాజంలో ఎరుకల సోది చెప్పే స్త్రీకి ఎంతో ప్రాధాన్యముంది. సోది చెప్పే క్రమంలో ఎరుకల స్త్రీ ఏకతారను మీటుతూ 108 మంది దేవతలను ఏకధాటిగా తలువడం నిరక్షరాస్యురాలైన ఆమె ధారణా శక్తికి నిదర్శనం. మన భవిష్యత్ గురించి ఎరుక చెప్పడం ఆధునిక శాస్త్రీయ కొలతలకు అందని విషయం. తమ భవిష్యత్తు తెలుసుకొని బాధపడేవారికి సోదెమ్మనే తగిన మందులు మాకులిచ్చి ఉపశమనాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచే మరుగు మందులిస్తుంది. పిల్లలు కలిగే ఉపాయాలు చెప్తుంది. మంత్రసానం కూడా చేస్తుంది. తాటాకులతో పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చేసి ఇస్తుంది. ఇలా ఎరుకలమ్మ ఎన్నో విధాలుగా కుటుంబ సంక్షేమానికి దోహదపడుతుంది కాబట్టి ఆమె ‘ఎరుకల నాంచారమ్మ’ పేరిట తెలుగు జానపద గేయాల్లో స్తవనీయురాలైంది, గుహల్లో, గుడుల్లో పూజితురాలైంది.


ఎరుకులకు ప్రత్యేక భాష ఉంది. ఆ భాషలో తెలుగు, కన్నడ భాషా పదాలు కూడా ఉన్నప్పటికీ తమిళ పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. కొన్ని ఉత్తర భారత భాషా పదాలు కూడా అక్కడక్కడా వినిపిస్తాయి. ఎరికల ముతురాజు శాసనాలున్న పెద్ద చెప్పలి (రాజధాని) కైఫీయత్తులో ఉత్తర భారతం నుంచే ముగ్గురు అన్నదమ్ములు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాలు స్థాపించి, గుళ్ళు కట్టించి భూదానాలు చేశారని ఉంది. ఏకలవ్యుడు పరశురామున్ని విలువిద్య నేర్పుమని అడిగినట్లు పురాణేతి హాసాల్లో ఉంది. పరశురాముడు పశ్చిమ ప్రాంతం వాడు. ఇలా మూడు దిక్కుల నుంచి ఉత్తరం, దక్షిణం, పశ్చిమం వలసలుగా వచ్చిన ఎరుకలు తూర్పు వైపు కూడా వెళ్ళారు. కాబట్టి వీరి భాష వీరు ఇటీవల కాలం వరకూ కొనసాగించిన వలస జీవితానికి నిదర్శనంగా కనిపిస్తుంది. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పిలాయిపల్లిలో, ములుగు జిల్లాలోని రామానుజపురంలో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎరుకల నాంచారమ్మ జాతరలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

 డా. ద్యావనపల్లి సత్యనారాయణ

Read more