అందరూ డుమ్మా!

ABN , First Publish Date - 2022-05-17T06:36:15+05:30 IST

మంత్రి సురేష్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఎంపీ, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు రైతు భరోసా సభకు డుమ్మా కొట్టారు.

అందరూ  డుమ్మా!
రైతు భరోసా చెక్కును అందజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

రైతు భరోసా  సభలో కనిపించని వైసీపీ నేతలు 

మంత్రితోపాటు ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు 

గడపగడపకులో కొనసాగుతున్న  ద్వితీయశ్రేణి బహిష్కరణలు 

వెలవెలబోయిన  రెండు కార్యక్రమాలు  

మంత్రి సురేష్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఎంపీ, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు రైతు భరోసా సభకు డుమ్మా కొట్టారు. సోమవారం రైతు భరోసా కింద రైతులకు నాల్గో  ఏడాది తొలి విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. గతంలో ఇంటికే పరిమితమైన సీఎం ఏలూరు వెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే గతంలో కలెక్టరేట్‌కే పరిమితమైన కార్యక్రమాన్ని ఈ దఫా బహిరంగ వేదికలో చేయాలని ఆదేశాలం దాయి. ఆ మేరకు జిల్లా కార్యక్రమం ఆర్భాటంగా జరగాల్సింది పోయి నిరుత్సాహంగా సాగింది. దానికి పార్టీ నేతలు అందుబాటులో లేకపోవటమే కారణం. ఒంగోలులో కాకుండా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో.. అందులోనూ ఒక హోటల్లో ఏర్పాటు చేయటం, మంత్రితో పాటు ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు జిల్లాలోనే లేకపోవటంతో సభ బోసిపోయింది. మరోవైపు సోమవారం జిల్లాలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు కూడా వెలవెలబోయాయి. ఎస్‌ఎన్‌పాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొనగా ఆ రెండుచోట్లా ద్వితీయశ్రేణి ముఖ్య నాయకులు  బహిష్కరించి నిరసనను తెలిపారు. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రైతు భరోసా నాల్గో సంవత్సరం తొలివిడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం నిర్వహించింది. గతంలో సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయాల నుంచే ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, లబ్ధి విడుదలలు నిర్వహించేవారు. ఇటీవల ఆయన ఈ కార్యక్రమాలను ప్రారంభోత్సవ సభలను ఏదో ఒక జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్నారు. తదనుగుణంగా జిల్లాల్లో కూడా కలెక్టరు కార్యాలయాల్లో కాకుండా బహిరంగ వేదికలపై కార్యక్రమాలు నిర్వహించటం ప్రారంభించారు. అందులోభాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భావించిన కలెక్టరు, ఇతర అధికారులకు చుక్కెదురైంది. స్థానిక ఎమ్మెల్యేలు లేకుండా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోగా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఒత్తిడి చేసి మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. ప్రకాశం భవన్‌లోని స్పందన భవన్‌లో కార్యక్రమం నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోవటంతో ఎస్‌ఎన్‌పాడుకి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. 


కావాలనే గైర్హాజరా..?

అయితే వెల్లంపల్లిలో జరిగిన కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ రాకపోవటం విశేషం. ఆయన కర్నూలులో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలినేని అందుబా టులో లేనందునే సురేష్‌ గైర్హాజరయ్యారన్న అనుమానాలు లేకపోలేదు. అయితే ఆ పార్టీకి చెందిన కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, మద్దిశెట్టి వేణుగోపాల్‌, అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డిలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బుర్రా కూడా హాజరుకాకపోవటం విశేషం. వీరికి తోడు అధికారిక కార్యక్రమాలకు గైర్హాజరయ్యే అలవాటు లేని ఎంపీ మాగుంట కూడా రైతుభరోసా సభకు హాజరుకాలేదు.  ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబంతో విదేశాల్లో ఉన్నారు. 


అందుబాటులో లేని ఎమ్మెల్యేలు

మూడు రోజులు నియోజకవర్గంలో ఉంటే మరో నాలుగు రోజులు తమ నివాసాలు ఉన్న బెంగళూరులో ఉండేందుకు అలవాటుపడిన కనిగిరి, దర్శి ఎమ్మెల్యేలు సోమవారం నియోజకవర్గంలో కూడా లేరు. కారణం ఏమైనా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా సోమవారం నియోజకవర్గంలో లేరు. నిన్న మొన్నటివరకు నియోజకవర్గంలో పర్యటించిన మాగుంట కూడా వేరే కార్యక్రమం కోసం చెన్నై వెళ్లారు. వీరంతా నిజంగా వివిధ పనులతో బయట ఉన్నారా లేక బాలినేని లేని సమయంలో మనమెందుకులే అని కార్యక్రమానికి దూరంగా ఉన్నారా అనే అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా మంత్రి సురేష్‌ గైర్హాజరవటంపై ఈ విధమైన చర్చ జరుగుతుండటం విశేషం.


కొనసాగుతున్న బహిష్కరణలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాలలో ద్వితీయశ్రేణి నాయకుల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. వైపాలెం ఎమ్మెల్యే అయిన మంత్రి సురేష్‌, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఒంగోలు ఎమ్మెల్యేలు జిల్లాలో లేనందున వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ప్రాధాన్యత రాలేదు. ఎస్‌ఎన్‌పాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, కె.నాగార్జునరెడ్డిలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుధాకర్‌బాబు మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో పాల్గొనగా  పార్టీ మండల కన్వీనర్‌ మండవ అప్పారావు కార్యక్రమాన్ని బహిష్కరించారు. పైపెచ్చు ఆయన తాను సీఎం జగన్‌కు, పార్టీకి విఽధేయుడినని, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పార్టీ వ్యతిరేక విధానాలు నచ్చకే కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు లిఖితపూర్వక ప్రకటన చేశారు. అలాగే మండలానికి చెందిన మరికొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించారు. తొలుత ఆయన ఎన్‌జీపాడు మండలంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీపీ, జడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు లాంటి ముఖ్యులు బహిష్కరించటం తెలిసిందే. అనంతరం ఆయన  పార్టీ మండల అధ్యక్షుడిని మార్చినట్లు ప్రకటన చేస్తూ అసమ్మతివాదులకు హెచ్చరిక కూడా ఇచ్చారు. అయినా సోమవారం మద్దిపాడు మండలంలో జరిగిన కార్యక్రమాన్ని పార్టీ మండలాధ్యక్షుడు బహిష్కరించటం చర్చనీయాంశమైంది. అందిన సమాచారం మేరకు పక్షంరోజుల క్రితం నియోజకవర్గంలోని అన్ని మండలాల అసమ్మతి నాయకులు ఎస్‌ఎన్‌పాడు మండలం మైనంపాడులో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే సుధాకర్‌బాబుపై ఎదురుదాడి ప్రారంభించినట్లు సమాచారం.


జడ్పీటీసీ సభ్యురాలు దూరం

మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తర్లుపాడు మండలం తాడివారిపల్లిలో గడపగడపకు కార్యక్రమం నిర్వహించగా ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు వెన్నా ఇందిర కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఆది నుంచి ఆమె భర్త వైసీపీ నాయకుడు హనుమారెడ్డి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉండటంతో ప్రాధాన్యం లభించలేదు. అయితే గ్రామ ఎంపీటీసీ సుజాత కూడా కార్యక్రమాన్ని బహిష్కరించటం విశేషం. ఇక జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో కూడా మాజీ ఇన్‌చార్జి వెంకయ్య కార్యక్రమం బహిష్కరణ విధానాన్ని కొనసాగిస్తున్నారు. 


రైతు కుటుంబాలకు భరోసా

జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ

 విత్తనాల సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రతి రైతు కుటుంబానికి భరోసా కల్పిస్తున్నామని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. మండలంలోని వెల్లంపల్లిలోని ఓ హోటల్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ రైతుభరోసా, పీఎం కిసాన్‌ లబ్ధి విడుదల కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మూడేళ్లలో రైతుభరోసా పథకం కింద రూ.40,500 సాయం ప్రతి రైతుకు అందిందన్నారు. మహిళలు రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్‌రెడ్డికి ఓటేసి వైసీపీ విజయానికి నాంది పలుకుతారన్నారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. సీజన్‌ ముందు రైతులకు పంట పెట్టుబడిగా జిల్లాలో రూ.203కోట్లు వారి అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నామన్నారు. మూడేళ్లల్లో రైతులకు రూ.1,558 కోట్లు అందించామన్నారు. రైతులు, కౌలురైతులు వినియోగించుకోవాలని గ్రామాల్లో ఆర్బీకేలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, డీఏవో శ్రీనివాసరావు, ఏడీఏ సుభాషిణి, డీపీఎం రవీంద్రబాబు, హార్టికల్చర్‌ అధికారి వెంకటేశ్వరరావు, ఇనగంటి పిచ్చిరెడ్డి, మారెళ్ల బంగారుబాబు, దుంపా చెంచిరెడ్డి, అయ్యన్న, పోతినేని శ్రీనివాసరావు, నర్రా సురేష్‌ పాల్గొన్నారు. 






Updated Date - 2022-05-17T06:36:15+05:30 IST