వచన కవిత్వంలో నిత్యనవీన శిల్పం

Dec 6 2021 @ 00:22AM

తగిన ‘‘తోవ ఎక్కడ’’ అంటూ చాల కాలం వెదుకులాడిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు, తాను పని చేయవలసిన రంగాలను తెలిసికొని, తన శక్తియుక్తులు ఎక్కడ సద్వి నియోగం అవుతాయో గ్రహించి, ఆయా రంగాలలో చిరస్మరణీయమైన కృషి చేసారు. అట్లా చేరవలసిన తావుకు చేరుకున్నారు. 


అక్షరాన్నే సాధనంగా, రచనను బాధ్యతగా స్వీకరించిన సుంకిరెడ్డి వారి సాహిత్యయానం సమాంతరంగా నాలుగు మార్గాలలో సాగుతూవచ్చింది. కవిత్వం, విమర్శ, పరిశోధన, సంపాదకత్వం అనేవి వారి అక్షరాయుధానికి నాలుగు అంచులు. తాను ఉన్నది యూనివర్సిటీలోనైనా, శ్రీకాకుళంలో నైనా, నల్లగొండలోనైనా... ఎక్కడ ఉంటే అక్కడ, సామాజిక పరివర్తన దిశగా సాహిత్య చైతన్యాన్ని పరివ్యాప్తం చేయడం ఆయన వ్యక్తిత్వంలోని మరో ముఖ్య పార్శ్వం.


1980 ప్రాంతం నుంచి 1994 ప్రాంతం వరకు రాసిన కవితలు ‘తోవ ఎక్కడ’ (1994) అనే సంపుటిలో ఉన్నాయి. ఇతరులతో కలిసి తెలంగాణ దీర్ఘకవిత ‘నల్లవలస’ (1998)  రాశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన కావ్యం ‘దాలి’ (2001). ఆ తర్వాత రాసిన కవితలు ‘తావు’ (2016) సంపుటిలో ఉన్నాయి. ఇతరులతో కలిసి రాసిన కవితలు మరికొన్ని ఉన్నాయి. ‘విపశ్యన’ (1986-1991) కవిత్వం దీనికి అదనం. ఒకదశలో తోవ ఎక్కడ అనే వెదుకులాట దీనికి ఒక కారణం కావచ్చు. అదే కాలంలో ఆధునికానంతర సిద్ధాంతాల నేపథ్యంలో అంకు రిస్తున్న, మొగ్గ తొడుగుతున్న అస్తిత్వ సాహిత్య ఉద్యమాలను అందిపుచ్చుకొని, ఆయా భావజాలాల వ్యాప్తికి అంకితం కావడం మరో కారణం కావచ్చు. ఈ దశలో వారు చేసిన సబాల్టర్న్‌ సాహిత్య సిద్ధాంతాల, ఆధునికానంతర సిద్ధాంతాల విస్తృత అధ్యయనం పరిగణించదగినది. ఈ అధ్యయన ఫలితాలను ‘గనుమ’ (2010), ‘వినిర్మాణం’ (2021) అనే విమర్శ గ్రంథాల్లో గమనించవచ్చు. ‘ముంగిలి’ (2009), ‘తెలంగాణ చరిత్ర’ (2012) అనే గ్రంథాలు వీరి పరిశోధనాతత్పరతకు నిదర్శనాలు.


కవిత్వరంగంలో దీర్ఘకాలం కొనసాగాలంటే, స్పందనాశీలతను కాపాడుకోవడం మొదటి అవసరం. వస్తు, వ్యక్తీకరణలలో వైవి ధ్యాన్ని సమకూర్చుకోవడం అనివార్యం. సమకాలంతో కలసి నడవడం, రూపపరంగా క్రమ పరిణతిని సాధించడం అత్యా వశ్యకం. తనదైన విలక్షణ శైలి రూపొందడం లేదా రూపొందిం చుకోవడం ఎంత కష్టమో, తన శైలిని తానే చెరిపేసుకుంటూ, శైలీ వైవిధ్యాన్ని శైలీ నవ్యతను సాధించడం అంత కష్టం. 


వచనకవిత్వాన్ని లేదా వచనకవితా ఖండికను మాత్రమే పరి గణనలోకి తీసుకొని పరిశీలిస్తే, రెండు విధాలుగా వైవిధ్యాన్ని చూపించాల్సి ఉంటుంది. వ్యక్తీకరణ పద్ధతులకు, శైలికి సంబం ధించిన నిత్య నూతనత మొదటిది. వచనకవితా ఖండికా నిర్మాణ, నిర్వహణ నవ్యత రెండవది. ఉత్తమ కవితా పఠనం వలన, కవితారచనలో అప్రయత్నంగా ఉత్తమ లక్షణాలు అలవడవచ్చు. కాని సప్రయత్నమైన కృషి కూడా అవసరమే. పైన చర్చించిన అన్ని అంశాలకు సంబంధించి సానుకూల లక్షణాలు కలిగిన తెలుగు కవులలో అగ్రశ్రేణికి చెందిన కవి సుంకిరెడ్డి.


‘‘రాత్రేగా/ తను పోష్టర్లతో కనిపించింది!/ తెల్లారే సరికి/ తానే పోష్టరయ్యిండు!’’ ఇక్కడ మొదటి పోష్టర్‌ కార్యకర్తృత్వాన్ని సూచి స్తుంది. క్రోధ మూలకమైన శోకానికి, వేదనాత్మకమైన ఆవేశానికి, ఉత్తేజాన్ని నింపే అమరత్వానికి, ఇట్లా అనేక భావాలకు సంకేతం రెండవ పోష్టర్‌. ‘‘రాత్రేగా/ ఆ తడి పెదవులు ఆగ్రహంగా కైగట్టినవి!/ తెల్లారేసరికి బిడ్డను ముద్దాడలేని స్థాణువులైనవి!’’ ఇట్లా పరస్పర విరుద్ధమైన అంశాలను ఏకత్ర సమన్వయించడం ద్వారా, పరోక్షంగా వ్యక్తం చేయబడిన తీవ్రమైన అనుతాపం చదువరిని కరిగిస్తుంది. ‘‘కంఠంలో దిగిన తల్వార్‌ నిజం చెప్పదు!/ వాలిన ఈగలు రక్తమంటిన రెక్కలతో బయలెల్లినవి!’’ కంఠంలో దిగిన తల్వార్‌ రాజ్యహింసకు, రక్తమంటిన ఈగలు బయ లెల్లడం అమరుల ఆకాంక్షలను నెరవేర్చే క్రాంతి ప్రస్థానానికి సంకేతాలు. ‘‘ఎవ్వరుగూడ పెదిమల మీది వేలు తీయొద్దు!/ ఎందుకైనా కనుబొమలు పైకెత్తొద్దు!’’ ఇక్కడ రెండు జెష్చర్లు వరుసగా, నిషిద్ధమైన నిరసనను, నేరాలుగా మారే ప్రశ్నలను ధ్వనిస్తాయి. ప్రశ్నలను హత్య చేసే రాజ్యం, సానుభూతిపూర్వక మైన సంవేదనలను కూడా నేరాలుగానే భావిస్తుంది. ఆంక్షలు ఎవరివో, శిక్షలు ఎవరికో, పైరెండు అంగవిన్యాసాలు తెలియ జేస్తూనే, ‘ఆంక్ష’ అనే శీర్షికలోని సార్థకతను ధ్వనిస్తాయి.


మరో కవితాశీర్షిక ‘‘కణాంతార్జాల విచ్ఛేదం’’. శీర్షిక చూడగానే వస్తువును గూర్చి అనేక సందేహాలు కలుగుతాయి. ‘‘దొంగ జొర బడినట్లు/ చెప్పుల చప్పుడైనా వినిపించనీయకుంట/ లోపలి కొస్తుంది!’’ ఈ ఆరంభ వాక్యాలలోని చివరి క్రియ ద్వారా మానవే తరమైన అంశానికి మానవ లక్షణారోపణ చేసినట్లు తెలుస్తుంది. ‘‘గడియారంల ముల్లు ఎక్కడుందో/ క్యాలెండర్‌ ఏ నెలమీద రెపరెపలాడుతుందో/ తెలియనీయకుంట లోపలికొస్తుంది!’’ అనే మాటల ద్వారా, తాను ప్రవేశించిన సమయం కూడ తెలియనీ యకుండ లోపలికొస్తుంది అని తెలుస్తుంది. ‘‘దేహం లోపల అనువైన మెత్తని చోట/ గర్భాశయంల పిండం తావేర్పరచు కొన్నట్టు/ నొప్పి తెలవకుంట’’. దొంగలా ప్రవేశించినదానికి ‘పిండం’తో పోలికను గమనించాలి. తాను గర్భందాల్చిన సమయం స్త్రీకి కూడ మొదట తెలియదు. పిండం, గర్భం లోపల శిశువుగా పరిణామం చెందడంలోనూ స్త్రీ ప్రమేయం ఏమీ ఉండదు. గర్భం దాల్చినప్పుడు ఏ బాధ ఉండదు కాని ప్రసవవేదన మాత్రం అనుభవైక వేద్యం. ‘నొప్పి తెలవకుంట’ అనే మాటలు పరోక్షంగా స్ఫురింపజేసే భావాలివి. ‘‘దేహం లోపల పుట్టలు మొలుస్తవి!’’ పుట్టలు అనగానే, సర్పాల నివాసాలనే భావమే తడుతుంది. పిండంతో పూర్తిగా విరుద్ధమైన పోలిక, వక్తవ్యాంశం మీద ఆసక్తిని పెంపొందిస్తుంది. ‘‘నొప్పి తెలవకుంటనే క్యాలెండర్‌ చినిగిపోవడం’’ అనేది, నొప్పి తెలియకుండనే కాలం గడచి పోతూంటుంది అనే భావానికి వ్యంగ్య వ్యక్తీకరణ. 


‘‘కాటు పడుతుంది/ పడ్డట్టు నొప్పి దెల్వదు!’’ ఇక్కడ ‘కాటు’కు, పుట్టలు పెరగడానికి ఉన్న అన్వయం ఆలోచనామృతం. ‘‘కొప్పు ముడి విప్పితే/ నల్లగా నలుదిక్కులా జుట్టు పరచుకున్నట్టు/ మృత్యుకణాలు విస్తరిస్తవి- తెలవదు!’’ అనే వాక్యం ద్వారా, దొంగలా ప్రవేశించింది మృత్యుకణమని తెలుస్తుంది. ‘కొప్పు ముడి’ అనే ఒక్క మాటతో, ప్రవేశించింది ఒక స్త్రీ దేహంలోనికి అని కవితావస్తువులోని ఒక పార్శ్వం స్ఫురింపజేయబడింది. మృత్యు కణాలు లోలోపల విస్తరించడం వలన చుట్టుముట్టిన విషాదాన్ని సూచించే పోలిక ‘జుట్టు నలుదిక్కులా పరచుకోవడం’. ‘కొప్పు ముడి’లోనే నలుపుదనం తెలుస్తుంది. అయినా ‘నల్లగా’ అనే పునరుక్తి విషాదస్ఫూర్తి కోసమే. ‘‘కాళ్ళ నిస్సహాయతను అందు కొని లోపలి దిగితే తెలిసింది!’’-శరీరానికి నిస్సహాయత, నిస్త్రాణలు ఆవహించడాన్ని సూచించేది ‘కాళ్ళ నిస్సహాయత’. ‘లోపలికి దిగితే’ అనే మాటలు ఆరోగ్యపరీక్షలకు సూచనగా భావించ వచ్చు. ఈ మాటలు, దిగుడు బావిని గుర్తు చేస్తాయి. నీరు అందనప్పుడే బావి లోనికి దిగాల్సిన అవసరం. ఇదే పరంపరగా, ఏవైనా ఇబ్బందులను కలిగించే శారీరక లక్షణాలు బయటపడి నప్పుడే, దేహాంతర్గత అంశాలను గూర్చి ఆలోచించే మానవ స్వభావాన్ని కూడ గుర్తుచేస్తుంది. ‘‘విధి కృతమా/ విధి విధానాల కృతమా/ స్వయం కృతమా’’- ‘విధి కృతం’ అప్రమేయత్వానికి, ‘విధి విధానాలు’ పెట్టుబడి వ్యవస్థ దుర్మార్గ స్వభావం వలన అనివార్యమైన జీవనవిధానానికి, ‘స్వయం కృతం’ దుష్ట వ్యసనా లకు సూచికలు. ‘‘ఇంక దేహం సందేశమిస్తుంది, మించిపోయిం దని!’’ - అంటూ అనివార్యమైన మృత్యువును సూచిస్తూ ఈ కవిత ముగుస్తుంది.


‘తెలవదు’, ‘నొప్పి తెలువకుంట’ అనే మాటలను పలుమార్లు పునరుక్తం చేయడం ద్వారా, ‘మృత్యుకణం’ అనే మాట ద్వారా, దొంగలా ప్రవేశించింది క్యాన్సర్‌ కణమని అర్థమవుతుంది. ‘కొప్పు ముడి’ స్త్రీని సూచించినా, ఈ కవితలో వ్యక్తమైన వేదనంతా పురుషరోగికీ వర్తిస్తుంది. ఈ కవితలో ఎక్కడా క్యాన్సర్‌ అనే మాటను ఉపయోగించకుండా, ఆ వ్యాధి సంక్రమణ విధానాన్ని, తనంత తాను వేగంగా వ్యాపించే క్రమాన్ని, కడదాకా లక్షణాలు బహిర్గతం కాకపోవడాన్ని రకరకాల పోలికలు, ప్రతీకల ద్వారా వ్యంగ్యం చేయడంలోనే ఖండికా నిర్మాణశిల్ప మర్మజ్ఞత ఇమిడి ఉన్నది. కవితావస్తువును గూర్చిన స్పష్టమైన ఎరుక కలిగిన తర్వాతే, ‘కణాంతర్జాల విచ్ఛేదం’ అనే శీర్షిక సార్థకత అర్థమౌతుంది.


‘తావు’ సంపుటిలోని ఇంకో కవిత ‘పావురం’. ‘‘ఎగరదు/ ఎక్కడో వాలదు!/ చేతిలోనే ఉంటుంది/ భూగోళాన్ని తరంగా లతో చుట్టి వస్తుంది!’’ అంటూ పొడుపుకథ లాగా ఈ కవితను ఆరంభించారు. ‘పావురం’ అనే శీర్షికకు అసంబద్ధమైన ‘ఎగరదు’, ‘వాలదు’ అనే క్రియలతో ఆరంభించి ఆసక్తి కలిగించారు. అందుకే పొడుపుకథ లాగ అన్నాను. ‘‘ప్రేయసి ఇది/ విడాకులివ్వలేం/ రాక్షసి ఇది/ కంఠంలో ధరించలేం/ పావురం ఇది/ విసిరి కొట్టనూ లేం!’’ అనే వాక్యాలతో ఈ కవిత ముగుస్తుంది. ఈ వాక్యాలలోని వ్యతిరేకార్థక క్రియల ద్వారా పావురంతో ఉన్న అఖండిత బంధం వ్యంగ్యం చేయబడింది. ఈ క్రియలలో, చదువరులను కూడా తనతో కలుపుకొని చెప్పడం ద్వారా, ఆ పావురంతో అందరిదీ వదులుకోలేని బంధమేనని సూచింప బడింది. ఈ కవితలో చెప్పబడిన లక్షణాలూ, ప్రయోజనాలూ... ఏవీ పావురానికి వర్తించవు. కనుక ఇక్కడ పావురాన్ని వాచ్యార్థంలో ఉపయోగించలేదని తెలుస్తుంది. 


‘‘సీతాకోక చిలుక సిమ్‌ ధరించి’’, అల్లిక జిగి బిగిల చిప్‌ల దాచుకున్న’’ అనే కీలక పదాల ద్వారా వస్తువు ‘సెల్‌ ఫోన్‌’ అని సూచించారు. ‘చేతిలో ఇమిడే హార్మోనియం పెట్టె’, ‘విల్లూ బాణమూ కనిపించని లేఖాస్త్రం’, ‘ఆరవ జ్ఞానేంద్రియం’, ‘చర్మానికి అతుక్కోని దేహభాగం’, ‘దూరతీరాల మధ్య అదృశ్య నావ’, ‘ప్రేమికుల పెదవి’, ‘ఆపదలో అంబులెన్స్‌’ అనే పారదర్శకమైన రూపకాల ద్వారా చాల సమర్థంగా ‘పావురం’, నిజంగా ‘పావురం’ కాదని, సెల్‌ఫోన్‌కు ఉపమానమని చతురతతో స్ఫురింపజేశారు.


ఈ కవితలో ఉపమా వాచకాలు కాని, ఉత్ర్పేక్షా వాచకాలు కాని లేవు. ఈ కవితలోని చాల వాక్యాలు రూపకాల లాగ కని పిస్తాయి. కాని, ఉత్ర్పేక్షా వాచకాలు లేని ‘గమ్యోత్ర్పేక్షలు’గా భావించవచ్చునేమో! ‘నిశ్చల ఏకాంతంలో కందిరీగ కాటు’, ‘చెవిలో జోరీగ’ లాంటి ఒకటి, రెండు మాటల ద్వారా మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన ప్రతికూల అంశాలను కూడ సూచించినప్పటికీ, సానుకూల దృష్టితో సౌకర్యాలను, విస్తృత ప్రయోజనాలను మాత్రమే కవి చెప్పదలచుకున్నారన్నది స్పష్టం. ‘విల్లూ బాణమూ కనిపించని లేఖాస్త్రం’, ‘మోస్ట్‌ అర్జెంట్‌ టెలిగ్రాఫ్‌ను ఓడించి’ అనే మాటల ద్వారా లేఖలకు, టెలిగ్రాములకు కాలదోషం పట్టించి (లేదా పూర్తిగా రద్దు చేసి) ‘మెరుపు వేగ మెసేజీల రాణి’గా మారిందని చెప్పారు. ఒకప్పుడు పావురం, రహస్య సమాచార వాహికగా ఉపయోగపడేదన్న అంశం ఈ పోలికకు మూలం కావచ్చు. ‘తోకలేని పిట్ట’ (లేఖ) అనే పొడుపు కథా వాక్యాన్ని స్ఫురింపజేయదమూ ఉద్దేశం కావచ్చు. ‘పావురం ఇది, విసిరికొట్టలేం’ అనే మాటల ద్వారా సున్నితత్వ సాదృశ్యం వ్యక్తమవుతుంది. 


కవిత్వ, విమర్శ, పరిశోధనా రంగాలలో ఏకకాలంలో పని చేయటంలో ఉండే సమస్యలు క్లిష్టమైనవి. సూత్రప్రాయంగా చెప్పుకోవాలంటే, సంశ్లేషణాత్మకత ప్రధానమైనది కవిత్వం. విశ్లేషణాత్మత ప్రధానమైనది విమర్శ.  కవి, విమర్శకులు అయినవారు ఈ రెండింటి సమతౌల్యం సాధించడంలోని కష్టం అనుభవైకవేద్యమే. ఈ సమతౌల్యాన్ని, సమన్వయాన్ని అభ్యాసంతో సాధించి సఫలమైన కవి, విమర్శకులు, పరిశోధకులు డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డిగారు.

పెన్నా శివరామకృష్ణ

94404 37200

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.