ఎవరికీ పట్టని సీమ ప్రయోజనాలు

ABN , First Publish Date - 2020-10-13T05:42:41+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కమిటీ సమావేశం జరిగిన తీరు చూసాక, కొందరికైనా చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకు రాక మానదు...

ఎవరికీ పట్టని సీమ ప్రయోజనాలు

రాయలసీమ ప్రస్తుత నీటి సమస్యలన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కొందరు సాగునీటి నిపుణులంటున్నారు. జీవో 69 రద్దుతో 834 అడుగుల నుంచే శ్రీశైలం జలాశయం నుంచి సీమకు కేటాయించిన నీటిని పొందే అవకాశం ఉంది. అంతేగాక, దాదాపు 4వేల కోట్లతో చేపట్టే ఎత్తిపోతల వల్ల పొందే లబ్ధిని కేవలం 600 కోట్లతో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా పొందవచ్చని సీమ ఉద్యమకారులు చెబుతూనే ఉన్నారు. అయితే జీవో 69 రద్దును అమలుచేసే ధైర్యం ఏ ప్రభుత్వానికీ లేకపోవడం సీమ దౌర్భాగ్యం. సిద్దేశ్వరం అలుగు అనేది ప్రతిపాదనకే రాదు. ఇలాంటి ప్రత్యామ్నాయాలు జగన్‍కు నచ్చవు. అలా ప్రతిపాదించినవాళ్ళు సీమ ద్రోహలవుతారు కూడా.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కమిటీ సమావేశం జరిగిన తీరు చూసాక, కొందరికైనా చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకు రాక మానదు. రెండు పిల్లుల తగవును కోతి తీర్చే ఆ కథలో నష్టపోయింది రెండు పిల్లులూ, లాభపడింది కోతి. కాని అపెక్స్ కమిటీ తీర్మానాలను, ఆపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బహిరంగ ప్రకటనలను విశ్లేషిస్తే, ఇక్కడ ముగ్గురు ప్రతినిధులూ లబ్ధి చెందారని, నష్టపోయింది మాత్రం ఇరు రాష్ట్రాల కరువు పీడిత ప్రాంత ప్రజలని అర్థమవుతోంది. అందులోనూ ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రాంత ప్రజలే. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను సామంతులుగా మార్చే ప్రయత్నంలో మరొక ముందడుగు వేసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజల సరంక్షకులుగా ఫోజు కొట్టేందుకు ఈ సమావేశం ఉపయోగపడింది.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నిర్మించాలనుకున్న ప్రాజెక్టుల సవివర నివేదికలను నదీజలాల బోర్డులకు సమర్పించాలనే నిర్దేశంతో సమావేశం ముగిసింది. దీనికి అంగీకరించకపోతే ట్రిబ్యునల్, ఆ తర్వాత కోర్టులు ఉండనే ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ లోగా సీమ ప్రజలు సాగు తాగునీటికి అంగలారుస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీల హామీల ఎండమావుల వెంట పరిగెడుతూనే ఉంటారు. వచ్చే ఎన్నికల వరకు జగన్ కెసిఆర్‌ను, కెసిఆర్ జగన్‌ను, ప్రతిపక్షాలు ఆయా ప్రభుత్వాలను నిందిస్తూ ఇరుప్రాంత ప్రజల మధ్య మంటలు రాజేస్తూ చలి కాచుకుంటారు.


ఉద్రిక్త వాతావరణం మధ్య హేతువుకు స్థానం ఉండదని తెలుసు. అయినా కొంత ప్రశాంతంగా ఆలోచిస్తే, ఇచ్చిపుచ్చుకునే విధానంతో ఈ నీటి వివాదాలకు పరిష్కారం లభిస్తుందనే ఆశ కొందరికి ఉంది. మొదటిగా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చూద్దాం. జీవో 69 వల్ల తాము కేటాయించిన నీటిని పొందలేకపోతున్నామనీ, అందుచేత 30 టిఎంసిలను సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచి ఎత్తిపోసుకుంటామని, దానికి తెలంగాణ అభ్యంతరం చెప్పడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన. సీమ ప్రాంతానికి కేటాయించిన నీటికంటే ఎక్కువ వాడుకుంటే అభ్యంతరం చెప్పాలి తప్ప, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడాన్ని అభ్యంతరంపెట్టే హక్కు ఎవరికీ లేదు. అయితే తెలంగాణ వాదన మరోలా ఉంది. ఆ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే హక్కు ఆంధ్రప్రదేశ్‍కు లేదనీ, పోతిరెడ్డిపాడు నుండి 854 అడుగుల పై నుంచే నీటిని తీసుకోవాలనీ (జీవో 69 ప్రకారం), కింది భాగం నుంచి నీరు తోడితే సాగర్ ఎడమ కాలువకు నీరు అందదని తెలంగాణ అంటోంది. పైగా, విభజన చట్టం ప్రకారం కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డుకు సవివర ప్రాజెక్టు నివేదికలను అందించి అనుమతి పొందాకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణమయినా చేపట్టాల్సి ఉంటుందని ఆ రాష్ట్రం వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడ పాలమూరు, డిండి ప్రాజెక్టులను ముందస్తు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యం పెంచిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురు దాడి చేసింది. 


పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వరద జలాలనే తరలించాలనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మరో వాదన. అంటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్లు పూర్తిగా నిండాకే, ఆంధ్రప్రదేశ్‌ తనకు కేటాయించిన 34 టిఎంసిల నీటిని మాత్రమే తరలించాలని అంటున్నది. కేటాయింపులు లేని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు తరలించడం నిబంధనలకు విరుద్ధమని వారి వాదన. అయితే వారి ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు కూడా మిగులు జలాలపై ఆధారపడినవేననే వాస్తవాన్ని తెలంగాణ ప్రభుత్వం మరుస్తోంది. రాయలసీమ ప్రాంతం కృష్ణా బేసిన్‍లో లేదని అందువల్ల కృష్ణా జలాలను బేసిన్‍ ఆవలకు తరలించడం అంతర్జాతీయ జలసూత్రాలకు, గుల్హతీ కమిషన్, బ్రిజేష్ కమిటీల నివేదికలకు విరుద్ధమన్నది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మరో వాదన. అయితే విజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఈ బేసిన్ సూత్రానికి కాలం చెల్లింది. ఇప్పుడు అంతర్జాతీయంగా మిగులు ప్రాంతాల నుంచి అవసరమైన ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. నీరు మానవహక్కులలో ఒకటి. అంతేగాక శ్రీశైలం జలాశయం రాయలసీమలో నిర్మించారని, దానికి సీమ రైతాంగం తెలంగాణ ప్రాంత రైతాంగం కన్నా ఎక్కువ భూములను త్యాగం చేసిందని తెలంగాణ మేధావులు గుర్తుంచుకుకోవాలి. 


రాయలసీమ ప్రస్తుత నీటి సమస్యలన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కొందరు సాగునీటి నిపుణులంటున్నారు. జీవో 69 రద్దుతో 834 అడుగుల నుంచే శ్రీశైలం జలాశయం నుంచి సీమకు కేటాయించిన నీటిని పొందే అవకాశం ఉంది. అంతేగాక, దాదాపు 4 వేల కోట్లతో చేపట్టే ఎత్తిపోతల వల్ల పొందే లబ్ధిని కేవలం 600 కోట్లతో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా పొందవచ్చని సీమ ఉద్యమకారులు చెబుతూనే ఉన్నారు. అయితే జీవో 69 రద్దును అమలుజేసే ధైర్యం ఏ ప్రభుత్వానికీ లేకపోవడం సీమ దౌర్భాగ్యం. సిద్దేశ్వరం అలుగు అనేది ప్రతిపాదనకే రాదు. ఇలాంటి ప్రత్యామ్నాయాలు జగన్‍కు నచ్చవు. అలా ప్రతిపాదించినవాళ్ళు సీమ ద్రోహలవుతారు కూడా.


ఈ దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే ప్రతిపాదనలు అటుంచి, సీమకు తక్షణ లబ్ధి చేర్చే విధాన సవరణలూ ఉన్నాయి. పట్టిసీమ ద్వారా ఆదా అయ్యే 40 టిఎంసిలు, పులిచింతల ద్వారా ఆదా అయ్యే 54 టిఎంసిలను సీమకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వవచ్చు. దీనికి ఏ రాజకీయ నాయకులూ బహిరంగంగా అభ్యంతరం చెప్పలేరు. చంద్రబాబు పట్టిసీమ ద్వారా ఆదా అయ్యే 40 టిఎంసిలను సీమకు కేటాయిస్తానని పదే పదే ప్రకటనలు చేశారు. ఒకవేళ తెలంగాణ వాటాను మినహాయించినా, 27 టిఎంసిలు సీమకు తరలించవచ్చు. అయితే, జగన్ ఈ విధాన అమలుకు సిద్ధంగా లేరు. తను ప్రకటించిన విధానాన్నే వెంటనే అమలు చేయడం జగన్‌కు ఇష్టంలేదేమోననిపిస్తోంది. అలాంటప్పుడు కృష్ణా డెల్టా రైతాంగ కోరికలను కాదని పట్టిసీమ ద్వారా మిగిలిన నీటిని సీమకి కేటాయించే సాహసం జగన్ చేస్తాడనుకోవటం అమాయకత్వం. 


విషాదకరమైన విషయమేమంటే, ఒకవైపు వేలాది టిఎంసిల నీరు సముద్రం పాలవుతుంటే, దాన్ని సద్వినియోగం చేసే పనులు చేపట్టకుండా, భవిష్యత్తులో కృష్ణా నీరు తక్కువగా లభ్యమయినపుడు ఎలా పంచుకోవాలనేదాన్ని వివాదంచేస్తూ ఇరువురు ముఖ్యమంత్రులు కాలం గడుపుతున్నారు. గత సంవత్సరం కృష్ణానది వరదలతో పొంగిపారింది. శ్రీశైలం జలాశయం దాదాపు ఆరుసార్లు నిండింది. కృష్ణానది ద్వారా లభ్యమయిన జలాలు దాదాపు 1,776 టిఎంసిలు కాగా, 1,169 టిఎంసిలు సముద్రం పాలయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అయినా అధిక నీటి లభ్యతను వినియోగించుకోనేలా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు ఆ ప్రయత్నాలేమీ చేయడం లేదు. ఈ సంవత్సరం ఆంధ్రపదేశ్‍లోకి పై రాష్ట్రాల నుంచి ప్రవహించిన నీరు 8,637.14 టిఎంసిలు కాగా, వినియోగించినది కేవలం 706.05 టిఎంసిలు (8.2%) మాత్రమే, ఇక సముద్రం పాలయింది దాదాపు 3 వేల టిఎంసిలు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మొదట లభ్యమయ్యే నీటిని ఆయా ప్రాంతాల అవసరాల ప్రాతిపదికన పంచేలా చూడాలి. కృష్ణలో తక్కువ నీరు లభ్యమయినపుడు ఏ నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలో సామరస్యపూర్వకంగా ఒక అంగీకారానికి రావాలి. గోదావరిలో నీరు పుష్కలంగా లభ్యమవుతుందని, కేటాయించిన నీటిని ఇరు రాష్ట్రాలు పూర్తిగా వినియోగించుకోవడం లేదని, అందువల్ల దశాబ్దాలుగా ప్రతి ఏటా వందలాది టిఎంసిల నీరు సముద్రం పాలవుతోందని చరిత్ర చెబుతోంది. ప్రజల సమస్యలను తమ అధికార సోపానానికి మెట్లుగా వినియోగించుకొనే స్వభావం గల రాజకీయ పార్టీలు, ఆ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాయని అనుకోవటం మన భ్రమే. 


ఈ నీటి వివాదాలు మొదట నదీ జలాలబోర్డులు, తర్వాత అపెక్స్ కమిటీ, తదుపరి ట్రిబ్యునల్, చివరికి సుప్రీంకోర్టు.. ఇలా కొనసాగుతూనే ఉండాలి. అయితే కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాల విషయం ముందడుగులో ఉన్నారు. కానీ, ఆ పని జగన్ చేయలేరు. ఆయనకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరం. ఇక ట్రిబ్యునళ్లు, కోర్టులే శరణ్యం. ఏమైనా వాగాడంబరంతో, వాక్చాతుర్యంతో ప్రజాపక్షపాతులుగా ఇరువురు ముఖ్యమంత్రులు మీడియాలో ప్రచారమయ్యారు. ప్రతిపక్షాలపై పైచేయి సాధించారు. సీమ ప్రజలు తాగు సాగు నీటి అవసరాలను మాత్రం గాలికొదిలేశారు. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు స్వంత ప్రయోజనాలను కొంతమేరకైనా వదులుకొని, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటి తగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరడం కన్నా ప్రజాస్వామ్యవాదులు ఏం చేయగలరు.

అరుణ్ 

కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక

Updated Date - 2020-10-13T05:42:41+05:30 IST