అడవీ..అక్షరమూ..గొత్తికోయగూడెంలో ముగ్గురు యువకుల అపూర్వ సేవ

ABN , First Publish Date - 2020-11-24T09:57:04+05:30 IST

చిక్కటి అడవి అది... నాగరిక ప్రపంచానికి, సౌకర్యాలకు దూరంగా గిరిజనులు అ క్కడ ప్రకృతితో సహజీవనం చేస్తుంటారు. పోడు వ్యవసాయమే ఆధారంగా బతుకుతుంటారు. అధికారులు దయతలిస్తేనే వారికి

అడవీ..అక్షరమూ..గొత్తికోయగూడెంలో ముగ్గురు యువకుల అపూర్వ సేవ

సొంత ఖర్చులతో  భీం చిల్డ్రన్స్‌ హ్యాపీ సెంటర్‌ ఏర్పాటు

అడవిబిడ్డలకు ఉచితంగా విద్యాబుద్ధులు

అక్షరాలు దిద్దుతున్న 31 మంది చిన్నారులు


మేడారం(ములుగు జిల్లా), నవంబరు 23 : చిక్కటి అడవి అది... నాగరిక ప్రపంచానికి, సౌకర్యాలకు దూరంగా గిరిజనులు అక్కడ ప్రకృతితో సహజీవనం చేస్తుంటారు. పోడు వ్యవసాయమే ఆధారంగా బతుకుతుంటారు. అధికారులు దయతలిస్తేనే వారికి సంక్షేమ పథకాలు అందుతాయి. అధికారులు చొరవ తీసుకుంటేనే వారి పిల్లలను విద్యాసుగంధాలు అలుముకుంటాయి. అనేకానేక చట్టాలు, నిబంధనలు వారి అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుంటాయి.


కరోనా కాలంలో వారి జీవనం మరింత దుర్భరం కాగా, వారిని ఆదుకునే క్రమంలో ముగ్గురు యువకులు ఒక అపూర్వమైన సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.  అడవి బిడ్డలకు అక్షరసుమాలను పంచేందుకు నడుం కట్టారు. సొంత ఖర్చులతో విద్యాబోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రాథమిక వి ద్యను అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి ప్రయత్నం బీబీసీ తె లుగు టీవీ చానెల్‌లో ప్రసారమై ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముగ్గురు యువకులు చేస్తున్న ఈ అపూర్వ కృషి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నీలాలతోగు గొత్తికోయగూడెంలో కొనసాగుతోంది... 


విస్రం సంతోష్‌, శశిధర్‌రెడ్డి, గుణవంతరావు.. ముగ్గురు యువకులు. స్వతహాగా స్నేహితులు. వీరిది తాడ్వాయి మండలం. కొంత సామాజిక సేవా దృక్పథం ఉన్నవా రు. సంతోష్‌ ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా ఇన్‌ సైబర్‌లా చదువుతున్నాడు. ప్రవృత్తిరీత్యా వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌. గత ఏడాది రవీంద్రభారతిలో ఫొటో ఎగ్జిబిషన్‌ కూడా నిర్వహించాడు. ఇక శశిధర్‌రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థలో కొంతకాలం పనిచేశాడు.  గుణవంతరావు వీరి స్నేహితుడు. గత మార్చిలో కరోనా లాక్‌డౌన్‌లో గొత్తికోయలకు నిత్యావసరాలు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని వీరు భుజాలకెత్తుకున్నారు. గిరిజన కుగ్రామాల్లో సరుకులు పంపిణీ చేసుకుంటూ  నీలాలతోగు గొత్తికోయగూడెం చేరుకున్నారు. తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట శివారుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గూడెం ఉంటుంది.  ఇక్కడ 35 కుటుంబాలు నివసిస్తున్నాయి.


ఈ గ్రామానికి నాగరిక ప్రపంచంతో సంబంధాలు లేవు. కనీస వసతులు కానరావు. అసలు ఇక్కడికి వెళ్లడమే సాహసం.  కనీస సౌకర్యాలు లేకుండా దుర్భర జీవితాలు గడుపుతున్న గొత్తికోయలను చూసి చలించిపోయారు. దాదాపు 40 మంది పిల్లలు ఎలాంటి విద్యాబుద్ధులు నోచుకోకుండా ఉంటున్న స్థితి వారికి కనిపించింది. ఊరిని అభివృద్ధి చేయడం తమకు శక్తికి మించిన పని అని భావించి, తమకు చేతనైన, తమకు తెలిసిన పనిని చేయాలని తలిచారు. గొత్తికోయగూడెంలోని పిల్లలకు విద్యాబుద్ధులు అందించాలని నిర్ణయించుకున్నారు. 


ఒక గుడిసె వేసి దానికి  భీం చిల్డ్రన్స్‌ హ్యాపీ సెంటర్‌  అని పే రు పెట్టారు.   దాని ద్వారా పిల్లలకు చదువు నేర్పిస్తామని గొత్తికోయలకు చెప్పారు. అయితే మొదట గూడెంవాసులు అంగీకరించలేదు.  దీంతో  వారికి చదువుపై అవగాహన కల్పించి తాహతు కు మించి ఖర్చు చేసి పలకలు, పుస్తకాలు, దుస్తులు అందించా రు. చదువును విస్మరించవద్దని సూచించారు. చదువుతోనే అభివృద్ధి, ఎదుగుదల ఉంటుందని అర్థమయ్యేలా చెప్పారు. 8వ తరగతి వరకు చదివిన స్థానిక యువకుడిని విద్యావలంటీర్‌గా నియమించారు. దీంతో గొత్తికోయలు తమ పిల్లలను  భీం చిల్డ్రన్స్‌ హ్యా పీ సెంటర్‌కు పంపించడం ప్రారంభించారు. ప్రస్తుతం 31మంది చిన్నారులు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు గుణవంతరావు పూర్తిస్థాయి విద్యావలంటీర్‌గా బోధన చేస్తున్నాడు. సంతోష్‌ తనకున్న సంబంధాల ద్వారా ఆర్థిక సహాయం తీసుకుంటూ సెంటర్‌ నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నాడు. సంతోష్‌, శశిధర్‌రెడ్డి తమకు వీలున్నప్పుడల్లా గొత్తికోయగూడానికి వెళ్లుతూ సెంటర్‌ను పర్యవేక్షిస్తన్నారు. తమ కృషి ద్వారా  అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు పొందుతున్నారు. 


విజ్ఞానాన్ని పంచడమే లక్ష్యం- శశిధర్‌రెడ్డి, సెంటర్‌ వ్యవస్థాపకుడు

కూడు,గుడ్డకు నోచుకోని నిరుపేదలైన గొత్తికోయలు ప్రభుత్వ పథకాలను పొందేవిధంగా అవగాహన కల్పించేందుకు నిరంతరం అడవిలోనే ఉంటూ విజ్ఞానాన్ని అందిస్తున్నాం. ప్రకృతికి విరుద్ధమైన అలవాట్లను మాన్పించేదిశగా చదువు నేర్పించాలని ముగ్గురు యువకులం ఆకాంక్షించాం. పంటలు, పనులు, చెట్లు, జంతువులపై  అవగాహన కల్పిస్తున్నాం. వారు అడవులను వీడి మైదానప్రాంతానికి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. 


చదువు చెప్పడం ఆనందంగా ఉంది - మడకం శ్రీను, గూడెంవాసి

గూడెం నుంచి పాఠశాలకు వెళ్లాలంటే ఆరుకిలోమీటర్లపైనే రెండు ఒర్రెలు దాటుతూ బయ్యక్కపేటకు వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు వెళ్లలేని దుస్థితిలో చదువుకునే ప్రయత్నం చేయలేదు. మా గూడానికి వచ్చి పిల్లలకు చదువు చెప్పడం ఆనందంగా ఉంది. 


అన్నివిధాలా అవగాహన కల్పిస్తున్నారు- పద్దం మల్లేష్‌ , గూడెంవాసి 

మా గూడెంలో కలుషిత నీరు, ఆహారం, వైద్యసదుపాయం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. యువకులు పాఠశాల ఏర్పాటుచేసినప్పటి నుంచి ప్రతి సమస్యపై మాకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ సూచనలు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-24T09:57:04+05:30 IST