ఐరోపా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-02T01:17:50+05:30 IST

ఐరోపా దేశాల్లో రాబోయే ఎండాకాలంలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా హెచ్చరించింది.

ఐరోపా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ఎన్నారై డెస్క్: ఐరోపా దేశాల్లో రాబోయే ఎండాకాలంలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా హెచ్చరించింది. కోవిడ్‌ను ప్రపంచం పట్టించుకోనంత మాత్రాన ఆ మహమ్మారి ఎక్కడికీ పోదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా శాఖ డైరెక్టర్ హాన్స్ క్లజ్ గురువారం వ్యాఖ్యానించారు. ‘‘కొత్త మార్పులు సంతరించుకుంటూ కరోనా వ్యాపిస్తోంది. ప్రాణాలను తీస్తోంది’’ అని మీడియా సమావేశంలో కామెంట్ చేశారు. ఐరోపా ఖండంలోని 53 దేశాల్లో ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల కేసులు వెలుగు చూస్తున్నాయి. మే నెలాఖరులో దిసరి కేసుల సంఖ్య 1.5 లక్షలు కాగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే కరోనా వ్యాప్తి వేగం పుంజుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఆస్ట్రియా, సైప్రస్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, లక్సెంబర్గ్, పోర్చుగల్ దేశాల్లో కేసుల పెరుగుదల రేటు అధికంగా ఉంది. 


అయితే..ఐరోపా దేశాల్లో విస్తృతంగా అమలవుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కారణంగా ఒకప్పటి దారుణమైన పరిస్థితి మళ్లీ రాకపోవచ్చని హాన్స్ అభిప్రాయపడ్డారు. శ్వాస సంబంధిత సమస్యలు  ఎదుర్కొంటున్న వారు ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. రద్దీ ప్రదేశాల్లో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, అన్ని టీకాలు వేసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా..వ్యాక్సినేషన్‌ను మరింత సమర్థంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వాలను కోరారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే రాబోయే రోజుల్లో విపత్కరి పరిస్థితులు తలెత్తకుండా చేయగలమని చెప్పారు.  

Updated Date - 2022-07-02T01:17:50+05:30 IST