ఈ– శ్రమ్‌లో ముందడుగు

ABN , First Publish Date - 2021-10-26T05:16:58+05:30 IST

సంఘటితరంగ కార్మికుల వివరాలు నమోదు కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది.

ఈ– శ్రమ్‌లో ముందడుగు

ఇప్పటి వరకూ 93 వేలు..

జిల్లాలో 12 లక్షల మంది  అసంఘటిత కార్మికులు

కార్మికుల పేర్ల నమోదు..రెండో స్థానంలో పశ్చిమ 

ఏలూరు, అక్టోబరు 25 (ఆంధ్ర జ్యోతి): అసంఘటితరంగ కార్మికుల వివరాలు నమోదు కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది. కష్టజీవులందరికీ సామాజిక భద్రత కల్పించేందుకు సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం తీసుకువచ్చిన ఈ– శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల నమోదు వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 93 వేల మంది పేర్లను నమోదు చేసి రాష్ట్రంలోనే రెండోస్థానంలో కొనసాగుతోంది. లక్షా 30 వేల మంది కార్మికుల పేర్ల నమోదుతో తొలిస్థానంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాను అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు కార్మికుల మధ్య విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

రెండు నెలలే గడువు

జిల్లాలో మొత్తం 12 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటారని కార్మిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కాగా వీరి నమోదుకు సమయం చాలా తక్కువగా ఉంది. వీరిలో ఇప్పటి వరకు 93 వేల మంది నమోదు చేసుకోగా మిగిలిన వారి పేర్లు నమోదు చేయడానికి రెండు నెలలు మాత్రమే గడువు ఉంది. డిసెంబరు 31 కల్లా గడువు ముగుస్తుండడంతో ఆలోగా అందరి వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.  

 వెంటాడుతున్న సిబ్బంది కొరత

జిల్లాలో 12 వేల మంది కార్మికులు ఉండగా, కార్మిక శాఖలో 8 ప్రాంతీయ కార్యాలయాలు, ఒక జిల్లా కార్యాలయం మాత్రమే ఉంది. వీటిలో సుమారు 20 మంది లోపు సిబ్బంది ఉంటారు. దీంతో కార్మికుల వివరాల నమోదు అధికారులకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికి లక్ష్యం సాధిస్తామని అధికారులు చెబుతు న్నారు. కార్మిక సంఘాలు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


పేర్లు నమోదు చేసుకోండి 

అసంఘటితరంగ కార్మికులందరూ ఈ–శ్రమ్‌ యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వీటి ఆధారంగానే ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథాకాలు కార్మికులకు అందుబాటు లోకి వస్తాయి. సమయం కూడా తక్కువగా ఉన్న కారణంగా సంఘాలు, యూనియన్లు కూడా చొరవ తీసుకుని కార్మికుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయించి సహకరించాలి

– సుబ్రహ్మణ్యం,ఉప కార్మిక కమిషనర్‌


Updated Date - 2021-10-26T05:16:58+05:30 IST