బతికే ఉన్నా సారూ.. పింఛనివ్వండి

ABN , First Publish Date - 2022-01-27T08:42:48+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని చనిపోయిన వారి జాబితాలోకి చేర్చింది.

బతికే ఉన్నా సారూ.. పింఛనివ్వండి


అధికారులకు ఓ వృద్ధురాలి వినతి

శివ్వంపేట, జనవరి 26: అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని చనిపోయిన వారి జాబితాలోకి చేర్చింది. దీంతో తనకు ఆధారంగా ఉన్న వృద్ధాప్య పింఛను నిలిచిపోయింది. చివరికి, నేను బతికే ఉన్నా సారూ పింఛను ఇచ్చి ఆదుకోండి  అంటూ అధికారులను వేడుకుంటోంది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శభా్‌షపల్లి గ్రామానికి చెందిన బుడిగె శివమ్మకు 78 ఏళ్లు ఉంటాయి. శివమ్మ భర్త 2017లో చనిపోయారు. అప్పట్నించి ఆమెకు వృద్ధాప్య పింఛన్‌ వస్తుండగా ఆ డబ్బుతోనే జీవనం సాగిస్తోంది. అయితే, ఏడాదిగా ఆ పింఛను ఆగిపోవడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పింఛను కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయింది. ఇటీవల ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితికి చేరిన శివమ్మ ఇంటికే పరిమితమైపోయింది. అయితే, శివమ్మ అవస్థను గుర్తించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ బాలయ్య.. ఎంపీడీవో అధికారులను సంప్రదించారు. పింఛను ఎందుకు ఆగిపోయిందని వాకబు చేశారు. అయితే, శివమ్మ మరణించనట్టు తమ రికార్డుల్లో ఉందని, అందుకే పింఛను రావడం లేదని అధికారులు చెప్పడంతో బాలయ్య కంగుతిన్నారు. శివమ్మ బతికే ఉందని రికార్డులు సవరించి పింఛను అందేలా చేయాలని వారిని కోరారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. 

Updated Date - 2022-01-27T08:42:48+05:30 IST