‘ప్రతి ఉద్యోగి టీకా వేయించుకోవాలి’

ABN , First Publish Date - 2021-04-18T05:04:43+05:30 IST

ప్రతి ఉద్యోగి కరోనా టీకా వేయించుకోవాలని తహసీల్దార్‌ వలీబాషా, ఎంపీడీవో అక్బర్‌సాబ్‌ ఆదేశించారు.

‘ప్రతి ఉద్యోగి టీకా వేయించుకోవాలి’

చిప్పగిరి, ఏప్రిల్‌ 17: ప్రతి ఉద్యోగి కరోనా టీకా వేయించుకోవాలని తహసీల్దార్‌ వలీబాషా, ఎంపీడీవో అక్బర్‌సాబ్‌ ఆదేశించారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, పారిశుధ్య కార్మికులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, పారిశుధ్య కార్మికులు 256 మంది ఉన్నారని, అందులో 86 మంది ఇప్పటి వరకు కరోనా టీకా వేయించుకోలేదని తెలిపారు. అయితే వేయించుకోలేని ఉద్యోగులు సోమవారం తప్పకుండా కరోనా టీకా వేయించుకోవాలన్నారు. వేయించుకోని వారు  సెలువుపై వెళ్లవచ్చని కలెక్టర్‌ ఆదేశాలు కూడా జారీ చేశారని తెలిపారు. అలాగే పోలీసులు, రెవెన్యూ, హెల్త్‌ ఉద్యోగులు కరోనా టీకా తీసుకోని వారందరూ తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగులు టీకా వేయించు కోకుండా ప్రజలకు ఎలా అవగాహన కల్పించి టీకాలు వేయిస్తారని ప్రశ్నించారు.  సమావేశంలో వైద్యాధికారి జమీల్‌అహ్మద్‌, ఏపీవో మాధవశంకర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ నాగరాజు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


ఆదోని రూరల్‌: ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కచ్చితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందేనని ఈవోపీఆర్డీ జనార్దన్‌, పెద్దహరివాణం, పెద్దతుంబళం గ్రామ పీహెచ్‌సీ వైద్యులు డా.రామచంద్రుడు, డా.లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ సెక్రెటరీలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ సోమవారం మండలంలోని నాలుగు సెంటర్లు పెద్దతుంబళం, పెద్దహరివాణం పీహెచ్‌సీలలో, ఆరేకల్లు, మండ గిరి సచివాలయాల్లో ప్రత్యేకంగా వాక్సినేషన్‌ నిర్వహిస్తున్నామని, పంచాయతీ, రెవె న్యూ, ఐసీడీఎస్‌, మున్సిపల్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, వెలుగు శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, అధికారులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలి పారు. సమావేశంలో సెక్రెటరీలు విజయలక్ష్మి, చంద్రకళబాయి, నాగమణి, వరలక్ష్మి, నాగరాజు, మల్లయ్య, వేణుగోపాల్‌రెడ్డి, మంజు, వనజ, షేక్‌అహ్మద్‌ పాల్గొన్నారు.

 

కర్నూలు(రూరల్‌): ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌ సూచించారు. రూరల్‌ తహసీ ల్దార్‌ కార్యాలయంలో శనివారం ఎంపీడీవో, వైద్యాధికారులు కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌పై ఇంకా అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలన్నారు. అందులో ఏమైనా సమస్యలు ఉంటే వైద్యాధికారుల దృష్టికి తేవాలన్నారు. వలంటీర్లతో ఇంటింటా సర్వే చేయించాలన్నారు. 


కల్లూరు: కొవిడ్‌ టీకా వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం టీకా తప్పకుండా వేయించుకోవాలని కల్లూరు తహసీల్దార్‌ టీవీ రమేష్‌ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులైన హెల్త్‌ వర్కర్లు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. ఉలిందకొండ, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగులు హాజరై కొవిడ్‌ టీకా వేయించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2021-04-18T05:04:43+05:30 IST