సోయాతో స్పెషల్‌గా...

ABN , First Publish Date - 2022-05-21T07:27:28+05:30 IST

ఎప్పుడూ గోబీ మంచూరియా తింటే బోర్‌ కొడుతుంది. అందుకే ఈ సారి ఇంట్లో సోయా మంచూరియా ట్రై చేయండి.

సోయాతో స్పెషల్‌గా...

ఎప్పుడూ గోబీ మంచూరియా తింటే బోర్‌ కొడుతుంది. అందుకే ఈ సారి ఇంట్లో సోయా మంచూరియా ట్రై చేయండి. చికెన్‌ కబాబ్స్‌ ప్రతివారం తింటూనే ఉంటారు. కాబట్టి ఈవారం సోయా కబాబ్స్‌ తినండి. సోయాతో చేసే అలాంటి కొన్ని వంటల తయారీ విశేషాలు ఇవి...


సోయా మంచూరియా

కావలసినవి

సోయా- ఒక కప్పు, మైదా- నాలుగు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, కొత్తిమీర- ఒక కట్ట, స్ర్పింగ్‌ ఆనియన్స్‌- కొద్దిగా, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - నాలుగైదు రెబ్బలు, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - అర టీస్పూన్‌, వెనిగర్‌ - ఒక టీస్పూన్‌, గ్రీన్‌ చిల్లీసాస్‌ - ఒక టీస్పూన్‌, డార్క్‌ సోయాసాస్‌ - ఒక టీస్పూన్‌, టొమాటో సాస్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, కార్న్‌స్టార్చ్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం

ముందుగా స్టవ్‌పై ఒక పాత్రలో నీళ్లు పెట్టి మరుగుతున్న సమయంలో సోయాబాల్స్‌ వేసి రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

తరువాత మరొక వెడల్పాటి పాత్రలో చల్లటి నీళ్లు తీసుకోవాలి. వేడి నీళ్లలో నుంచి సోయాను తీస్తూ చల్లటి నీళ్లలో వేయాలి.

చల్లారిన తరువాత సోయా బాల్స్‌ని చేతుల్లోకి తీసుకుంటూ నీళ్లను పిండేయాలి.

అలా నీళ్లను పిండేసిన సోయాముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు చిలకరించి సోయా ముక్కలకు పిండి బాగా పట్టేలా కలుపుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఆ సోయా ముక్కలను వేసి వేయించాలి. గోధుమరంగులోకి మారే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై మరొక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి రెబ్బలు, దంచిన అల్లం, పచ్చిమిర్చి, స్ర్పింగ్‌ ఆనియన్స్‌, ఉల్లిపాయలు వేసి వేయించాలి.

కొద్దిగా కారం, కాస్త ఉప్పు వేసుకోవాలి. కాసేపు వేగిన తరువాత ఒక చిన్నకప్పులో కార్న్‌స్టార్చ్‌ తీసుకుని కొన్ని నీళ్లు పోసి 

ఉండలు లేకుండా కలుపుకొని పోయాలి. 

తరువాత వెనిగర్‌, చిల్లీ సాస్‌, డార్క్‌ సోయా సాస్‌, టొమాటో సాస్‌ వేసి కలుపుకోవాలి. 

ఇప్పుడు వేయించి పెట్టుకున్న సోయా వేసి కాసేపు వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకుని దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.


సోయా కబాబ్స్‌


కావలసినవి

సోయా గింజలు - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, పచ్చిబఠాణీ - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, మిరియాలపొడి - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా. 


తయారీ విధానం

సోయా గింజలను అరగంట పాటు నానబెట్టుకోవాలి. 

బంగాళదుంపలను, పచ్చిబఠాణీలను ఉడికించుకోవాలి.

తరువాత వాటిని ఒక బౌల్‌లో తీసుకుని కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరంమసాల, మిరియాలపొడి, శనగపిండి, తరిగిన ఉల్లిపాయ, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి.

ఈ మిశ్రమాన్ని సమానభాగాలుగా చేసి పుల్లలకు గుచ్చాలి. 

గ్రిల్‌ పాన్‌పై కొద్దిగా నూనె వేసి తిప్పుకొంటూ కాల్చుకుంటే కబాబ్‌లు రెడీ.


సోయా పాన్‌కేక్స్‌


కావలసినవి

సోయా పిండి - 150గ్రాములు, ఓట్స్‌ - 200గ్రాములు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత.


తయారీ విధానం

ఓట్స్‌ని అరగంట పాటు నానబెట్టు కోవాలి.

తరువాత ఓట్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో సోయాపిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. 

అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. మిశ్రమం బాగా చిక్కగా ఉండకుండా చూసుకోవాలి.

స్టవ్‌పై నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి. అయితే పలుచగా కాకుండా మందంగా పోయాలి.


సోయా కర్రీ


కావలసినవి

సోయా - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయలు - రెండు, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, టొమాటోలు - రెండు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

ఒక పాత్రలో మూడు కప్పుల నీళ్లు పోసి మరుగుతున్న సమయంలో సోయా బాల్స్‌ వేయాలి. కాసేపయ్యాక బయటకు తీసి చల్లటి నీళ్లలో వేయాలి. తరువాత చేత్తో పిండి నీరంతా తీసేయాలి.

ఇప్పుడు టొమాటోలు, కొబ్బరి తురుము మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి.

పాన్‌ స్టవ్‌పై పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.

ఇంగువ వేయాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. 

ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 

కాసేపు వేగిన తరువాత టొమాటో పేస్టు వేయాలి. 

కారం, గరంమసాల, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. 

ఇప్పుడు సోయా వేసి కలియబెట్టుకోవాలి. చిన్నమంటపై ఉడికించుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోయాలి చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించుకుని దింపుకోవాలి.


సోయా కట్‌లెట్స్‌

కావలసినవి

సోయా - ఒక కప్పు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి - ఐదారు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - పావు టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, బంగాళదుంపలు - రెండు, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, బ్రెడ్‌క్రంబ్స్‌ - కొద్దిగా.


తయారీ విధానం

స్టవ్‌పై ఒక పాత్రలో నీళ్లు పెట్టి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సోయా బాల్స్‌ని వేయాలి. తరువాత బయటకు తీసి నీరు లేకుండా పిండాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి  అయ్యాక దంచిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.

తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేయించాలి. పసుపు, ధనియాల పొడి, కారం వేసుకోవాలి. గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు బ్లెండ్‌ చేసి పెట్టుకున్న సోయా వేసి కలుపుకోవాలి. కాసేపు వేయించిన తరువాత బౌల్‌లోకి మార్చుకోవాలి. 

అందులో తరిగిన కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంపలు వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ కట్‌లెట్స్‌గా ఒత్తుకోవాలి. 

చిన్న బౌల్‌లో కార్న్‌ఫ్లోర్‌ వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. కట్‌లెట్స్‌ను ఈ కార్న్‌ఫ్లోర్‌ నీళ్లలో డిప్‌ చేస్తూ బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దాలి.

స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌క్రంబ్స్‌ అద్దిన కట్‌లెట్స్‌ వేసి వేయించుకోవాలి.

Updated Date - 2022-05-21T07:27:28+05:30 IST