ముంపు గ్రామాల ప్రజలను తరలించండి

ABN , First Publish Date - 2022-07-14T09:05:02+05:30 IST

భారీ వర్షాలు, వరదల వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ముంపు గ్రామాల ప్రజలను తరలించండి

  • రక్షణ చర్యలు కొనసాగించండి
  • విద్యుత్తు సరఫరాకు ఆటంకం వద్దు
  • వీలైన చోట్ల జల విద్యుత్తు ఉత్పత్తి 
  • అత్యవసరమైతేనే ప్రజలు బయటకు
  • 16 దాకా విద్యాసంస్థలకు సెలవులు
  • వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష


హైదరాబాద్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాగులు, నదులు, రిజర్వాయర్లు పొంగి పొర్లుతున్నందున రక్షణ చర్యలను కొనసాగించాలని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, సహాయ చర్యలపై కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ముప్పు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులు చక్కబడేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గాలు, జిల్లాలు విడిచి వెళ్ళరాదని  సంబంధిత జిల్లాల మంత్రులను, ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఆదేశించారు.


కడెం ముంపు గ్రామాల ప్రజల తరలింపు

కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరడం, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ముంపు ప్రమాదం ఉన్న 12 గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడే ఉండి రక్షణ చర్యలు కొనసాగించాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని సీఎం ఫోన్లో ఆదేశించారు. నిర్మల్‌ సహా వరద ముంపునకు గురవుతున్న గోదావరి పరీవాహక ప్రాంత పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ను ఆదేశించారు. వరదల వల్ల ధ్వంసమైన రహదారుల పునరుద్ధరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.

 

భద్రాచలంలో రక్షణ చర్యలు

భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడే వుండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే అక్కడ నుంచి ఖాళీ చేయించాలని పువ్వాడ అజయ్‌ కుమార్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో పంటల పరిస్థితిపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాల వల్ల రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకోవాలని విద్యుత్‌ శాఖ సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. అవకాశమున్న చోట జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించాలన్నారు. 


ప్రజలు సహకరించాలి

రక్షణ చర్యలకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్‌ ఆదేశించారు. అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళవద్దని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యాసంస్థలకు సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-14T09:05:02+05:30 IST