ఇసుక మేటలు తొలగేనా.. పంటలు సాగయ్యేనా?

ABN , First Publish Date - 2021-12-24T04:44:46+05:30 IST

ఇసుక మేటలు తొలగేనా.. ఏడాదిలోపు పంటలు సాగయ్యేనా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇసుక మేటలు తొలగేనా.. పంటలు సాగయ్యేనా?
ఇసుకమేట వేసిన జొన్నవాడ పొలాలు

ఆందోళనలో రైతులు 

పట్టించుకోని అధికారులు


బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 23: ఇసుక మేటలు తొలగేనా.. ఏడాదిలోపు పంటలు సాగయ్యేనా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.  మండలంలోని మినగల్లు, పంచేడు నుంచి దామరమడుగు, పల్లిపాళెం వరకు  రోడ్లు, కాలువల కరకట్టలు తెగి మట్టి, పొలాలన్నీ ఇసుక మేటలు వేశాయి.  దీంతో చిన్న, సన్నకారు రైతులు నేటికీ పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది. వరదలకు మినగల్లు వద్ద సవ కతోటలు కొట్టుకుని, ఆ పొలమంతా ఏటిలో కలిసిపోయింది. అయినా ఇంతవరకు ఆ పొలాలను అధికారులు పరిశీలించలేదు. జిల్లా కలెక్టర్‌, కేంద్ర బృందంతోపాటు సీఎం కూడా పర్యటనకు వచ్చారు. ఆ తరువాత  రైతులను పట్టించుకున్నవారు కరువయ్యారు.  పొలాల్లో వేసిన ఇసుక మేటలు తొలగించుకోలేక, గండ్లు పూడ్చుకోలేక సాయం కోసం  రైతులు ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి అధికారులతో సర్వే చేయించి ఇసుకమేటలు తొలగింపు, గండ్లు పూడ్చే చర్యలు చేపట్టాలని రైతాంగం కోరుతున్నది. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి సురేంద్ర రెడ్డిని వివరణ కోరగా, ఇసుక మేటలు 263 ఎకరాలు, కోతకు గురైంది 46 ఎకరాలు, నార్లు దెబ్బతింది 2,300 ఎకరాలు, విత్తనాలు వడ్లు పంపిణీ చేసింది 643 క్వింటాళ్లని తెలిపారు. పరిహారం  కోతకు గురైన పొలం ఎకరాకు  రూ.15వేలు, ఇసుక మేటలు వేసిన పొలంకు రూ. 4880 లుగా పరిహారం కోసం  సర్వేచేసి నమోదు చేశామని ఆయన వివరించారు.



Updated Date - 2021-12-24T04:44:46+05:30 IST