E-RUPIని ప్రారంభించిన ప్రధాని.. డిజిటల్ పేమెంట్‌కు నయా సొల్యూషన్

ABN , First Publish Date - 2021-08-03T02:17:01+05:30 IST

డిజిట్ పేమెంట్‌కు మరో చక్కని పరిష్కారం లభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఈ-రూపీ (e-RUPI)ని ప్రారంభించారు.

E-RUPIని ప్రారంభించిన ప్రధాని.. డిజిటల్ పేమెంట్‌కు నయా సొల్యూషన్

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్‌కు మరో చక్కని పరిష్కారం లభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఈ-రూపీ (e-RUPI)ని ప్రారంభించారు. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఓచర్. డిజిటల్ పేమెంట్‌కు ఇది నయా సొల్యూషన్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ-రూపీ అనేది డిజిటల్ పేమెంట్ కోసం నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ ఇన్‌స్ట్రెమెంట్.


ఇంకా చెప్పాలంటే, ఇది క్యూఆర్ కోడ్ లేదంటే ఎస్సెమ్మెస్ ఆధారిత ఈ-వోచర్. ఇది లబ్ధిదారుల మొబైల్‌కు డెలివరీ అవుతుంది. కార్డు లేకుండానే యూజర్లు ఈ వోచర్లను రీడీమ్ చేసుకోవడం ద్వారా కార్డ్, డిజిటల్ పేమెంట్స్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లేకుండానే నిరంతరాయంగా సర్వీస్ ప్రొవైడర్స్ వద్ద పేమెంట్స్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేనివారు కూపన్ కోడ్ చెబితే సరిపోతుంది.



ఈ-రూపీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో అభివృద్ధి చేసింది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య సంస్థ కూడా దీని అభివృద్ధిలో భాగం పంచుకున్నాయి. భౌతికంగా ఈ-రూపీ కనిపించనప్పటికీ సర్వీస్ ప్రొవైడర్లు, లబ్ధిదారుల మధ్య చలామణి జరుగుతుంటుంది. లావాదేవీ పూర్తయిన తర్వాత మాత్రమే సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లింపు జరిగినట్టు ఇది నిర్ధారిస్తుంది.


ఇంకా చెప్పాలంటే ఇది ప్రీ-పెయిడ్ స్వభావం కలిగి ఉంటుంది. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే పని పూర్తవుతుంది. సంక్షేమ సేవల్లో అవకతవకలను నివారిస్తుంది. ఈ-రూపీ ఒక విప్లవాత్మక కార్యక్రమమని ప్రభుత్వం అభివర్ణించింది. మాతా శిశు సంక్షేమ పథకాలు, టీబీ నిర్మూలన కార్యక్రమాలు, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి ఎరువుల సబ్సిడీల కింద మందులు, పోషకాహార పథకాల కింద సేవలు అందించేందుకు కూడా ఈ-రుపీని వినియోగించుకోవచ్చు. ప్రైవేటు రంగం కూడా డిజిటల్ వోచర్లను తమ ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సమాజిక బాధ్యత కార్యక్రమాల్లో ఈ డిజిటల్ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. 


ఈ-రూపీ సేవలను ప్రస్తుతం 11 బ్యాంకులు అందిస్తున్నాయి. ఇందులో ఎ‌స్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు కూపన్లు జారీ చేయడమే కాకుండా రీడీమ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. కెనరా బ్యాంక్, ఇండస్ ఇండ్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, యూనియన్ బ్యాంకులు ఈ-రూపీ కూపన్లను జారీ చేస్తున్నప్పటికీ రీడీమ్ చేసుకునే సదుపాయన్ని కల్పించడం లేదు. 

Updated Date - 2021-08-03T02:17:01+05:30 IST