ఆద్యంతాలు లేని సత్యం

Nov 26 2021 @ 00:00AM

‘బుద్ధుడు’ అంటే శరీరం కాదు. సిద్దార్థ గౌతముడు జన్మించాడు, పెరిగాడు, బుద్ధుడిగా మారాడు, మరణించాడు. కానీ బుద్ధత్వం అంతకుముందు ఉంది. ఆ తరువాత కూడా ఉంది. అది ఆద్యంతాలు లేని నిత్య సత్యం.


పూర్వకాలంలో బొకుజు అనే జెన్‌ గురువు ఉండేవాడు. ఆయనకు కొన్ని వేల మంది శిష్యులు ఉండేవారు. బొకుజు బౌద్ధ ధర్మాన్ని అనుసరించే గురువే. కానీ... ‘‘బుద్ధుడు ఎప్పుడూ పుట్టలేదు, పెరగలేదు, మరణించలేదు’’ అని బోధించేవాడు. బౌద్ధమతం లోతులను ధ్యానం ద్వారా సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఆయన ‘‘బుద్ధుడు పుట్టలేదు, మరణించలేదు’’ అని చెప్పడం శిష్యులకు ఆశ్చర్యం కలిగించేది. పైగా, ఆయన క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళేవాడు. బుద్ధుడి విగ్రహం ముందు నిలబడి, చేతులు జోడించి, ‘‘నమో బుద్ధాయ’’ అనేవాడు. 


ఇదంతా గమనించిన శిష్యులు ఒక రోజు బొకుజుతో ‘‘మీకేమైనా పిచ్చి పట్టిందా? ‘బుద్ధుడు పుట్టలేదు, పెరగలేదు, బోధించలేదు, మరణించలేదు... అంతా కల్పిత కథే! అంతా పురాణమే! అంతా అబద్ధమే!’ అంటారు. కానీ రోజూ ఆలయానికి వెళ్ళి, బుద్ధుని విగ్రహం ముందు నిలబడి, ఎంతో భక్తితో మొక్కుతారు. మరి బుద్ధుడు అనేవాడు నిజంగా జన్మించకపోయి ఉంటే... మీరు ఎవరికి మొక్కుతున్నారు? ఎవరి బోధను మాకు అందజేస్తున్నారు?’’ అని నిలదీశారు.


శిష్యులు ఇలా ప్రశ్నిస్తే... ఇతర గురువులు ఎంతో కోపగించేవారు. కానీ బొకుజు గట్టిగా నవ్వాడు. శిష్యులు నివ్వెరపోయారు. 


‘‘గురువర్యా! మాకు ఏమీ అర్థం కావడం లేదు. దయచేసి కొంత అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. బుద్ధుడి గురించి మీరు అంటున్న మాటల్లో అర్థమేమిటి? మీరు, మేము ఈ ఆలయంలో కొలుస్తున్న విగ్రహం ఎవరిది? బుద్ధునిది కాదా? చెప్పండి’’ అంటూ చేతులు జోడించి ప్రార్థించారు.


‘‘అవును! ఈ విగ్రహం ఒక వ్యక్తిని సూచించేది కాదు. శూన్యాన్ని సూచించేది. శూన్యం పుట్టిందనీ, పెరిగిందనీ, మరణించిందనీ ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పడం ఎంత వికారంగా ఉంటుంది? ‘బుద్ధుడు’ అనే మాటే తప్పు. ‘బుద్ధత్వం’ అనాలి. అది ఒక వ్యక్తి కాదు. వ్యక్తి పుట్టకముందు, మరణించిన తరువాత కూడా చెక్కుచెదరకుండా నిరంతరం అది ఉంటుంది. సిద్దార్థ గౌతముడు పుట్టాడు, పెరిగాడు, బోధించాడు, మరణించాడు. తనలోని బుద్ధత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు  కాబట్టి ఆయనను ‘గౌతమ బుద్ధుడు’ అనేవారు. తనకన్నా ముందు ఇరవై ముగ్గురు బుద్ధులు ఉండేవారని బుద్ధుడు ఎప్పుడూ చెప్పేవాడు. ‘బుద్ధత్వం’ అన్నా, ‘ప్రజ్ఞానం’ అన్నా, ‘బ్రహ్మం’ అన్నా, ‘జ్ఞానం’ అన్నా... అవన్నీ నిత్యాన్నీ, ఆద్యంతాలు లేని సత్యాన్నీ సూచిస్తాయి. ‘సూర్యుని కన్నా ముందు నేను ఉన్నాను’ అన్న శ్రీకృష్ణుడు తాత్కాలిక, పాంచభౌతిక శరీరాల గురించి చెప్పలేదు. కాబట్టి ‘బుద్ధుడు’ అంటే శరీరం కాదు. సిద్దార్థ గౌతముడు జన్మించాడు, పెరిగాడు, బుద్ధుడిగా మారాడు, మరణించాడు.


కానీ బుద్ధత్వం అంతకుముందు ఉంది. ఆ తరువాత కూడా ఉంది. అది ఆద్యంతాలు లేని నిత్య సత్యం. అందుకే బుద్ధుడు పుట్టలేదు, మరణించలేదు. నేను ఆలయంలో మొక్కేది గౌతముని రూపానికి కాదు... ఆయన బుద్ధత్వానికి’’ అని చెప్పాడు బొకుజు. బుద్ధత్వం భావాతీతం, త్రిగుణ రహితం, జనన మరణ రహితం. దానికే ఆలయంలో ‘సద్గురుం తం నమామి’, ‘నమో బుద్ధాయ’ అంటూ ఆయన ప్రార్థన చేసేవాడు.

రాచమడుగు శ్రీనివాసులు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.