‘శాశ్వత సత్యం’ గుర్తించాలి

ABN , First Publish Date - 2020-09-21T07:05:33+05:30 IST

ఒక జెన్‌ సాధువు జీవిత పర్యంతం మౌనంగా ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక రోజు ఆయన.. ‘రేపు సాయంత్రం నేను మాట్లాడబోతున్నా’ అని చీటిపై రాసి ముఖ్య

‘శాశ్వత సత్యం’ గుర్తించాలి

ఒక జెన్‌ సాధువు జీవిత పర్యంతం మౌనంగా ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక రోజు ఆయన.. ‘రేపు సాయంత్రం నేను మాట్లాడబోతున్నా’ అని చీటిపై రాసి ముఖ్య శిష్యునికి ఇచ్చాడు. మొదటిసారి మాట్లాడబోతున్న గురువు ఏం చెబుతారో అని శిష్యులందరికీ ఆసక్తి కలిగింది. దీంతో ఆ సమయానికి చాలా మంది శిష్యులు అక్కడికి చేరుకొన్నారు. గురువు అందరినీ ఉద్దేశించి.. ‘నేను వారం రోజుల్లో దేహత్యాగం’ చేస్తాను అన్నాడు. ‘‘అయ్యో! గురువుగారు లేక లేక మాట్లాడింది ఈ విషయం చెప్పడానికా’’ అని వారంతా చింతించారు. కానీ, గురువు మాత్రం.. ‘ఇది తప్పక జరిగే సత్యం’ అని మరో చీటీ రాసిచ్చి లోపలికి వెళ్లిపోయాడు. గురువు చెప్పింది నిజమే. ఏది జరిగినా జరగకున్నా తప్పక జరిగేది మాత్రం మృత్యువే. తప్పని మృత్యువును ఆనందంగా స్వీకరించలేక కొట్టుమిట్టాడే మనస్తత్వాన్ని మార్చడమే వేదాంతం అంతిమలక్ష్యం.


తోలుతిత్తి ఘనమంచు తలంచిన

తప్పదు పతనము ధ్రువముగ నమ్ముము

వ్యాధుడు తెచ్చిన చచ్చిన శవమును

వెల యిచ్చి గ్రహింతురు సంతసమున

చచ్చినచో నా శవమును తాకరు

మృత జంతువు కన్నను నరుడధముడు


- అంటాడు మహాత్మా బసవేశ్వరుడు. నశ్వరమైన శరీరం కోసం నానా హింస చేయడం మనుషులకు తగదు. హింస అంటే వధించడం మాత్రమే కాదు. ప్రతి పాపపు పనీ హింసే. అహంకారం, దుర్మార్గం, అణచివేత, డంబాచారం, అసత్య జీవనం, బాధ్యతారాహిత్యం.. ఇవన్నీ ఆధ్యాత్మిక జీవనంలో వదిలిపెట్టాల్సినవే. ఎవరికైతే స్థూల, సూక్ష్మ ప్రపంచాల అనుభవం అవగతం అవుతుందో వారు పరబ్రహ్మతత్వం గ్రహించడం చాలా సులువు. ఈ శాశ్వత సత్యం గ్రహించిన వారే మహాత్ములు. వారు ఇతరుల పట్ల కరుణ, దయను కలిగి ఉంటారు. ‘నీ - నా భేదం’ నశించాక లోకమంతా బంధువర్గమే.


సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతాః దయా సఖా

శాంతి పత్నీ క్షమా పుత్రీ షడైతే మమ బాంధవః


సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయ సఖుడు, శాంతి భార్య, క్షమ పుత్రిక. ఈ ఆరుగురు నా బంధువులు అని సాధకుడు భావించాలి. నీతి శాస్త్రం చెప్పిన ధర్మ సూక్ష్మం కూడా ఇదే. అసలైన సత్యాన్ని గ్రహించడాన్నే తత్వవేత్తలు ‘సంప్రజ్ఞత’ అన్నారు. ఆ స్థితి.. పాలు నెయ్యిగా మారడం లాంటిది. పాల నుండి పుట్టే పదార్థాల్లో అత్యంత రుచికరం. విలువైనది నెయ్యి. భౌతికమైన అన్ని చర్యల్లో నెయ్యి వేటినీ విధ్వంసం చేయకుండా తన రుచినీ, విలువనూ పొందుతుంది. అలాగే సాధకుడు లౌకిక-అలౌకిక విషయాల్లో అలాంటి సాధన వైపు వెళ్లాలి. శాశ్వత సత్యాన్ని అవగతం చేసుకోవాలి.



 డాశ్రీశ్రీ పి.భాస్కరయోగి

Updated Date - 2020-09-21T07:05:33+05:30 IST