ఉక్కుకు ఎసరు

ABN , First Publish Date - 2021-12-07T06:11:30+05:30 IST

స్టీల్‌ప్లాంటు పరిరక్షణ ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. వ్యూహాత్మక విక్రయం ద్వారా ప్లాంటును ప్రైవేటు సంస్థలు/వ్యక్తులకు అప్పగించి సొమ్ము చేసుకోవాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ సజావుగా సాగేలా లేదని ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రణాళిక రచించింది.

ఉక్కుకు ఎసరు

ప్రైవేటుకు కోక్‌ ఓవెన్‌

స్టీల్‌ ప్లాంటు వ్యూహాత్మక అమ్మకం ప్రక్రియ సజావుగా సాగదేమోనని కేంద్రం అనుమానం

అందుకే...విభాగాల వారీగా కట్టబెట్టేందుకు కుట్ర?

అంగీకరించేది లేదంటున్న కార్మిక సంఘాలు

పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ప్లాంటు పరిరక్షణ ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. వ్యూహాత్మక విక్రయం ద్వారా ప్లాంటును ప్రైవేటు సంస్థలు/వ్యక్తులకు అప్పగించి సొమ్ము చేసుకోవాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ సజావుగా సాగేలా లేదని ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రణాళిక రచించింది. అందులో భాగంగా తొలుత కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ విభాగంలో 3, 4 బ్యాటరీల నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు ఆసక్తి గల సంస్థలు ముందుకు రావాలని ఈ నెల ఒకటో తేదీన ప్రకటన ఇచ్చింది. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా గుర్తించిన కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 300 రోజులుగా దీక్షలు చేస్తుంటే పట్టించుకోకుండా దొడ్డిదారిన ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అంగీకరించేది లేదని, మరింత పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించాయి. ఈ మేరకు కార్మిక సంఘ నాయకులు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని, గట్టిగా నిలదీయాలని కోరాయి. 


కోక్‌ఓవెన్‌ విభాగం చాలా కీలకం

స్టీల్‌ప్లాంటులో కోక్‌ ఓవెన్‌ విభాగం చాలా కీలకం. స్టీల్‌ తయారీకి అవసరమైన కోక్‌ ఇక్కడే తయారుచేస్తారు. దీనిని అనేక ప్లాంట్లు బయట కొనుగోలు చేస్తుండగా, నాణ్యమైన కోక్‌ను విశాఖ స్టీల్‌ సొంతంగా తయారు చేసుకుంటోంది. ఇందుకోసం ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. ఆ కోల్‌ను ఓవెన్లలో బ్యాటరీల ద్వారా 1600 డిగ్రీలతో చార్జింగ్‌ చేస్తే కోక్‌ తయారవుతుంది. దానిని చల్లార్చి బ్లాస్ట్‌ ఫర్నేసుల్లో ముడిఇనుముతో కలిపి మండిస్తారు. అది ముడిఇనుమును ద్రవరూపంగా మారుస్తుంది. కోక్‌ నాణ్యతపైనే స్టీల్‌ నాణ్యత కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఇది చాలా కీలకం. కోక్‌ను తయారుచేసినప్పుడు ఉప ఉత్పత్తిగా గ్యాస్‌ పెద్దమొత్తంలో వస్తుంది. దానిని బ్లాస్‌ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాపులకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అంటే కోక్‌ ఉత్పత్తి తగ్గిస్తే...దాని ప్రభావం మిగిలిన విభాగాలపైనా పడుతుంది. అంత కీలకమైన దానిని ప్రైవేటుకు అప్పగించి, ప్లాంటు మొత్తం కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 


ఆ రెండింటి విలువ రూ.3 వేల కోట్లు

కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ ఏర్పాటు అనేది ఖర్చుతో కూడిన వ్యవహారం. కోక్‌ డ్రై కూలింగ్‌ ప్లాంటు (సీడీసీపీ)తో కలిపి ఒక బ్యాటరీ నెలకొల్పడానికి సుమారు రూ.1,500 కోట్ల వ్యయం అవుతుంది. అందులో 30 టన్నుల కోల్‌ వేసి చార్జింగ్‌ చేస్తే 24 టన్నుల కోక్‌ ఉత్పత్తి అవుతుంది. దాంతో పాటు గ్యాస్‌ వస్తుంది. ఆ గ్యాస్‌తోనే ఇతర విభాగాలను నడుపుతున్నారు. స్టీల్‌ప్లాంటులో 1, 2, 3, 4, 5 నంబర్లతో ఐదు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు ఉన్నాయి. గత 34 ఏళ్లుగా వాటిని ప్లాంటు ఉద్యోగులు విజయవంతంగా నడుపుతున్నారు. ఈ విభాగంలో మొత్తం 1,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు పునరావసం కింద ఉపాధి పొందినవారే కావడం గమనార్హం. ఇప్పుడు వాటిలో 3, 4 బ్యాటరీలను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రకటన ఇచ్చారు. దీనివల్ల సుమారుగా 300 మంది కార్మికులను వెనక్కి తీసుకోవలసి ఉంటుంది. వారిని ప్రస్తుతం వేరే విభాగాలకు తరలించి, కొద్దికాలం తరువాత సెటిల్‌మెంట్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక్కో విభాగం ప్రైవేటుకు ఇచ్చి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే కుట్ర చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


గతంలోను ఇలాగే చేశారు

సీహెచ్‌ నరసింగరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడల్లా యాజమాన్యం దొడ్డిదారిన ఇలాంటి ప్రయత్నాలే చేస్తోంది. గతంలో కూడా ఇలాంటి పనులు చేయబోయి భంగపడ్డారు. ఇంతకుముందు స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌-2ను, థర్మల్‌ పవర్‌ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని యత్నించారు. కార్మికులంతా ఏకమై వాటిని అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా ఆ విధంగానే అడ్డుకుంటాము. ఇలా విడివిడిగా అమ్మితే త్వరగా పని పూర్తి చేసుకోవచ్చుననేది యాజమాన్యం ఆలోచన. అయితే అందుకు మేము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించం.


Updated Date - 2021-12-07T06:11:30+05:30 IST