అధునాతన సిగ్నళ్లు..ఆలస్యంగా పనులు

ABN , First Publish Date - 2022-06-27T18:01:01+05:30 IST

మహానగరంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రవాణా వ్యవస్థ మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

అధునాతన సిగ్నళ్లు..ఆలస్యంగా పనులు

ఏటీఎస్‎సీ ఏర్పాటులో తీవ్ర జాప్యం  

యేళ్లుగా సా...గుతోన్న వైనం

గ్రేటర్‌లో 334 సిగ్నళ్ల ఏర్పాటు 

ఇప్పటి వరకు పూర్తయ్యింది అంతంతే


సురక్షిత ప్రయాణం, క్రమబద్ధమైన వాహనాల రాకపోకల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో జీహెచ్‌ఎంసీ చేపట్టిన సిగ్నళ్ల ఏర్పాటు సా..గుతోంది. రియల్‌ టైమ్‌ ట్రాఫిక్‌ డేటా ఆధారంగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ రంగులను మార్చే కొత్త అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ కంట్రోల్‌ (ఏటీఎ్‌ససీ)  విధానం రెండేళ్లు దాటినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 


హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రవాణా వ్యవస్థ మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అవలంబిస్తోంది. ప్రధాన మార్గాల్లోని సిగ్నళ్ల వద్ద ఆగకుండా సాగిపోయేలా ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రూ.8,052 కోట్లతో వంతెనలు, అండర్‌పా్‌సలు నిర్మిస్తున్నారు. మెజార్టీ పనులు పూర్తయి అందుబాటులోకి రాగా.. మరిన్ని పురోగతిలో ఉన్నాయి. దీనికి తోడు జంక్షన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా, క్రమపద్ధతిలో వాహనాల రాకపోకలు జరిగేలా ఏటీఎ్‌ససీలో భాగంగా సిగ్నలింగ్‌ వ్యవస్థకు సాంకేతిక హంగులు అద్దుతున్నారు. 


334 ప్రాంతాల్లో సిగ్నళ్లు

ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం సిఫారసు ఆధారంగా జీహెచ్‌ఎంసీ కొత్తగా 96చోట్ల వాహన సిగ్నళ్లు, మరో 70 పెలికాన్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. నగరంలో మొత్తం 384 సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలి. ఇందులో 234 హెచ్‌ట్రిమ్స్‌, 150 ఏటీఎస్‌ సీ సిగ్నల్స్‌ ఉన్నాయి. యూ టర్న్‌లు, వంతెనలు, క్షేత్రస్థాయి పరిస్థితులు అనుకూలంగా లేక 50 చోట్ల సిగ్నల్స్‌ ఏర్పాటు కుదరదని అధికారులు నిర్ణయించారు. మిగతా 334లో హెచ్‌ట్రిమ్స్‌-212, ఏటీఎస్‌ సీ-122 సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు 199 హెచ్‌ట్రిమ్స్‌, 73 ఏటీఎ్‌ససీ సిగ్నళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకుముందే ఉన్న హెచ్‌ట్రిమ్స్‌ సిగ్నళ్లకు సాంకేతిక సహకారమందించగా.. కొత్త సిగ్నళ్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. 44 చోట్ల సిగ్నళ్ల ఏర్పాటు పురోగతిలో ఉంది. 18 పారంతాల్లో సిగ్నళ్ల ఏర్పాటును సంబంధిత శాఖ అధికారులు నిర్ణయించాల్సి ఉంది. 


ఎలా పనిచేస్తుందంటే...

 రెండు నుంచి ఐదు కి.మీ.ల వరకు ఉండే కారిడార్‌ కేంద్రంగా నూతన సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేసేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. నిర్ణీత మార్గంలో వాహనాల రద్దీని బట్టి సిగ్నల్‌ టైమింగ్‌ దానంతటదే మారుతుంది. వాహనాల రాకపోకలను గుర్తించే సెన్సార్‌ను కెమెరాకు అనుసంధానం చేసి.. కొన్ని సెకన్ల పాటు వాహనాలు రాని పక్షంలో సిగ్నల్‌ మారేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. చౌరస్తాలు, సిగ్నళ్ల వద్ద మారుతున్న వాహనాల రాకపోకల ఆధారంగా ఆకుపచ్చ సిగ్నల్‌ సమయాలను తగ్గించడం లేదా పెంచడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.  వాహనాల రాకపోకలు రికార్డు చేసే కెమెరా, గుర్తించే సెన్సార్‌ నిరంతరం పనిచేసేలా.. పవర్‌ బ్యాక్‌ అప్‌ కోసం సోలార్‌, బ్యాటరీ ఏర్పాటు చేయనున్నారు. ఇబ్బందులు, ప్రమాదాలు లేని ప్రయాణం.. వాహనాల రద్దీని బట్టి తక్కువ సమయంలో వెళ్లే వెసులుబాటు నూతన విధానంతో అందుబాటులోకి వస్తుంది.  ఈ సిగ్నల్స్‌ను ముఖ్యంగా ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలు, పాదచారులు ఎక్కువగా ఉండే వాణిజ్య బహిరంగ ప్రదేశాలు వంటి వ్యూహాత్మక ప్రదేశాలలో అమరుస్తారు. మారుతున్న ట్రాఫిక్‌ నమూనాల ఆధారంగా సిగ్నల్‌ సమయాలు మారడం... కెమెరా ఆధారిత ట్రాఫిక్‌ సెన్సార్లు, సౌరశక్తి, బ్యాటరీల ద్వారా పవర్‌ బ్యాకప్‌ ప్రాజెక్టు, మెరుగైన ప్రయాణ సమయ విశ్వసనీయత, జంక్షన్లలో తక్కువగా వేచి ఉండే సమయాలు, నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గింపు లాంటి ప్రయోజనాలు ఉంటాయి.

Updated Date - 2022-06-27T18:01:01+05:30 IST