మరణంలోనూ ఆమె వెంటే..

ABN , First Publish Date - 2021-01-25T04:16:51+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట ఒకరి కోసం ఒకరుగా..

మరణంలోనూ ఆమె వెంటే..
రాజమనోహర్‌రావు, సూర్య ప్రభావతి దంపతులు (ఫైల్‌ ఫొటో)

భార్య,భర్తల హఠాన్మరణం

కొద్ది సమయం తేడాతో మృతి

ఎస్‌.కోట పందిరప్పన్న కూడలిలో విషాదచాయలు


శృంగవరపుకోట(విజయనగరం): ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట ఒకరి కోసం ఒకరుగా బతికారు. మాటల్లోనూ.. ఆలోచనల్లోనూ ఒక్కటిగా సాగారు.  అన్యోన్యతకు నిదర్శనంగా కనిపించిన ఆ భార్యభర్తలకు చివరకు మరణం కూడా ఒకేసారి రావడం చూసిన ప్రతి ఒక్కరూ చలించారు. గుండెపోటుతో ఒకరి తరువాత మరొకరు కొద్ది సమయం తేడాలో మృత్యులోకానికి చేరారు. శృంగవరపుకోట పందిరప్పన్న కూడలిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో అర్ధంకి రాజమనోహర్‌ రావు(57), సూర్యప్రభావతి(48) దంపతులు మృతిచెందారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


శ్రీకాకుళం జిల్లా అమదాలవలసకు చెందిన అర్ధంకి రాజమనోహర్‌రావు, సూర్యప్రభావతి దంపతులు ఇరవై ఏళ్ల కిందట ఉద్యోగరీత్యా శృంగవరపుకోటకు వచ్చారు. ఎల్‌ఐసీ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజమనోహర్‌రావు మేనకోడలు వరసైన సూర్య ప్రభావతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి డిగ్రీ చదువుతున్న కుమారుడు రామలిఖిత్‌ ఉన్నాడు. సూర్యప్రభావతి చెల్లెలు ఎం.తేజశ్రీ కూడా వీరితోనే ఉంటోంది. స్థానిక పందిరప్పన్న కూడలిలో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో భార్య, భర్తల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. దంపతులిద్దరికీ ఐబీపీ ఉండడంతో సహజంగానే ఉద్రేకానికి లోనయ్యారు. కోపంతో రాజమనోహర్‌రావు పైఅంతస్థులోకి వెళ్లిపోయారు. ఇంతలో భార్య సూర్య ప్రభావతి అస్వస్థతకు గురైంది. దీన్ని గమనించిన కుమారుడు రామలిఖిత్‌ ఒక పక్క సపర్యలు చేస్తూ, మరో పక్క తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఆయన కిందకు వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వారొచ్చి చూసేటప్పటికి ఆమె మృతిచెందింది. విషయాన్ని తెలియచేసి వారు తిరిగి వెళ్లిపోయారు. భార్య మృతిని తట్టుకోలేని రాజమనోహర్‌రావు కొద్ది సమయం తరువాత ఉన్నచోటే కుప్పకూలాడు. క్షణాల్లో ప్రాణాలు విడిచాడు. 


ఈయన గత ఐదేళ్లగా గుండె జబ్బు, చక్కెర వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు, ఎల్‌ఐసీ ఉద్యోగులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కె.నీలకంఠం దంపతుల కుమారుడు రామలిఖిత్‌తో ఫోన్‌లో మాట్లాడారు.  ఎటువంటి ఫిర్యాదులు లేకపోవడంతో సాధారణ మరణాలుగా భావించి కేసు నమోదు చేయలేదు. వీరి మృతి గురించి తెలుసుకొన్న ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అదివారం దహన సంస్కారాల ఏర్పాట్లను వీరే చేశారు. అయితే దంపతులిద్దరు గొడవ పడిన ఉద్రేకంలో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యకు ఏమైనా పాల్పడ్డారా! అన్న అనుమానాలు స్థానికుల్లో ఉన్నాయి. 


Updated Date - 2021-01-25T04:16:51+05:30 IST