మద్యం ఉద్యోగుల ‘ఈఎస్‌ఐ’పై మతలబు

ABN , First Publish Date - 2021-08-06T09:10:37+05:30 IST

ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కింద అమలు చేయాల్సిన ఈఎ్‌సఐ వ్యవహారం.. వివాదంగా మారింది. ఒకవైపు ఉద్యోగుల నుంచి, మరోవైపు ప్రభుత్వం నుంచి నెలనెలా ఈఎ్‌సఐకి కట్టాల్సిన మొత్తాలు సంబంధిత ఏజెన్సీకి అందుతున్నా..

మద్యం ఉద్యోగుల ‘ఈఎస్‌ఐ’పై మతలబు

పనిచేయని వైద్య కార్డులు.. యాక్టివేషన్‌ లేదని తిరస్కృతి

మరి కట్టిన సొమ్ము ఏమైంది?

ఒక్కొక్క ఉద్యోగి నుంచి రూ.105 

ప్రభుత్వ వాటా రూ.487 చెల్లింపు

నెల నెలా రెడ్డి ఏజెన్సీకి 60 లక్షలు

ఈఎస్‌ఐకి కట్టారా? దారిమళ్లించారా?

ప్రశ్నిస్తున్న ఉద్యోగులు.. తీవ్ర ఆందోళన


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కింద అమలు చేయాల్సిన ఈఎ్‌సఐ వ్యవహారం.. వివాదంగా మారింది. ఒకవైపు ఉద్యోగుల నుంచి, మరోవైపు ప్రభుత్వం నుంచి నెలనెలా ఈఎ్‌సఐకి కట్టాల్సిన మొత్తాలు సంబంధిత ఏజెన్సీకి అందుతున్నా.. అవి చేరాల్సిన చోటకు చేరుతున్నాయా? లేక దారిమళ్లుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. ఉద్యోగులకు ఇచ్చిన ఈఎ్‌సఐ కార్డులు పనిచేయకపోవడమే. దీంతో సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 2,934 మంది సూపర్‌వైజర్లు, 7,324 మంది సేల్స్‌మెన్‌ పనిచేస్తున్నారు. వీరిని తొలుత 2019లో ‘ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌(ఏపీఎ్‌సబీసీఎల్‌)’ నేరుగా నియమించుకుంది. అనంతరం వారిని.. ‘రెడ్డి ఎంటర్‌ప్రైజెస్‌’ అనే ప్రైవేటు ఏజెన్సీ పరిధిలోకి మార్చారు. ఈ క్రమంలో 2020 నుంచి ఈఎ్‌సఐ వర్తింపజేశారు. అందరికీ ఈఎ్‌సఐ కార్డులు కూడా ఇచ్చారు. దీనికిగాను 2020 ఏడాది ప్రారంభం నుంచి ఏపీఎ్‌సబీసీఎల్‌ కార్పొరేషన్‌ రెడ్డి ఏజెన్సీకి నగదు చెల్లిస్తోంది. ఒక్కో ఉద్యోగికి కార్పొరేషన్‌ నెలకు రూ.487, ఉద్యోగి వాటా కింద రూ.105 వెచ్చిస్తున్నారు.


అంటే నెలకు ఒక్కో ఉద్యోగి తరఫున రూ.592 ఈఎ్‌సఐ కోసం చెల్లిస్తున్నారు. మొత్తంగా రూ.60 లక్షలు ఈఎ్‌సఐ పేరిట రెడ్డి ఏజెన్సీకి జమవుతున్నాయి. కానీ, రెడ్డి ఏజెన్సీ ఇచ్చిన ఈఎ్‌సఐ కార్డులు తీసుకుని ఉద్యోగులు ఆసుపత్రులకు వెళ్తే అవి యాక్టివేట్‌ కాలేదంటూ ఆసుపత్రులు వైద్య సేవలను తిరస్కరిస్తున్నాయి. దీంతో పనిచేయని కార్డులు అంటగట్టారంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈఎ్‌సఐ కింద చెల్లిస్తున్న రూ.60 లక్షలు ఎటు వెళ్తున్నాయనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. రెడ్డి ఏజెన్సీ ఈఎ్‌సఐకి నగదు చెల్లించి ఉంటే ఈపాటికే కార్డులు యాక్టివేట్‌ అయి ఉండేవని, నగదు చెల్లించకపోవడం వల్లే కాలేదని ఉద్యోగులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రతినెలా ఈఎ్‌సఐకి నగదు చెల్లించి ఉంటే కార్డులు యాక్టివేట్‌ కాకపోవడంపై రెడ్డి ఏజెన్సీ ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో జరిగిందని, తమకు న్యాయం చేయాలని మద్యం దుకాణాల సిబ్బంది ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.


మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈఎస్‌ఐ కార్డులు ఇచ్చారు. ప్రతినెలా వారి నుంచి రూ.105 వసూలు చేస్తున్నారు. అది కాకుండా ఒక్కొక్క ఉద్యోగికి రూ.487 ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఈఎస్‌ఐ కార్డులు పనిచేయడం లేదు. 

నగదు చెల్లించినా ఈఎస్‌ఐ కార్డులను యాక్టివేట్‌ చేయడం మరిచిపోవడం వల్లే ఇలా జరిగిందా? లేక అసలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న నగదును సంబంధిత రెడ్డి ఏజెన్సీ ఈఎస్‌ఐకి చెల్లించడం లేదా? 

Updated Date - 2021-08-06T09:10:37+05:30 IST