కోటి జన్మలెత్తినా, కోతిగానే మిగిలిపోతారు!

ABN , First Publish Date - 2022-09-21T05:59:04+05:30 IST

మోహన్ మనకేమిచ్చాడు? మోహన్ వల్ల మనకి వొరిగిందేమిటి? అంటే ఈ సమాజానికి జరిగిన మేలేమిటి? ఒక జర్నలిస్టు, ఆర్టిస్ట్, యానిమేటర్ అయినందుకే మోహన్ని తలుచుకోవాలా? ఒక కమ్యూనిస్టుగా జనం వెంట...

కోటి జన్మలెత్తినా, కోతిగానే మిగిలిపోతారు!

మోహన్ మనకేమిచ్చాడు? మోహన్ వల్ల మనకి వొరిగిందేమిటి? అంటే ఈ సమాజానికి జరిగిన మేలేమిటి? ఒక జర్నలిస్టు, ఆర్టిస్ట్, యానిమేటర్ అయినందుకే మోహన్ని తలుచుకోవాలా? ఒక కమ్యూనిస్టుగా జనం వెంట నడిచినందుకే మనం మురిసిపోవాలా? అతనెవరసలు? మనకేమౌతాడు? గురజాడ అప్పారావు కాదు, గుడిపాటి వెంకటచలమూ కాదు. పోనీ అతనేమన్నా పాబ్లో పికాసోనా? మైకెలేంజిలోనా? నాంపల్లిలోనూ, లక్డీకాపూల్లోనూ నడిచి తిరిగినవాడు. స్నేహితుల్తో వన్ బై టు చాయ్‌‍లు తాగినవాడు. సిగిరెట్లు కాల్చినవాడు. ఐదు సంవత్సరాల క్రితం 2017 సెప్టెంబర్ 21న చనిపోయిన మోహన్ని ఇంకా ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి?


చిత్తప్రసాద్ అనే ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడని కనిపెట్టి లోకానికి చాటిచెప్పినవాడు మోహన్. అతను మన బెంగాల్ వాడని, దుర్భరమైన పేదరికంలో కూడా అద్భుతమైన చిత్రాలు గీసి ఆ సంపదని మనకి మిగిల్చి వెళ్లిపోయాడనీ చెప్పాడు. బెంగాలీలకు కూడా అంతగా తెలీని ఆ మహా కళాకారుణ్ణి డిస్కవర్ చేసింది మోహన్.


మన బాపు చిత్రాల్లో ఏముంది? పూతరేకుల్లాంటి బొమ్మల్లో ఆ సొగసు ఎలా వచ్చింది? బాపు మహత్తరమైన లైన్ డ్రాయింగుల్లోని అపూర్వ సౌందర్యం వెనక రహస్యం ఏమిటి? సత్తిరాజు లక్ష్మీనారాయణ అనేవాణ్ణి మహోన్నత కళాకారునిగా మనం ఎందుకు గౌరవించుకోవాలి? అనే విషయాన్ని నిజమైన కళ గురించి అంతగా తెలియని మనలాంటి పామరుల కోసం మోహన్ అపురూపమైన వ్యాసాలు నాలుగైదు రాశాడు. బాపు గురించి అంత సాధికారికమైన విశ్లేషణ చేసిన వారింకెవరూ లేరు. మొక్కపాటి కృష్ణమూర్తి, దామెర్ల రామారావు, కొండపల్లి శేషగిరిరావు, ఎంఎఫ్ హుస్సేన్, అలాగే చంద్ర, బాలి, గోపీల గురించి మోహన్ మన కళ్ళు తెరిపించే కొత్త సంగతులు వినిపించాడు.


20వ శతాబ్దానికి రష్యన్ సింబల్‌గా కీర్తినార్జించిన సోవియట్ కార్మికుడూ, వ్యవసాయ క్షేత్రం మహిళ సుత్తీ కొడవలి పట్టుకుని ఉండే కళాఖండాన్ని చెక్కింది ఒక మహిళ. ఆమె రష్యన్ శిల్పి వెరాముఖినా. ఆ మహాశిల్పం ఎత్తు 79 అడుగులు. బరువు 75 టన్నులు. స్టెయిన్‌లెస్ స్టీలుతో చేశారు. 1936లో స్టాలిన్ ఆదేశంతో ముగ్గురు రష్యన్ మహిళలు ఆ శిల్పాన్ని చేసి చరిత్ర సృష్టించారు. ఆనాడు పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో వెరాముఖినా శిల్పం మొదటి బహుమతి గెలుచుకుంది. (వెరాముఖినాపై మోహన్ రాసిన వ్యాసం చాలా ఏళ్ళ క్రితం ‘ఆంధ్రజ్యోతి’లోనే వచ్చింది) జీవితాన్ని కళకే అంకితం చేసిన జర్మన్ మహా కళాకారిణి కేతే కోల్విజ్ గురించి మనకి తెలియజెప్పింది కూడా మోహనే! గొప్ప మలయాళీ రచయిత, ఆర్టిస్టు ఓ.వి. విజయన్ గురించి, ప్రపంచఖ్యాతి పొందిన కేరళ కార్టూనిస్టు, రచయిత అబూ అబ్రహం గురించి తన అందమైన వాక్యాలతో మనకి చెప్పినవాడు మోహన్. 


అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మైకెలేంజిలో, ఇల్యా రిపిన్, హెన్రీ తులూస్ లోత్రెక్, విన్సెంట్ వాంగో, పాల్ గాగిన్, మెక్సికో కళాకారిణి ఫ్రీద... హొకుసాయ్, గుస్తావ్ క్లింమ్ట్... ఇంకా ఇలాంటి గొప్ప ఆర్టిస్టుల జీవితాల్ని మనకోసం రికార్డు చేసినవాడు మోహన్.


ఆంధ్రప్రదేశ్‌కి అసలు యానిమేషన్ అంటే ఏమిటో తెలియని రోజుల్లో, సొంతంగా చదివి తెలుసుకొని, ప్రయోగాలు చేసి, 1995 లోనే తొలి యానిమేషన్ ఫిల్మ్ తీయగలిగినవాడు మోహన్. 2010వ సంవత్సరంలో తీసిన యానిమేషన్ షార్ట్ ఫిల్మ్‌లలో మోహన్ కళానైపుణ్యాన్ని చూసి తీరాలి. అవి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనివి. 


చిన్నప్పుడు ఏలూరులో ఎన్టీ రామారావు, సావిత్రి బొమ్మలు వేయించి, తన సైన్స్ రికార్డులకు రంగుల బొమ్మలు, అక్షరాలు రాయించి ఆర్టిస్టుగా మోహన్‌తో తొలి అడుగులు వేయించింది మా పెద్దక్క సుశీల. పీకతెగినా బాధితులూ, పేదల పక్షానే ఉండాలని మోహన్‌కి ఓ రాజకీయ దృక్పథం ఇచ్చిన వామపక్ష తీవ్రవాది మా నాన్న. 


1998 కావొచ్చు. రామ్‌నగర్ లోని తోట వైకుంఠం ఇంటికి మోహన్ నన్ను, తల్లావఝుల శివాజీనీ తీసికెళ్లాడు. మనం తలెత్తుకుని ‘మా ఆర్టిస్టు’ అని గర్వంగా చెప్పుకోగల తోట వైకుంఠం సాదాసీదాగా ఇంట్లో కింద గచ్చు మీద కూర్చుని ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఇంట్లో తోట వైకుంఠం పెయింటింగ్ ఉండడం గురించి మోహన్ మాట్లాడుతున్నాడు. వైకుంఠం అదేమీ పట్టించుకోకుండా ‘‘అదంతా మార్కెట్ మోహన్. బొమ్మల్ని డబ్బులకి అమ్ముకుంటున్నాం మేం. బొమ్మల విలువ తెలిసీ, నీలాగా త్యాగం చేసిన వాళ్ళం కాదు కదా మేము’’ అంటూనే వలవలా ఏడ్చారు వైకుంఠం. పెద్దాయన కన్నీళ్లు చూసి మేము కొద్దిసేపు తేరుకోలేకపోయాం.


కళ, సాహిత్యం, రాజకీయాలు, ఇష్టపడిన వ్యక్తుల గురించి మోహన్ 45 ఏళ్లపాటు ఎన్నో వ్యాసాలు రాశాడు. ముఖ్యంగా ఆర్ట్ అనేది ఎవరికీ పట్టని, గుర్తింపు లేని వృథాప్రయాస లాంటిదని, ఆర్టిస్ట్ అవ్వాలంటే దానికోసం తపస్సు చేయాలనీ అనేవాడు. ‘‘ఆర్ట్ అనేది విషయం అర్థం చేసుకోడానికి కాదు, ఫీలవ్వడానికి’’ అన్నాడు. కుర్ర ఆర్టిస్టుల కోసం ‘‘ఆర్ట్ టెంపర్‌ని మీరు అందుకోవాలి. ఓరియంటల్ వండర్ లోకి వెనక్కి నడవాలి. మన గీతా, మన రంగూ, మన పాటా తెలుసుకోవాలి. దేవుడు మీ నుదిటి మీద ‘క్లర్క్’ అని, ‘మిలియనీర్’ అనీ రాస్తాడు. ‘ఆర్టిస్ట్’ అని రాయాలంటే సొంత సొమ్మేదో పోయినట్టు ఫీల్ అయిపోతాడు’’ అన్నాడు మోహన్. 


కవిత్వమూ, సాహిత్యమూ, రాజకీయాలూ, సినిమా, మార్క్సిజమూ బాగా చదువుకున్న, లోతైన అవగాహన ఉన్న జర్నలిస్టు మోహన్. భారతీయ చిత్రకళ, చైనా, జపాన్ దేశాల... ఆసియా ఆర్టిస్టుల సుపిరియారిటీ, యూరోపియన్ ఆర్ట్, శిల్పాల గురించి చచ్చేట్టు చదువుకున్నాడు మోహన్. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, రష్యన్ రాజకీయ చరిత్ర మీద పట్టున్నవాడు. తేల్చుకోలేకపోవడం గానీ, a kind of a confusion గానీ మోహన్ కి ఏ కోశానా లేవు. ఏ విషయం పైన అయినా గొప్ప క్లారిటీతో ఉండేవాడు. 


మోహన్‌ది అరుదైన, చురుకైన, సమ్మోహనపరిచే వచనం. ఎంత సీరియస్ విషయం చెబుతున్నా అందులో పదునైన వ్యంగ్యం కలిసి ప్రవహిస్తూ ఉంటుంది. కుర్ర ఆర్టిస్టుల్ని మందలిస్తూ ఒకసారి ఇలా హెచ్చరించాడు మోహన్: ‘‘మానవ మహోద్రేకాలను స్పర్శించి సృష్టించగల శక్తిమంతులైన కళాకారులున్నారు. ఒక్కసారి తలెత్తి వెన్నెలని చూడాలని వాళ్ళ బొమ్మలన్నీ అడుగుతున్నాయి. మమ్మల్ని చూసి, మళ్లీమళ్లీ చూసి గుండెకు పట్టిన తుప్పు వదిలించుకొమ్మని బిర్చి చెట్లూ, తంగేడు పూలూ యుగళగీతం పాడుతున్నాయి. మా రంగుతో, మా రూపంతో జ్వాజ్వల్యమానమైన మా సత్యంతో ఆత్మలు కడగండని మబ్బులూ, గులకరాళ్ళూ, మానవరూపాలూ వేడుకుంటున్నాయి. దయచేసి అమూల్యమైన మీ పనికిమాలిన కాలంలో కొంత వాటికి కేటాయించండి. ఓ కొత్త చూపు కోసం వెతుక్కోండి. వెదుకులాటలో శ్రమపడండి. ఆనందానికీ, సత్యానికీ నిర్వచనమో, అర్థమో తెలియొచ్చు. ‘నో, నో. అయామ్ వెరీ బిజీ’ అంటారా? కోటి జన్మలెత్తినా కోతిగానే మిగిలిపోతారు!’’


ఒక కళాత్మకమైన పరిమళపు తుఫాన్‌లా జీవించిన మోహన్, రాంభట్ల కృష్ణమూర్తి అన్నట్టు చివరిరోజు దాకా ‘డ్రీమర్’గానే బతికిన మోహన్, తాను ప్రేమించిన అమృతా షెర్‌గిల్‌నీ, చిత్తప్రసాద్‌నీ, హేమంత్ కుమార్‌నీ వెంటబెట్టుకుని చేగువేరా ఆదర్శాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.

తాడి ప్రకాష్

(ఈరోజు ఆర్టిస్‌్ట మోహన్ ఐదో వర్ధంతి)

Updated Date - 2022-09-21T05:59:04+05:30 IST