డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ మరణాల లెక్క... అమెరికన్ పత్రిక కథనంపై భారత్ స్పందన...

ABN , First Publish Date - 2022-04-17T17:39:48+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి కారణంగా సంభవించిన మరణాల సంఖ్యను

డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ మరణాల లెక్క... అమెరికన్ పత్రిక కథనంపై భారత్ స్పందన...

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి కారణంగా సంభవించిన మరణాల సంఖ్యను అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఉపయోగించిన పద్ధతిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్కువ జనాభాగల దేశాలకు ఉపయోగించిన పద్ధతినే భౌగోళికంగా, జనాభాపరంగా పెద్దదైన బారత దేశానికి కూడా వర్తింపజేయకూడదని తెలిపింది. ఓ అమెరికన్ పత్రిక ప్రచురించిన వ్యాసంపై ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. 


ఓ అమెరికన్ పత్రిక ఈ నెల 16న ‘ప్రపంచ కోవిడ్ మరణాల సంఖ్యను బహిరంగంగా వెల్లడించేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషిని భారత్ నిలువరిస్తోంది’ అనే శీర్షికతో ఓ వ్యాసాన్ని ప్రచురించింది. 2021 చివరికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల 15 మిలియన్ల మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసిందని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు ఆయా దేశాలు ప్రకటించినదానికి రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్నాయి. భారత దేశంలో ఈ వ్యాధి వల్ల 40 లక్షల మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. అంటే ప్రభుత్వం ప్రకటించిన మరణాల సంఖ్యకు ఎనిమిది రెట్ల మంది మరణించినట్లు చెప్తోంది. 


దిగ్భ్రాంతికరమైన ఈ అంచనా నివేదికను విడుదల చేయడంలో చాలా నెలలపాటు ఆలస్యం జరిగిందని, దీనికి కారణం భారత ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడమేనని ఈ వ్యాసం పేర్కొంది. భారత దేశంలోని ప్రజల మరణాలను లెక్కించే తీరును వివాదాస్పదం చేస్తోందని, ఎందరు మరణించారో బహిరంగంగా వెల్లడికాకుండా రహస్యంగా ఉంచుతోందని ఆరోపించింది. 


ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. డబ్ల్యూ హెచ్ఓ అనుసరించిన విధానంపై  మాత్రమే  తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, మరణాల సంఖ్యను అంచనా వేయడం వల్ల వచ్చే ఫలితాలపై తాము అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని తెలిపింది. ఈ సమస్యపై నిత్యం, లోతుగా డబ్ల్యూహెచ్ఓతో చర్చించినట్లు తెలిపింది. ఆరు లేఖలు, వర్చువల్ సమావేశాల ద్వారా ఈ విధానంపై ఆందోళనను తెలియజేసినట్లు పేర్కొంది. చైనా, బంగ్లాదేశ్, ఇరాన్, సిరియా వంటి ఇతర దేశాలతో కలిసి ఈ విధానంపై నిర్దిష్టంగా ప్రశ్నించినట్లు తెలిపింది. అనధికారిక సమాచారాన్ని వినియోగించడంపై కూడా ప్రశ్నించామని పేర్కొంది. 


తక్కువ జనాభాగల దేశాలకు వర్తింపజేసిన స్టాటిస్టికల్ మోడల్‌ను భౌగోళికంగా, జనాభా పరంగా పెద్దదైన భారతదేశానికి వర్తింపజేయడంపై అభ్యంతరం తెలిపినట్లు పేర్కొంది. భారత దేశంలోని 18 రాష్ట్రాలకు సంబంధించిన సరిచూడని అనధికారిక సమాచారాన్ని, టైర్-1 దేశాల డేటాను ఉపయోగించడం వల్ల మితిమీరిన మరణాల సంఖ్య వస్తోందని పేర్కొంది. ఇంత తీవ్రమైన వ్యత్యాసం కనిపించడం వల్ల ఈ కసరత్తు చెల్లుబాటు, కచ్చితత్వం గురించి ఆందోళన వ్యక్తమవుతుందని పేర్కొంది. ఈ విధానం కచ్చితమైనది, నమ్మదగినది అయితే, దానిని టైర్ -1 దేశాలన్నిటికీ వర్తింపజేసి, ఫలితాలను అధికారికంగా ప్రకటించాలని తెలిపింది. 


నెలవారీ ఉష్ణోగ్రతలు, నెలవారీ సగటు మరణాల సంఖ్యను అంచనా వేసేటపుడు ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుందని భావించడంలో శాస్త్రీయత ఉండదని, ఇటువంటి ప్రత్యేక వాస్తవ సంబంధాన్ని నిరూపించడానికి ఉపయోగపడదని తెలిపింది. భారతదేశం అనేక రకాల వాతావరణాలు, కాలాల మార్పులు, పరిస్థితులు ఉన్న దేశమని తెలిపింది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఒక్కోసారి కేవలం ఒక రాష్ట్రంలోనే విభిన్న పరిస్థితులు ఉంటాయని తెలిపింది. 18 రాష్ట్రాల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జాతీయ స్థాయి మరణాల సంఖ్యను లెక్కగట్టడం స్టాటిస్టికల్‌గా రుజువయ్యేది కాదని తెలిపింది. 


వయసు-స్త్రీ/పురుష మరణాల నిష్పత్తిని లెక్కించడానికి డబ్ల్యూహెచ్ఓ ఉపయోగించిన విధానంపై కూడా భారత్ అభ్యంతరం తెలిపింది. కోస్టా రికా, ఇజ్రాయెల్, పరాగువే, ట్యునీషియాలలో మరణాల సంఖ్యను ఆధారంగా చేసుకుని భారత దేశంలో మరణాలను వర్గీకరించడం సరైనది కాదని తెలిపింది. తమ అభ్యంతరాలపై డబ్ల్యూహెచ్ఓ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదని పేర్కొంది. 


‘‘భారత దేశానికి సంబంధించిన మితిమీరిన కోవిడ్-19 మరణాల సంఖ్యను ‘న్యూయార్క్ టైమ్స్’ తెలుసుకోగలిగింది కానీ, ఇతర దేశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరం’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. 


Updated Date - 2022-04-17T17:39:48+05:30 IST