ప్రతిరోజూ పాటించాల్సిన ఆహార నియమాలు.. ఆరోగ్య సూత్రాలు!

ABN , First Publish Date - 2021-11-09T19:00:20+05:30 IST

ఆరోగ్యం.... స్వల్ప వ్యవధిలో చేరుకోగలిగే దగ్గరి గమ్యం కాదు. అందుకు ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం అవసరం. కాలానుగుణంగా ఆహార, జీవన శైలులలో తగిన మార్పులు చేసుకోవడమూ కీలకమే! అందుకోసం...

ప్రతిరోజూ పాటించాల్సిన ఆహార నియమాలు.. ఆరోగ్య సూత్రాలు!

ఆంధ్రజ్యోతి(09-11-2021)

ఆరోగ్యం.... స్వల్ప వ్యవధిలో చేరుకోగలిగే దగ్గరి గమ్యం కాదు. అందుకు ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం అవసరం.  కాలానుగుణంగా ఆహార, జీవన శైలులలో తగిన మార్పులు చేసుకోవడమూ కీలకమే! అందుకోసం...


8 సూత్రాలు

శరీర జీవ గడియారం క్రమం తప్పకుండా ఉండడం కోసం ప్రతి ఉదయం ఒకే సమయానికి మేలుకుంటూ ఉండాలి.

షట్‌ చక్రాలు పునరుజ్జీవం పొందేలా ఉదయం నిద్ర లేచిన వెంటనే 7 సార్లు ముఖం మీద నీళ్లు చల్లుకోవాలి.

జీర్ణం కాని విషపూరిత అవశేషాలు (ఆమం) తొలగిపోయేలా నాలుకను శుభ్రం చేసుకోవాలి.

శరీరంలోని విషాలు బయటకు వెళ్లిపోయేలా పరగడుపున ఆయిల్‌ పుల్లింగ్‌ సాధన చేయాలి.

కండరాలు చైతన్యం పొందడం కోసం నచ్చిన నూనెతో శరీరాన్ని మర్దించుకోవాలి.

రోజుకు కనీసం 15 నిమిషాలపాటైనా ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల రోజంతా స్వాంతనతో ఉండగలుగుతాం.

తేలికైన ఆహారంతో రోజును మొదలుపెట్టాలి.

శరీర దోషానికి తగిన స్నానాన్ని ఎంచుకోవాలి. పిత్త శరీర తత్వం కలిగినవాళ్లు చల్లనీళ్లతో, వాత తత్వం కలిగినవాళ్లు వేడి నీళ్లతో, కఫ తత్వం  కలిగినవాళ్లు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.


సాత్వికాహారం

సమతులాహారం తెలుసు. పోషకాహారం తెలుసు. మరి సాత్వికాహారం అంటే? ఆయుర్వేదం సూచించే ఆ సాత్వికాహారం ఏదో తెలుసుకుందాం!


మానసిక స్పష్టతనూ, శారీరక ఆరోగ్యాన్నీ సమంగా అందించేదే సాత్వికాహారం. ఇలాంటి ఆహారానికి మూడు గుణాలుంటాయి. అవేంటంటే...


సాత్విక: స్వచ్ఛతకూ, స్పష్టతకూ తోడ్పడే ఆహారం సాత్వికమైనది. ఆయా కాలాల్లో పండే సేంద్రీయ పళ్లు, కూరగాయలూ,  హుషారైన గోవు పాలు, మొలకలు, చిక్కుళ్లు, నట్స్‌, విత్తనాలు, తేనె, హెర్చల్‌ టీ... ఇవన్నీ సాత్విక కోవలోకి వస్తాయి. ఈ ఆహారం తాజాగా, తక్కువ పరిమాణాల్లో తీసుకోవాలి. 


రాజసిక: ప్రేరేపించే, మార్పు చెందేలా చేసే ఆహారం ఇది. పరిమితంగా తీసుకున్నప్పుడు కీడు కలిగించని ఆహారమిది. సుగంధ ద్రవ్యాలు, మూలికలు, కెఫీన్‌ పానీయాలు, చాక్లెట్లు ఈ కోవలోకి వస్తాయి. 


తామసిక: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కారణాలపరంగా ఈ ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమే మేలని ఆయుర్వేదం సూచిస్తోంది. వీటిలో మాంసం, చేపలు, గుడ్లు, మద్యం, పాలిష్‌ పట్టిన పదార్థాలు, జంతువులను హింసించి సేకరించిన పాలు, పాల ఉత్పత్తులు ఈ కోవలోకి వస్తాయి. మితిమీరిన సాత్విక ఆహారం కూడా తామసికమే! 


సమస్యలు అదుపులో...

శీతాకాలాన్ని ఆయుర్వేదం హేమంతం, శిశిరం...ఇలా రెండుగా విడగొట్టి చూస్తుంది. చల్లని వాతావరణంతో కఫం ప్రభావితం అవుతుంది. కఫ సమతౌల్యంతో కీళ్లలో కదలికలు, చర్మపు నునుపూ, వ్యాధినిరోధకశక్తీ మెరుగ్గా ఉంటాయి. సంతులనం తప్పి కఫ దోషం పెరిగితే, శరీరం బరువు పెరుగుతుంది. బద్ధకం ఆవరిస్తుంది. కఫంతో కూడిన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు ఆవరిస్తాయి. శీతాకాలం చల్లని, పొడి వాతావరణం వాతాన్ని కూడా ప్రేరేపిస్తుంది. ఫలితంగా కీళ్లనొప్పులు, అజీర్తి సమస్యలు వేధిస్తాయి. కాబట్టి ఈ కాలంలో వాత, కఫాలను నెమ్మదింపచేసే ఆహారం ఎంచుకోవాలి. పెసలు, సజ్జలతో చేసిన కిచిడి, తాజా కూరగాయ పచ్చళ్లు, పాలకూర, ముల్లంగి, మెంతి పరోటాలు, నువ్వులు, క్యారెట్‌ హల్వా,  పెసర హల్వా తింటూ ఉండాలి. బెల్లం, నెయ్యి కలిపి తయారు చేసిన తీపి పదార్థాలు కూడా ఈ కాలంలో తీసుకోవడం అవసరం.

Updated Date - 2021-11-09T19:00:20+05:30 IST